ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చెట్టు దిగులు : --డా.. కందేపి రాణీప్రసాద్.
November 20, 2020 • T. VEDANTA SURY • Story

రెండు పెద్ద చెట్లు పక్కపక్కనే ఉన్నాయి. ఆ రెండు మంచి స్నేహితులు. రోజూ చక్కగా మాట్లాడుకుంటాయి. తమ కష్టసుఖాలను ఒకళ్లకోకళ్లు చెప్పుకుంటాయి. సంతోషంగా ఉన్నపుడు తమ తలలు తాటించుకొని నవ్వుకుంటాయి. బాధల్లో ఉన్నప్పుడుకొమ్మల చేతుల ద్వారా ఒకరి కన్నీళ్లను మరొకరు తుడిచి కష్టాన్ని పంచుకుంటాయి. ఇంత స్నేహంగా ఉన్న ఈ రెండు చెట్ల మధ్యలో ఒక ప్రహరీ గోడ ఉన్నది. ఈ ప్రహరీ గోడ ఒక స్కూలుది. ఇందులో ఒక చేట్టెమో చిన్న పిల్లల స్కూలులో ఉన్నది. మరొక చేట్టెమో స్కూలు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నది. దీనికో సమస్య. ఆ స్థలం ఖాళీగా ఉంది కదా అని ఆ వీధి వారందరూ చెత్త అక్కడే తెచ్చి పోస్తారు. ఆ వాసన భరించలేక ఆ చెట్టు రోజూ బాధపడుతూ ఉంటుంది. అదే సమస్యను తన మిత్రునితో చెప్పి తన బాధల బరువును కొంత తగ్గించుకుంటుంది. ప్రహరీగోడ అడ్డుగా ఉన్నా ఆ రెండింటి స్నేహానికి ఏ అడ్డంకి రాలేదు. రెండు వేర్వేరు ఇళ్ళలో పుట్టినా ఒకటే మనసు ఒకటే ప్రాణంగా పెరిగాయి.
 ఖాళీ స్థలంలో ఉన్న చెట్టు, స్కూల్లోని చెట్టుని చూసి మురిసిపోతుంది. ఎంత అదృష్టం తన మిత్రునికి. రోజూ తనాల దుర్గంధం పీల్చుకుంటూ బతకాల్సిన ఖర్మలేదు. పైగా పిల్లల స్కూలు కాబట్టి చక్కని పాల బుగ్గల పసివాళ్లు బుడి బుడి అడుగులు వేసుకుంటూ వస్తుంటే ఆ చెట్టు తన కొమ్మలు వంచి ఆకులతో వాళ్ళ ఒళ్ళు నిమురుతూ ఉంటుంది. పొద్దున పూట మాస్టార్లు వచ్చేదాకా మరియు ఇంటెర్వెల్ లోనూ పిల్లలు ఈ చెట్టు కింద నిలబడే గలగల మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల ముద్దు ముద్దు మాటలు, కిలకిల నవ్వులూ వింటూ పొంగిపోతుంది. ఇంకా డ్రిల్ పీరియడ్ లో మైదానంలోనే కోకో, కబడ్డీ ఆటలు ఆడుతూ ఉంటే ఒళ్ళు మరచి తన్మయత్వంతో చూస్తుంటుందా చెట్టు. అప్పుడప్పుడు తనతో ఓ మాట చెప్తుంటుంది గర్వంగా.
 “పువ్వులు పూసే కాలం రానివ్వు. నా కొమ్మలు, ఆకులు కూడా కంపించకుండా ఒల్లంత పువ్వులే పూస్తాను. బుట్టలు బుట్టలు పూలు పూస్తాను నేను”.
 “ఓయ్! మీ స్కూలు పిల్లల కోసమా ఈ పూలు. ఇప్పటి పిల్లలు తలలో పూలు పెట్టుకోవడానికి వాళ్ళకు జడలు లేవు పూర్వకాలంలోలాగా. ఇప్పటి ఆడపిల్లలకు క్రాపులే కదా! మరేం చేస్తావు అంతా విరగబూసి” కొంచెం ఉడికిస్తూ అడిగాను మిత్రురాలిని.
 “వాళ్ల జాడల్లోకి కాదులే మిత్రమా! నేను గంపలు గంపలు పూలు పూసి కింద రాలిస్తే పసివాళ్లు నా పూలమీద నడుచుకుంటూ వెళతారు. వారి పసి పాదాలు కందిపోకుండా నా పూల కార్పెట్ ను పరుస్తా. నేల మీద నున్న మట్టి ఇసుక గుచ్చుకోకుండా ఉంటాయి. చిన్నారులు నా పూల కార్పెట్ పై న్నాడుచుకుంటూ వెళ్తుంటే వారి మృదువైన పాదాలు... అబ్బబ్బ ఊహించుకుంటుంటేనే ఎంత మధురంగా అనిపిస్తుంది” అన్నది ఎంత తన్మయత్వంగా. దాని ఆనందం చూస్తుంటే నీకు గర్వంగా అనిపించింది. ఇంత మంచి మనసు ఉన్నా చెట్టుతోనా నేను స్నేహం చేస్తున్నది. ఎంత అదృష్టం నాడీ అనుకుంటూ పొంగిపోయాను.
 తెల్లవారి అలవాటు ప్రకారం ‘మిత్రమా!’ అని పలకరించేబోయేసరికి దిగాలు మొహం పెట్టుకొని కనిపించింది స్కూల్లోని చెట్టు. “ఏమిటి అంతా దిగాలుగా ఉన్నావు? నిన్ననే కదా నీ స్వప్నాన్ని ఎంతో ఆనందంగా పంచుకున్నాం. ఈరోజు ఎందుకు అలా ఉన్నావు? అన్నానో లేదో ఆ చెట్టు బోటబొటా  కన్నీళ్లు కార్చేసింది.
 నాతో ఏదో చెప్పాలనుకుంటున్నది గాని మాట పెగలటం లేదు. నేను కన్నీళ్లు తుడుస్తూనే ఉన్నాను ‘ఏం కాదులే’ అన్నట్లుగా. మెల్లిగా వెక్కిళ్ల మధ్య అసలు విషయం చెప్పింది. నిన్న స్కూల్లోని మాస్టారు ఈ చెట్టు కొమ్మను విరిచి బెత్తంగా చేసి పిల్లలి అల్లరి చేస్తున్నారని అందర్నీ బాదాడట. ఆ పిల్లల వీపుల మీద వాతలు తేలాయట. అందరూ ఒకటే ఏడుస్తూ కూర్చున్నారట. ఆ చేట్టెమో వాళ్ల పాదాలు కందిపోకుండా పూల కార్పెట్ పరవలని కల కంటే, ఆ మాస్టారేమో దీన్ని పిల్లల విపుల మీద వాటాలు తేల్చే బెత్తంగా మార్చేశాడు. నాకు నోట మాట రాలేదు, అసలు ఏం సమాధానం చెప్పి ఊరడించాలో కూడా నాకు అర్థం కాలేదు.