ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
చెప్పే రీతిలో చెప్పాలి: -- యామిజాల జగదీశ్
November 5, 2020 • T. VEDANTA SURY • Story

అదొక పల్లె. ఆ పల్లెలో ఓ ఇల్లు. ఆ ఇంటి వాకిట్లో ఓ అనాధ బాలుడు కూర్చున్నాడు. అతనికి కళ్ళు లేవు. పుట్టినప్పటి నుంచే కంటి చూపు లేదు.

ఆ ఇంట ఓ చిన్నారి పాలు తాగుతుండగా చనిపోయింది. అనుకోని రీతిలో చనిపోయిన ఆ బిడ్డను చూసి ఇంట్లోని వారందరూ రోదిస్తున్నారు.

ఏడుపులు పెడబొబ్బలూ విన్న బాలుడు వచ్చీపోయే వారిని అడిగాడు....

"ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నారు?" అని అడిగాడు.

అప్పుడు ఒకతను ఆ కుర్రాడితో "పాలు తాగుతున్న రెండు నెలల బిడ్డ హఠాత్తుగా చనిపోయింది. దాంతో ఇంట్లోని వారు ఏడుస్తున్నారు" అన్నాడు. 

"పాలంటే ఏమిటీ" అని అడిగాడు అంధ బాలుడు. 

"పాలెలా ఉంటాయో తెలీదా? తెల్లగా ఉంటుంది పాలు" అన్నాడొకడు.

"తెలుపంటే ఏమిటీ?" అడిగాడు ఆ అంధ బాలుడు. 

"తెలుపనేది రంగులలో ఓ రంగు" అన్నాడొకడు.

రంగులంటే ఏమిటో తెలీదుగా ఆ కుర్రాడికి. పుట్టుకతోనే కంటి చూపు లేదుగా ఆ కుర్రాడికి.

"ఏంటీ అది కూడా తెలీదా? కొంగలా తెల్లగా ఉంటుంది" అన్నాడొకడు. 

"కొంగెలా ఉంటుంది?" అడిగాడు ఆ కుర్రాడు.

"కొంగెలా ఉంటుందో తేలీదా?" అంటూ చెయ్యిని కొంగ ఆకృతిలో చెయ్యి వంచి ఆ అబ్బాయితో స్పర్శించి చూడమన్నాడు.

అప్పుడా కుర్రాడు ఆ చేతిని స్పర్శిస్తూ "ఏంటీ రెండు నెలల బాబు నోట్లో ఇంత పెద్దది పెడితే చావక ఏమవుతాడు?" అంటాడు.

ఇదదెందుకు చెప్పడమంటే చెప్పే వారికి చెప్పే విధంగా చెప్పాలి. అంతేతప్ప ఏవేవో చెప్తే ఎలాగు? నువ్వు తాగే నీళ్ళలా పాలొక ద్రవపదార్థమంటే సరిపోయేది కదా!!