ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
ఛాయరాజ్ అత్యున్నత కోవకు చెందిన కవి, స్వంతఆలోచనలతో రచనలు చేసిన ప్రముఖ రచయిత తను వ్రాసిన " తెలుగులో తొలి నవ కవిత" లో గురజాడ కవిత్వం గురించి చెబుతూ " సమాజంలోని మంచి చెడ్డలు విశ్లేషించి, ప్రయోజనాల సాధనాకాంక్షల పరిధి దాటి పాడుకొనే దశకొచ్చి---చివరకు పిల్లలతో పాటలు పాడుకొని, వారితో ఆడుకొనే దశలో ఆకస్మాత్తుగా ముగిసింది. ప్రజల భాషలో తెలుగు ప్రజల సాహిత్యానికి తొలి రచనలందించిన గురజాడతొలి ఆధునిక తెలుగు మహాకవి " అంటారు ఛాయరాజ్.కాకుమాని శ్రీనివాసరావుగారు రచించిన " గురజాడకళా సాహిత్య దృక్పథాలు" లో తన అభిప్రాయాన్ని చెబుతూ" గురజాడ లోని విమర్శకత, కళాచైతన్యం సమానత్వం కోసం తపించింది. ఆ జీవితమూ, రచనలూ, ఆదర్శాలు , అన్నీ ప్రేమ, సమానత్వం, అభ్యుదయం, ప్రజాస్వామ్యీకరణ గురించే పాటుపడ్డాయని చెప్పాలి. తెలుగులో ఇలాంటి సాహితీ వ్యక్తిత్వమున్నది చాలా కొద్దిమందికే ! " అంటారు.1910లో గురజాడ వ్యవహారిక భాషోద్యమం సందర్భంగా విరామం లేకుండా అనేక రచనలు చేసాడు. 1910 సెప్టెంబరులో " డామన్, పితియస్ " అనే కవితను వ్రాసాడు.ఇది గ్రీకు పురాణగాథ. ఇందులో కొన్ని మార్పులు కూడా చేసాడు అని కొందరు కవులు చెబుతున్నారు. అయితే గురజాడవారు వ్రాసిన " డామన్, పితియస్" చెప్పుకోదగ్గపేరు ప్రఖ్యాతులు రాలేదు. ఈ కవితా ఖండికను ఒకసారిపరిశీలిద్దాం. గురజాడ " డామన్, పితియస్ " కవితను3 అధ్యాయాలుగా విభజించి , 62 కవితలు వ్రాసాడు." వన్నె కెక్కిరి డమను పితియసు/లన్న యవనులు ముజ్జగంబుల/మున్ను; వారల స్నేహ సంపద/నెన్నసుకృతంబౌ." మూడు లోకాలలో డమను, పితియస్ లుప్రాణస్నేహితులుగా పేరు పొందారు. ఒకనాడు ఆ రాజ్యాన్నిపాలించే రాజుకు కోపం వచ్చి డామన్ శిరస్సును ఖండించ మని తలవరిని ఆజ్ఞాపిస్తాడు. అయినా డామన్ రాజు మాటలకు భయపడక చెక్కుచెదరక అలాగే నిలుచుని " నిక్కమే కద చావు నరునకు?/యెక్క డెప్పుడు, యెటుల గూడిన/నొక్కటే కదా?" అంటూ రాజుగారినిలా వేడుకుంటాడు. " కాని ఇంటికి పోయి యొక తరి/కనుల జూచెద నాలు బిడ్డల ;/పనులు తీ‌ర్చుకు మరలి వత్తును/యానంతిం" డనియన్. భార్యా పిల్లలను చూస్తానంటున్నవువెళ్లిరా అంటాడు రాజు. తన ప్రాణస్నేహితుడైన డామన్ ప్రాణాలకు బదులుగా తన ప్రాణాలర్పిస్తానంటాడు పితియస్. డామన్ పితియస్ ను రాజుకు పూచీ పెట్టి వెళ్తాడు. రాజు డామన్ కు అనుమతిస్తూ నెలరోజులుపోయినతరువాత రమ్మంటాడు. ఇంటికి వెళ్లిన డామన్ బంధు మిత్రులతో తనవారందరినీ కలుసుకొని విందులు, వినోదాలతో ఆనందంగా గడిపాడు. తాగిన మైకంలో రాజువేసిన ఉరిశిక్ష కథనం అంతా చెబుతాడు. తన ప్రాణాలకు బదులుగా ఇంకెవరైనా ప్రాణాలివ్వగలరా అని అందరినీ అడుగుతాడు డామన్ . అంతా నిశ్శబ్దం. అది గమనించినడామన్ తను చెప్పిన కథంతా కల్పితగాథే అంటాడు. డామన్ అనుకున్న కాలంలో తిరిగి రాజు దగ్గరకు వెళ్ళలేక పోతాడు. పితియస్ తన ప్రాణస్నేహితుడైన డామన్ తిరిగి రాడనుకొని నిర్ణయించుకుని తనే రాజు వేసిన శిక్షను అనుభవించాలనే నిర్ణయానికి వచ్చేసి పితియస్ ఇలా అనుకుంటాడు. " లోకమం దభిమాన మెంచియొ/నాకుయశ మొనగూర్చ నెంచియొ/నాక పతి, నా మిత్రు డామనురాక నడ్డడొకొ !" " బ్రతికి, చచ్చియు ప్రజల కెవ్వడు/బ్రీతిగూర్చునొ, వాడు ధన్యుడు; /బ్రతికి డామను ప్రజలనేలును/చచ్చి , నేనొకడన్. డామన్ భార్య భర్త ప్రాణాలకు బదులుగాతన ప్రాణాలను ఫణంగా పెట్టి శిక్షననుభవిస్తానంటుంది.రాజు దగ్గరకు వెళ్ళి భార్యాభర్తల అనుబంధం, ఆపదలో ఆదుకోవాలని జూసిన ప్రాణ స్నేహితుల విలువ డామన్భార్య రాజుకు వివరించి చెబుతోంది. అంతా విన్న రాజు---పలికె నరపతి " మిత్ర భావము/ సలుపు డిక నీ సఖుడనీవును!/అలఘు రాజ్యము ప్రేమ సంపద/ కలతి యని దలతున్"! అంటాడు. " వినగ తగినది వింట నిచ్చట/కనగ తగినది కాంచినాడను/మనుజు లిద్దరు మగువయొక్కతె/ మాన్యు లీ జగతిన్.'' అంటాడు రాజు .రాజు ఆమె మాటలకు నిశ్చేష్టుడై అందరి బంధీలను విడుదల చేస్తాడు. గురజాడ ఈకథలో ప్రాణ స్నేహం, భార్యాభర్తల అనుబంధం ఎంతటి విలువైనదో విలువైనదోతెలియజెప్పాడు. ఆధునిక భావాలు గల స్ర్తీ, రాజుకు అనుబంధాల గురించి వివరించడం ,రాజు వాటిని సమ్మతించి అందరినీ బంధీ విముక్తులను చేయడం గురజాడ రచనలో గొప్పతనం. ( సశేషం )శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
July 29, 2020 • T. VEDANTA SURY • Memories