ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
జ్ఞాపకాలు : ఆలూరు రాఘవ శర్మ
October 12, 2020 • T. VEDANTA SURY • Memories

మనిషి నిలువెత్తు జ్ఞాపకాల కుప్ప. జ్ఞాపకాలు వెంటాడని క్షణం ఎపుడైనా ఎదురయిందా, మెమరీ లాసయితే తప్ప.ఒంటిరిగా కూర్చున్నా, గుంపులో ఉన్నా, బస్సులో వెళ్తున్నా, రైల్లో దూసుకుపోతున్నా…ఎక్కడయినా,ఎపుడయినా ఆగిపోని, అరిగిపోని రికార్డు జ్ఞాపకాలు. కలలన్నీ జ్ఞాపకాలే. ఈ రోజు ఆశలు కూడా రేపటి జ్ఞాపకాలు. అసలు మనుషులంతా రోజూ చేసే పనేమిటి? జ్ఞాపకాలను ప్రాసెస్ చేసుకోవడమే. సాహిత్యం నిండా కనిపించేది ఏమిటి?  అపుడపుడు మనుసునుంచి పొర్లిపోయిన జ్ఞాపకాలే కదా. ఇపుడు ప్రముఖ జర్నలిస్టు,రచయిత ఆలూరు రాఘవ శర్మ తన తిరుపతి జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు.
----------------------------------
 తిరుపతికి వెళ్ళి పోతున్నాం. మా నాన్నకు ట్రాన్స్ వర్ అయ్యింది ‘ అంటూ చాలా మంది స్నేహితులకు చెబుతున్నాను. కొన్ని రోజులుగా నాకు అదే పని.

చిన్న తనం నుం చీ పెరిగిన వనపర్తి లో వీధి వీధీ తిరిగాను , ఇక మళ్లీ చూడడం వీలుకాదని. నేను చదువుకున్న వీధి బడి ; వేణుగోపాల స్వామి గుడి , హైస్కూల్, జూనియర్ కాలేజ్, నేను పెరిగిన వనపర్తి సంస్థాన ప్యాలెస్ పరిసర ప్రాంతాలు- ఇలా ఏ ఒక్కటీ చివరి సారి చూడకుండా వదలలేదు. వనపర్తి వదలాల్సి వస్తున్నందుకు గుండె బరువెక్కింది. ఆ ఊరితో అనుబంధం అలా పెనవేసుకు పోయింది.

నాకు ఊహ సరిగా తెలియని నాలుగేళ్ల వయసు నుంచి, ప జ్జెనిమిదేళ్ళు వచ్చేవరకు, పద్నాలుగేళ్ళ పాటు వనపర్తి లోనే మా కుటుంబం నివసిం చింది. ఒకప్పటి మహబూబ్ నగర్ జిల్లాలో అది తాలూకా కేంద్రం. ఇప్పుడు జిల్లా కేంద్రం.

స్వాతంత్య్రానంతరం స్వచ్ఛందంగా భారత యూనియన్ లో విలీన మైన తొలి సంస్థానం. ఆ సంస్థానాధీశుడు రాజా రామేశ్వర్ రావు 1959 లో అందమైన తన రాజ భవనం లో పాలిటెక్నిక్ కళాశాలను స్థాపించాడు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన తొలి ప్రైవేటు పాలిటెక్నిక్ అది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తొలి ప్రైవేటు పాలిటెక్నిక్ కూడా అదే. నష్ట పరిహారం కోరకుండా ప్యాలెస్ మొత్తాన్నీ ప్రభుత్వానికి అప్పగించిన వితరణశీలి ఆ సంస్థానాధీశుడు.

అప్పటివరకు వనపర్తే నా లోకం. అదే నా ప్రపంచం.
ఒకటి రెండు సార్లు బాపట్ల, బందరు వెళ్ళి రావడం తప్ప, మిగతా ప్రాంతాలు నాకు పెద్దగా తెలియదు. ఇంటర్ ఫైనల్ పరీక్షలు రాసి తిరుపతి వచ్చేయడం నా జీవితంలో ఒక పెద్ద మలుపు.

అది 1973 జూన్ మాసంలో ఒక రోజు సాయంత్రం. తొలకరి మొదలైంది. తిరుపతి వెళ్ళడానికి వనపర్తి రోడ్ స్టేషన్లో రైలు ఎక్కాం. ‘ కిటికీ పక్కన కూర్చోవద్దు. కళ్ళలో నిప్పురవ్వలు పడతాయి ‘ అంటూ మా అమ్మ హెచ్చరించింది . ఆ రోజులలో రైళ్లన్నీ బొగ్గు ఇంజన్లతో నడిచేవే. అప్పుడప్పుడే డీజిల్ ఇంజన్లు ఒకటీ అరా మొదలైనట్టున్నాయ్. చీకటి పడగానే బెర్తు లెక్కి పడుకున్నాం. పడుకున్నాననే కానీ అంతా తిరుపతి గురించే నా ఆలోచన. నిద్రలోకి ఎప్పుడూ జారుకున్నానో తెలియదు. అర్ధరాత్రి దాటాక మెలకువ వచ్చింది. ‘ తిరుపతి ఇంకా రాలేదా?’ అన్నాను. ‘ఇంకా రేణిగుంటనే రాలేదు ‘ ఒక ప్రయాణికుడి సమాధానం. తిరుపతి ఎలా ఉంటుంది !?’ అన్న ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి.

నాకు ఊహ తెలిసీ తెలియని నాలుగయిదేళ్ళ వయసులో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళాం. నడుచు కుంటూ కొండ ఎక్కుతున్నాం. ఆ నడక దారిలో నన్ను ఎవరో మాటల్లో పడేసి తమతో తీసుకెళ్ళి పోతున్నారు. మా అమ్మా వాళ్లకు కనుచూపు మేర కనపడనంత ముందుకు వెళ్ళి పోతున్నాను. నేను కనపడక పోయేసరికి మా వాళ్ళు కంగారు పడిపోయి పరుగు పరుగున వచ్చారు. ఈ నడక దారిలో నేను తప్పి పోతే ఏమై పోయే వాడినో! ఏమో!? తలుచుకుంటే భయమేస్తుంది. అప్పటి వరకు తిరుపతి అంటే నాకు ఆ భయమే , ఆ చేదు జ్ఞాపకమే!

‘రేణిగుంట వచ్చేసింది’ అన్నారెవరో. ‘ మా వాళ్లంతా నిద్ర లేచారు. వచ్చేది తిరుపతే,’ అని సామాను సర్దడం మొదలు పెట్టారు. రేణిగుంట జంక్షన్ లో రైలు చాలాసేపు ఆగింది. ఇక్కడ ఇంజన్ మారుతుంది. ఒక రైల్వే ఉద్యోగి మా దగ్గరే కూర్చున్నాడు. ‘ ఇక్కడి నుంచి తిరుపతి ఎంతదూరం ‘ అని అడిగాను. ‘ మరో ’కాల్ గంట’లో తిరుపతి లో ఉండ మా ! ‘ అన్నాడు. నాకు అర్థం కాలేదు ‘ఈ కాల్ గంట ఏ మిటి!? ఇక్కడ కాలు గంట లాగా చేయి గంట కూడా ఉంటుందా !?’ అని మనసులో అనుకొన్నాను. మనసులో దాచుకో లేక అడిగే శాను ‘ మేం కాల్ గంట అంటే మీరు పావు గంట అంటారు. అర్ధ గంటను అర్ధ గంటే అంటారు. మీరు ముప్పావు గంట అంటే మేం ముక్కాల్ గంట అంటాం ‘ అని చిరు నవ్వుతూ ఓపిగ్గా సమాధానం చెప్పాడు.

‘అదిగో అదే తిరుపతి కొండ’ అంటూ చూపించా డు . తెల్లవారు జామున ఆ చీకట్లో కొండ ఏం కనిపిస్తుంది, పగటి పూట అరుంధతీ నక్షత్రం లాగా! దూరంగా తిరునామాలు తప్ప! తిరుపతి వచ్చేసింది. సామనుతో రైలు స్టేషన్ బైటికి వ చ్చేసాం. ఎదురుగా స్టాల్ లో టీ తాగాం . టీ 15 పైస లే. వనపర్తి లో అయితే పావలా. పైగా చిన్న కప్పులో ఇస్తారు. ఇక్కడ పెద్ద గ్లాసు లో ఎంత టీ పో సిచ్చాడో! అని ఆశ్చర్యం వేసింది.

మాస్టర్ టీ కలిపే విధానం కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. చిన్న బాయిలర్ లో కణ కణ మం డే నిప్పులు. చిన్న మెటల్ టబ్బులో గుడ్డ వేసి, అందులో టీ పొడి వేసి, బాయిలర్ నుంచి నీళ్ళు ఒంచి, ట బ్బులో పాలు పోసి ఒక చేత్తో , మరో చేత్తో పెద్ద గ్లాసు పట్టుకుని కలిపే విధానాన్ని కళ్ళార్పకుండా చూసాను. ఒక చెయ్యి ఎంత కిందకు వెళుతుందో, మరో చెయ్యి అంత పైకి వెళుతుంది. సర్కస్ లాగా కింద పడకుండా టీ కలప డా న్ని చూడడం నా జీవితంలో అదే తొలిసారి.

‘అబ్బా..,’ అంటూ ఆ వేడి వేడి టీ ని తృప్తిగా, ఇష్టంగా తాగాం. ఆ రోజులలో రైల్వే స్టేషన్ ఎదురుగానే , ఇప్పటి రిజర్వేషన్ కౌంటర్ ఉన్న చోట నే బ స్టాండ్ ఉండేది. ఆర్టీసీ బస్సులతో బాటు, ప్రైవేటు బస్సులు కూడా అక్కడే ఆగేవి.

ఒక టెంపో మాట్లాడుకుని ఎక్కాం. పెరుమాళ్ళ పల్లె వెళ్ళాలి. ఇక్కడికి తొమ్మిది కిలో మీటర్లు దూరం ఉంటుంది. తిరుపతిలో వెంటనే ఇల్లు దొరకలేదని పెరుమాళ్ల పల్లెలో ఇల్లు తీసుకున్నాం. టెంపో అంటే మూడు చక్రాల వ్యాను. కొంగలా దాని ముక్కు ముందుకు తోసుకుని వచ్చినట్టు ఉంటుంది. ముందర డ్రైవర్ ఒక్కడే. ఎ క్కేవాళ్ళు ఎక్కువైతే డ్రై వర్ అటు ఒకర్ని, ఇటు ఒకర్ని కూర్చో పెట్టుకునేవాడు. టెంపో లు ఇప్పుడు కనిపించడం లేదు. కాలం తన కడుపులో దాన్ని దాచేసుకుంది. ఒకప్పుడు తిరుపతి నుంచి రేణిగుంట , చంద్రగిరి, తిరుచానూరు , ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా సిటీ బస్సుల లాగా పనిచేసివి. టెంపో లో పదిమంది వరకు కూర్చోవచ్చు. ఇంకా ఎక్కువ మందిని కూడా కుక్కి, కూరి తీసుకు వెళ్లేవారు.

టెంపోలో ఎక్కి వెళ్లడం చాలా వింత అనుభూతి. మొయ్యలేను మొర్రో అన్నట్టు దాని శబ్దం కూడా బుర్రూ బుర్రూ మ నేది. నీటిలో పడవలాగా, అటూ ఇటూ ఊగుతూ ఊగుతూ కదల లేక కదులుతున్నట్టు అనిపిస్తుంది. నిండు చూలాలి లాగా మందగమనంతో సాగేది. ఎక్కడ ఒరిగి పోతుం దేమోనన్న భయం. ఈ టెంపోలు ముక్కు వ్యాన్లతో పోటీ పడేవి. ఆ రోజులలో ముక్కు బస్సులు కూడా ఉండేవి.

రైల్వే స్టేషన్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా మా టెంపో వెళుతోంది. మధ్యలో ఏ ఏ కాలేజీలు ఉన్నాయో మానాన్న చెప్పడం మొదలు పెట్టాడు. ‘ ఇదే మన శ్రీరాములు పని చేస్తున్న జూనియర్ కాలేజీ ఈ ఆర్ట్స్ కాలేజ్ వెనకే ‘ యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, అగ్రికల్చరల్ కాలేజ్ ‘ అంటూ వరుసగా చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ చీకట్లో కనిపిస్తే గా! అన్నిటికీ ఊ కొట్టడం. ఆ చీకట్లో టెంపో లో ప్రయాణం చేస్తూ, చేస్తూ చివరికి తెలతెల వారుతుండగా పెరుమాళ్ల పల్లె చేరాం.