ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
టాగూర్ తాతయ్య-ప్రమోద్ ఆవంచ
September 30, 2020 • T. VEDANTA SURY • Serial

శాంతి నికేతన్ లో తాతయ్యకు ఎలాంటి నిర్బంధాలు లేవు.తన ఇష్టం వచ్చినట్టు ఆశ్రమంలో తిరగవచ్చు.చెట్లు, గుట్టలు, నదులు, అడవులు, అన్నీ ప్రకృతి దృశ్యాలను చూసి ఆనందించవచ్చు.తాతయ్య వేసే అన్ని ప్రశ్నలకు మహర్షి శాంతంగా సమాధానాలు ఇస్తుండేవాడు.ఇక్కడ తాతయ్యకు చిన్న చిన్న పనులు కూడా చెప్పడం జరుగుతుండేది.దానివల్ల బాధ్యతను స్వీకరించే అలవాటు కలుగుతుందని మహర్షి గారి అభిప్రాయం.ఆశ్రమంలో ఒకచోట కొద్ది ఎడంగా జంటగా పెరిగిన రెండు చెట్లుండేవి.మహర్షి ఆ రెండు చెట్ల మధ్యన తెల్లని దుస్తులు ధరించి ఉదయం పూట ప్రార్థన చేస్తుండే వాడు.ఆ ప్రదేశాన తాతయ్య పెద్ద వాడైన తరువాత తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఒక రాయిని పాతించి, దానిపైన దేవుడి గురించి మహర్షి అభిప్రాయం ఏమిటో రాయించి పెట్టించించినాడు.
              తాతయ్యకు తన తండ్రి అంటే ఎంత ఇష్టమో అంత ప్రేమ కూడా.భయభక్తులు కూడా అంతే వుండేవి.శాంతి నికేతన్ నుంచి తాతయ్య,తన తండ్రి గారు, అమృతసర్ వెళ్ళారు.అమృత్ సర్ లో సిక్కుల దేవాలయం చూసి, మహర్షి, తాతయ్యలు అక్కడ ప్రార్థనలు కూడా చేసారు.మొదటిసారి బెంగాలీ వాళ్ళు, సిక్కుల మందిరానికి వెళ్లి ప్రార్థనలో పాల్గోనడం చూసి, సిక్కులు చాలా సంతోషపడ్డారు.
              అమృతసర్ నుండి హిమాలయ ప్రాంతంలో నున్న డల్హౌసీ అనే ప్రదేశానికి వెళ్ళారు.అక్కడ నాలుగు నెలలు వున్నారు.అక్కడ వాతావరణం చాలా చలిగా ఉంటుంది.మంచు కురిసే ప్రదేశం.మన తాతయ్యను సాధారణ జీవితానికి అలవాటు పడేటట్లు చేయాలనీ మహర్షి గారు అనుకున్నారు.జీవితంలో అన్ని కష్టాలను తట్టుకొని నిలబడే శక్తి మన తాతయ్యకు లభించింది.ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తండ్రీకొడుకులు ఇద్దరు అడవి వైపు, షికారుకు వెళ్ళేవారు.ఇప్పుడు తాతయ్యకు ఎలాంటి నిర్భంధం లేదు.హాయిగా లోయలలో, నదీతీరంలో, ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందిస్తూ,అనేక విషయాలు తండ్రిని అడిగి తెలుసుకుంటూ,అనేక ఊహా చిత్రాలను నిర్మించుకుంటూ, గీతాలు రాస్తుండేవాడు.మిగితాది రేపు.....