ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తంజావూరు నాయకరాజుల సాహిత్య పోషణ గురించి చెప్పుకునేటప్పుడు ఇద్దరు భక్తులు వ్రాసిన పదములు, గేయాలు తెలుపవలసి ఉంది.వారే క్షేత్రయ్య, త్యాగయ్య అన్న పద సాహిత్య కారులు. మీరు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. ముందుగా క్షేత్రయ్య గురించి తెలుసుకుందాం. ఇతడు క్రీ.శ. 1595 - 1680 వరకు జీవించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన కృష్ణా జిల్లాలోని మొవ్వలో జన్మించినట్లు చెబుతారు. ఈయన తండ్రి పేరు వరదయ్య. ఇతడు రాసిన పదములను, కీర్తనలను మొవ్వ గోపాలుని భక్తి కీర్తనలని పిలుస్తారు. క్షేత్రయ్య సుమారు 4000 పైబడిన పదములు, కీర్తనలు రాసాడని ప్రతీతి.ఈయన పదములు నాట్యానికి అనుగుణంగా ఉంటాయి. కూచిపూడి, భరతనాట్యం రీతు లతో సంగీత బాణీలతో అమరి ఉంటాయి. ప్రతి కీర్తనలో తన ఇలవేల్పు అయిన మొవ్వ గోపాలుని స్తుతిస్తున్న పదం ఉంటుంది. అతని కీర్తనలు అన్నియు శృంగారంతో నిండిన భక్తి గీతాలు. శ్రీకృష్ణ రాకకోసం నాయికా నాయకులు పరవశులై పాడే భక్తిరస గీతాలు. ఇవి గొప్ప సంగీతంతో వీనుల విందైన సంగీత భరిత రసవత్తరమైన పాటలు. ఇతడు వ్రాసిన నాలుగు వేల పాటలలో అతికొద్దిగా మాత్రమే కనబడుచున్నవి. ఈయన ఒక చోట స్థిరంగా ఉండేవాడు కాదు. ఊరూరు తిరుగుతూ దేవాలయాలలో నివాసం ఉండేవాడు.అక్కడ ఉండే దేవదాసి మహిళలతో వీణ వంటిఇతర వాయిద్యాలతో కీర్తనలు పాడించేవాడు. అంతేకాకుండా దక్షిణ భారత సంగీత సాంప్రదాయాలతో నాట్యం చేయించేవాడు. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం భంగిమలతో దక్షిణ భారత నృత్య సంగీత సాంప్రదాయాలతో క్షేత్రయ్య అలరించేవాడు. ఈతని పదాలు భక్తి ప్రధానమై, శ్రీకృష్ణుడే సర్వోన్నత నాయకుడనే అంతర్లీన భావం ఉండేది. అంతేకాదు ఈయన పదాలలో శృంగారము, ఇంకా భాషా పరంగా చూస్తే జాతీయమైన తెలుగుదనం ఉట్టిపడేది.క్షేత్రయ్య నిత్యము పలు క్షేత్రములు సందర్శిస్తూ అక్కడ ఉండే దేవతల గురించి భక్తి భరితమైన పదములు రచించేవాడు. క్షేత్రయ్య విజయ రాఘవనాయకుని కూడా సందర్శించినట్లు తెలియుచున్నది. ఆయనపై పలు పదాలు కూడా రచించినట్లు తెలియుచున్నది.ఈ పదములన్నియు భావ గంభీరములై, అభినయమునకు మిక్కిలి అనువుగా ఉండుట ప్రత్యేకత. తదుపరి ఈ కాలంలోనే మరో భక్తుడు త్యాగరాజు. భక్తి, సంగీతములు ఈయన సొమ్ములు.ఇతని కృతులంతా సహజ మాధుర్యమై కేవలము ఆంధ్రులే కాక దక్షిణాది ప్రజలందరిని ఆకర్షిస్తాయి. కానీ ఇదే సమయంలో తంజావూరు నాయకులు అంతరించిన పిమ్మట ఈ రాజ్యము మహారాష్ట్ర పాలనము లోనికి వచ్చినది.త్యాగరాజు కీర్తనలు అపూర్వ సంగీత భరితమై అలరారుతున్నవి, అంతేగాక పండిత పామరులు మెప్పుకోలుతో రసభరితమై ఒప్పుతున్నది. అతని భాష మార్దవమే గాక పాండిత్యము సాహిత్య సంపదతో గోచరిస్తుంది. అతని భాష మాధురీమయమునకు మారుపేరు. త్యాగరాజు భక్తి భరితమైన పెక్కు కీర్తనలనే కాక ప్రహ్లాద భక్త విజయము, నౌకా విజయము అను రెండు యక్షగానములను కూడా రచించెను. మొదటిదానిలో భక్తవరేణ్యుడైన ప్రహ్లాదుని ఆపూర్వభక్తియు, రెండవదానిలో శ్రీకృష్ణుడు గోపాంగనలతో యమునానదిపై విహరించుటయు వర్ణింపబడినవి. ఇందలి కథలను గూర్చుటలో త్యాగరాజు మిక్కిలి స్వాతంత్ర్యం వహించెను.భాగవతమునందలి కథకు, దీనికి గల తారతమ్యమే యిందుకు దృష్టాంతము. (సశేషం)- బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
July 28, 2020 • T. VEDANTA SURY • Serial