ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తంజావూరు నాయక రాజులు, వంశపారంపర్యంగా ఒకరి తర్వాత ఒకరు తెలుగు సాహిత్య సేవ చేశారు. వారిలో రఘునాథుడు ప్రసిద్ధికెక్కాడు. తరువాత అతని కుమారుడైన విజయరాఘవుడు కూడా కవిగా కీర్తి కెక్కాడు.. విజయరాఘవుని కుమారుడైన మన్నారు దేవుడు కూడా తెలుగు సాహిత్య సేవలందించాడు. వీరి కాలంలోనే త్యాగయ్య భక్తులు రాసిన పదములు, గేయములు, కీర్తనలు చెప్పుకోదగినవి. ఒకప్పుడు ప్రస్తుత తమిళనాడు ఆంధ్ర ప్రదేశులు, ఒకే రాష్ట్రంగా ఉండేది. దీనినే మద్రాసు రాష్ట్రం అని పిలిచేవారు. ఆనాడు మద్రాసు ముఖ్య పట్టణంగా ఉండేది తెలుగు సాహిత్య కళలకు మద్రాసు కేంద్రమై ఉండేది. నాటి మద్రాసునగరమే నేడు చెన్నై పట్టణము. ఈ మద్రాస్ నగరాన్ని చెన్న పట్టణం అనే పిలిచేవారు. ఆనాడు "చెన్నపట్టణం అంటే తెలుగు పట్టణము" అని నానుడి ఉండేది. తెలుగు తమిళ భాషలకు వైరుధ్యభావన ఉండేది కాదు. నాటి తమిళ సినిమాలు నేటి మన విజయనగరం జిల్లాలోని ముఖ్యకేంద్రాలలో ప్రదర్శింపబడేవంటే ఈనాటి యువత విశ్వసించలేని సత్యమిది. అలాగే తెలుగు సినిమాలు కూడా నాడు తమిళనాడంతట విడుదలై, విజయవంతంగా నడిచేవి. ఆనాడు తెలుగు, తమిళ భాషా బేధం జనంలో ఉండేది కాదు. 1950సం. పూర్వం కీర్తిశేషులు చిత్తూరు వి.నాగయ్య ఉభయ భాషలో మేటి నటులు. ఆయన నటించిన వేమన యోగి, త్యాగయ్య, క్షేత్రయ్య వంటి సినిమాలు మద్రాసులోనే నిర్మాణం అయ్యాయి. ఈ చిత్రాలు ఆంధ్రప్రదేశ్ లోనే గాక తమిళనాడులో కూడా విజయవంతమయ్యేవి. నాగయ్య నటించిన తెలుగు పదములు, కీర్తనలు ఆలపించిన చిత్రం "త్యాగయ్య". అలనాడు తంజావూరు రాజుల కాలంలో జన్మించిన తెలుగు సాహిత్యపద గాయకుడు త్యాగయ్య చరిత్ర ఇది "త్యాగయ్య" చిత్రంలో తెలుగు నటుడు కీ.శే.నాగయ్య గారు నటించారనే కంటే జీవించారంటేబాగుంటుంది. మేటి గాయకుల మెప్పు పొందిన ఈ చిత్రం తమిళనాడులోని కోయంబత్తూరులో స్వర్ణోత్సవం జరుపుకుంది. తెలుగు కవి "పోతన" చిత్రంలో నాగయ్యగారు నటించారు. ఆ నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో విజయవంతంగా నడిచింది. ఆయన నటనకు తమిళనాడులోని తిరువాన్కూర్ మహారాజా, నాగయ్యకు కనకాభిషేకం చేశారు. అలాగే మైసూరులో మహారాజావారు నాగయ్యకు కనకాభిషేకం చేసి, గజారోహణ సత్కారం జరిపించారు. త్యాగరాజ కీర్తనలు నేటికీ దక్షిణాది సంగీత విద్వాంసులు మరియు గాయకులు ఆలపిస్తుంటారు. *****. *****. *****. ***** తెలుగు సాహిత్య చరిత్రలో తంజావూరు రాజులలో విజయరాఘవుని కుమారుడైన మన్నారు దేవుడు కూడా ప్రసిద్ధి కెక్కిన మహాకవి. ఈయన విజయ రాఘవాభ్యుదయము, హేమాబ్జనాయికా పరిణయము అను రెండు గ్రంథములు రచించాడు. ఇందు విజయ రాఘవాభ్యుదయము ప్రబంధమో లేకయక్షగానమో తెలియదు. రెండవది మాత్రము యక్షగానమే. మన్నారు దేవుడు చేర సముద్రమున పుట్టిన అమృతము దేవతలకు ఇచ్చి సముద్రుడి కూతురు రక్తాబ్జయను నామెను వివాహమాడిన కథ ఇందలి విషయము. విజయ రాఘవుని తరువాత తంజావూరు రాజ్యము మొదట మధుర నాయకులకు, పిమ్మట మహారాష్ట్రులకు వశమైనది. ఈ మహారాష్ట్ర రాజులు తెలుగు నేర్చుకుని తెలుగులో మాట్లాడమే గాక అందు కావ్యములు, నాటకములు వ్రాసి ప్రసిద్ధికెక్కారు. ఈ రాజులు పలువురు ఆంధ్రకవులను, పండితులను, గాయనీ గాయకులను పోషించారు.‌ వీరి కాలంలోనే అనేక ద్విపద కావ్యాలు, యక్షగానాలు రచింపబడినాయి.తంజావూరు ఆస్థానమునకు చెందినవాడు కాకపోయినా విజయ రాఘవ నాయకునికి సమకాలీనుడు చెంజి రాజ కుటుంబమునకు చెందినవాడు అయిన ఒక కవిని గూర్చి చెప్పవలసి యున్నది. అతడే చిన నారాయణ రాజు (1600- 1660). అతడు రచించిన కావ్యము కువలయాశ్వ- చరిత్రము. ఇందలి కథ మార్కండేయ పురాణము నుండి గ్రహింపబడినది. చిన నారాయణరాజు ఈ కథ యందు అనేక మార్పులు చేర్పులు చేసాడు.ఋతుద్వజుడను రాజు మదాలస గంధర్వ రాజ కన్యను వివాహమాడిన వృత్తాంతం ఇందలి కథ. తాళకేతువాడు రాక్షసుడు ఋతు ధ్వజుని వంచించి మదాలసను గొని పోయిన కథ అశ్వతరుఁడు కైలాసమునఁ దన సంగీతనైపుణ్యము బ్రదర్శించిన కథ, తారాజయంతుల కథ, ఇందు అంగములుగా వర్ణింపబడినవి. పింగళి సూరన కళాపూర్ణోదయం తరువాత ఇంత కథా రామణీయకం గల ప్రబంధం మరొకటి లేదని విమర్శకుల అభిప్రాయము. కథాకల్పనము నందును, సహజ వర్ణనములందును, ఔచిత్యపోషణమందును, సహజ సంభాషణ నిర్మాణ నైపుణ్యము నందును చిననారాయణరాజు అద్వితీయుఁడు. "ప్రతిభాతిశయములను కల్పనా సామర్థ్యమునను వీరిరువురును (సూరన, చిననారాయణ రాజు) సమానులే ఐనను చిననారాయణ రాజు కవిత్వమందలి శిల్పపరిపక్వతయు, ప్రసన్నతయు, నిగ్గును సూర నార్యునందు కానరావు" అని శ్రీ డా.నేలటూరి వేంకటరమణయ్య గారి అభిప్రాయము. ఇతడు సూరనవలె సంస్కృతమందు గొప్ప పండితుడే అయినను దీర్ఘ సమాజ ముల జోలికి పోక తంజావూరు కవులకు సాధారణమైన తియ్యని తేట తెలుగు మాటల ప్రయోగించుటయందు ఎక్కువనేర్పు‌ ప్రదర్శించెను. ఈతడి కావ్యమును తన పెంపుడు తండ్రియైన నారాయణరాజుకు అంకితము కావించెను. (సశేషం)( ఇది 74వ భాగం ) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
July 27, 2020 • T. VEDANTA SURY • Serial