ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తంజావూరు నాయక రాజుల రాజ్యములు అంతరించిన తరువాత మధుర పుదుక్కోట సంస్థానములు ఏర్పడినవి. ఆ సంస్థానములలో మేటి కవి గణపువరపు వేంకటకవి (క్రీ.శ.17వ శతాబ్దం). ఇతడు రాసిన విద్యావతీ దండకమును ముద్దళగిరి రాజునకు అంకితమిచ్చాడు.ఈ కవి రాసిన గ్రంథములలో లక్షణ గ్రంథములు ఎక్కువ. బాల రామాయణం ద్విపద, జాంబవతి విలాస చిత్ర కావ్యము, పరమ భాగవతం చరిత్ర, పురాణ సారము, కృష్ణ మల్ల కథ అను పేర్లు గల ఈ కావ్యములు ఇప్పుడు లభించుట లేదు. మనకు లభ్యమవుతున్న వానిలో ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసము నందలి 808వ సీస పద్యమున నలభై కి పైగా వృత్తాదుల గర్భితములై యున్నవి. అటువంటి పద్యములను తెలుగు కావ్యములో ఎవ్వరును వ్రాసియుండలేదనియు కీ.శే.పూండ్లరామక్రిష్ణయ్యగారు ప్రశంసించియున్నారు. లింగానుశాసనము, తెనుగు ప్రతాపరుద్రీయమురసమంజరి, వేంకటేశాంధ్రమనబడు, అభినవాంధ్రనిఘంటువు, ఆంధ్ర కౌముది, గణపతి ప్రామాణిక,రేఫ రకార నిర్ణయ పద్దతి, షట్ప్రత్యయ ప్రసార సరళిఅలంకార సారము, ఆంధ్ర ప్రయోగ రత్నాకరము ఇరవై ఆరు ఛందముల వచనము, ఆంధ్ర ద్విరూపకోసము, ఆంధ్ర ప్రక్రియ కౌముది అనునవి ఈతడు రచించిన లక్షణ గ్రంథములు. సర్వ లక్షణ శిరోమణి అను గొప్ప లక్షణ గ్రంథమును కూడా ఈ కవి రచించినట్లు తెలియుచున్నది. ఇది గొప్ప ఉల్లాసము కలిగించు లక్షణ కావ్యము. ఈయన వ్రాసిన గ్రంథములు, ఈయన జీవిత చరిత్రకు అంతగా ఉపయోగ పడకపోయినా పాండిత్య గొప్పతనము తెలుపుటకు ఉపయోగ పడుచున్నవి. ఈ గ్రంథము సమగ్రంగా లభించక పోవడం విచారకరం. ఈ గ్రంథాన్ని వేంకటేశ్వరునికి అంకితం ఇవ్వడం జరిగింది. *విజయ రంగ చొక్కానాథుడు*ఇతడు కవి పండిత పోషకుడు. ఈయన స్వయముగా గ్రంధములను రచించాడు. మాఘ మహాత్మ్యం, శ్రీరంగ మహత్యం అను వచన గ్రంథములను రచించాడు. ఇవి వాడుక భాషలోఉన్నాయి. ఇతని సంస్థానము నందలి కొలువులోపేర్కొనదగినవాడు సముఖము వేంకట కృష్ణప్పనాయకుడు. ఇతడు అహల్య సంక్రందనము, రాధికా సాంత్వనము అన్న పద్యకావ్యములను, జైమిని భారతం అను వచన కావ్యమును రచించాడు.రాధికా స్వాంతనమను కావ్యము ఏకాశ్వాస ప్రబంధము. ఇందు అసభ్యకరములైన అనేక పద్యములున్నవి. ఇందలి పద్యములన్నియుముద్దు పళని రాధికా సాంత్వమునందు కూడాఉన్నవట, ఇక్కడ మరి కొన్ని పద్యములు చేర్చినాలుగు ఆశ్వాసములుగా విభజించి ఉన్నదట! ఇదే సత్యం అయినచో ముద్దుపళని వెంకట కృష్ణప్ప నాయకుని పద్యములను హరించినదని చెప్పవచ్చును. ఈ పద్యములను ఎవరు రచించినప్పటికీ ఇందలి కవిత్వము మాత్రము మృదు మధురమై యుండును. తేట తేట తెలుగు పదములతో తేనెలొలుకునట్లు అలరారు చున్నదనుటలో అతిశయోక్తి లేదు. నీతి బాహ్యములైన కొన్ని శృంగార పద్య వర్ణనలను తొలగించినచో ఇట్టి గొప్ప కావ్యము తెలుగులో మరొకటి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. (సశేషం) (77వ భాగం) -బెహరా ఉమామహేశ్వరరావు -9290061336
July 30, 2020 • T. VEDANTA SURY • Serial