ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తండ్రి ప్రేమ - ఒక చిన్న కథ - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
October 29, 2020 • T. VEDANTA SURY • Story

ఒక ఊరిలో ఒక ధనవంతుడు వుండేటోడు. ఆయనకు లేకలేక ఒక కొడుకు పుట్టినాడు. దాంతో వాళ్ళు ఆ పిల్లవాన్ని అల్లారుముద్దుగా పెంచసాగినారు. ఆ పిల్లోడు పెరిగి పెద్దోడయినాక స్నేహితులు ఎక్కువయినారు. ఎప్పుడూ సరదాగా ఆడతా, పాడుతా, అల్లరిచిల్లరగా   తిరుగుతా వుండేవాడు. ఏవైనా బాధ్యతలు అప్పజెప్పినా అస్సలు పట్టించుకొనేవాడు కాదు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా లెక్కజేసేవాడు కాదు. దానితో ముందు ముందు వాని జీవితం ఏమవుతుందో ఏమోనని వాళ్ళ నాయనకు ఒకటే బెంగ పట్టుకొనింది. మరోపక్క ఆయనకు వయసయిపోతావుంది.
ఆ ధనవంతుడు బాగా ఆలోచించి ఒక రోజు కొడుకును పిలిచి... చూడుబాబూ... మనది మొదటినుంచీ వ్యవసాయ కుటుంబమే. కానీ మన తాతలకాలం నుంచీ నెమ్మది నెమ్మదిగా వ్యాపారంలోకి అడుగు పెడుతా ఇప్పుడు బాగా సంపాదించి ధనవంతులమయినాం.
*కానీ ఎంత సంపాదించినా, ఎంత పైకి ఎదిగినా మనకు మొదట అన్నంపెట్టి దారి చూపించిన వ్యవసాయాన్ని మాత్రం మరిచిపోలేదు. దాన్ని అందరం గౌరవిస్తున్నాం. నేర్చుకుంటున్నాం.* కాబట్టి నీవు కూడా వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకో, మన తాతల కాలం నుంచీ మనూరిలో పదెకరాల పొలం వుంది. నీవు పోయి అక్కడ ఒక సంవత్సరం పాటు వుండి, పని నేర్చుకొని సొంతంగా పంట పండించి చూపించు అన్నాడు.
దానికి ఆ కొడుకు పకపక నవ్వి అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం మనకేముంది నాన్నా, చేతినిండా లెక్క 
బెట్టుకోవడానికి వీలుకానంత ధనముంది. పిలిస్తే పరుగెత్తుకొని వచ్చి పలికే పనివాళ్ళు వున్నారు. పైసలు పాడేస్తే అన్నీ వాళ్ళే చేస్తారు అన్నాడు నిర్లక్ష్యంగా.
వాళ్ళ నాయన చిరునవ్వు నవ్వి ... నువ్వు చెప్పింది నిజమే. కాదనను. కానీ మీ తాతల కాలం నుంచీ వస్తావున్న ఆస్తి నీ చేతికి రావాలంటే మాత్రం నువ్వు వ్యవసాయం నేర్చుకోవలసిందే. తప్పదు. మన తాతముత్తాతలనుంచీ ఎవరూ ఎదురు తిరుగకుండా అలా వీలునామా రాసి పెట్టినారు. అంతేకాదు కొందరు న్యాయాధికారులు నీవు సొంతంగా వ్యవసాయం చేస్తున్నావో లేదో అప్పుడప్పుడూ వచ్చి గమణించి వెళుతుంటారు. వాళ్ళు సంతృప్తి చెందితేనే ఆస్తి. లేదంటే లేదు. నేను చెప్పేది చెప్పాను. తరువాత నీ ఇష్టం అన్నాడు.
ఆ మాటలతో ఆ పిల్లోని నోట్లో వెలక్కాయ పన్నట్టయ్యింది . ఇంతవరకూ ఈ ఆస్తికి తానొక్కడే వారసుడు. తనకేం భయం లేదు అనుకునేవాడు. కానీ ఈ ఆస్తి అందకపోతే నడివీధిలో నిలబడాల్సొస్తుంది. వాళ్ళ పెద్దల మీద పీకలదాకా కోపం వచ్చింది. కానీ వేరే దారి లేదు. దాంతో తప్పనిసరయి ఊరికి బయలుదేరినాడు.
భూమిని దున్నడం, నార పెంచడం, పంట వేయడం, కలుపు తీయడం, ఎరువులు చల్లడం, పాదులు తీసి నీళ్ళు పారించడం, పంట కొయ్యడం, తూర్పు పట్టడం, సరుకు తీసుకుపోయి సరయిన ధరకు అమ్మడం... ఇలా పనులన్నీ ఒకదాని తరువాత ఒకటి నేర్చుకొని , ఒక సంవత్సర కాలం కష్టపడి పనిచేసి పంట పండించి , ఆ డబ్బు తీసుకోనొచ్చి వాళ్ళ నాయన ముందు విసురుగా కోపంగా పడేసినాడు.
ఆ ధనవంతుడు వాటిని చూసి సంతోషంగా ... చూడు బాబూ వీలునామా ప్రకారం ఇక నా తరువాత ఆస్తి నీదే. కానీ మన ఊరిలో వున్న పదెకరాల పొలం మాత్రం ఎవరికీ అమ్మడానికి కానీ, కౌలుకి ఇవ్వడానికి గానీ , పనివాళ్ళతో వ్యవసాయం చేయించడం కానీ కుదరదు. దున్నుతే నువ్వు దున్నాలి. లేదంటే లేదు. దాన్ని అలాగే నీ తరువాత తరానికి అందించాలి. అది మాత్రం మరిచిపోకు అన్నాడు.
కొంతకాలానికి ఆ ధనవంతుడు మరణించినాడు. ఆస్తి అంతా వీలునామా ప్రకారం కొడుకుకి వచ్చింది. చేతినిడా సంపద వుండడంతో బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు స్నేహితులు కుప్పలు తెప్పలుగా చుట్టూ చేరినారు. ఆటలు, పాటలు, విందులు, వినోదాలతో కాలం జల్సాగా గడిచిపోసాగింది. యజమాని పట్టించుకోక పోవడంతో గుమస్తాలు దొంగ లెక్కలు చెబుతా అందినకాడికి దోచెయ్యసాగినారు. దాంతో నెమ్మదిగా నష్టాలు రావడం
మొదలయ్యింది. విషయం పూర్తిగా అర్థం అయ్యేసరికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతవరకూ చుట్టూ వున్న స్నేహితులంతా ఒకొక్కొరుగా జారుకున్నారు. అవసరానికి ఎవ్వరూ అండగా నిలబడలేదు. దాంతో వున్న ఇల్లుగూడా అమ్మేసి నడివీధిలో నిలబడవలసి వచ్చింది.
అప్పుడు అతనికి వూర్లో వున్న పదేకరాల పొలం గుర్తుకు వచ్చింది. వ్యవసాయం ఎలాగూ వచ్చు. అక్కడికి పోయి బ్రతుకుదాము అనుకున్నాడు. ఆ పొలమంతా పూర్తిగా పిచ్చి మొక్కలతో బీడుపడి వుంది. అవన్నీ నున్నగా శుభ్రం చేసి పొలామంతా కిందకీ మీదికీ బాగా దున్నసాగినాడు.
అలా... దున్నుతా వుంటే *ఒకచోట నాగలికి ఏదో తట్టుకొనింది. ఏమబ్బా అని తవ్వి చూస్తే లోపల ఒక ఇనుప పెట్టె తుప్పుపట్టి వుంది. దానిని జాగ్రత్తగా బైటకు తీసి మూత తెరిచినాడు.* 
లోపల ధగధగలాడుతా ఇరవై వేల బంగారు వరహాలు కనబన్నాయి. పైన ఒక చీటీ వుంది.
బాబూ ... ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే అర్థం ఇప్పటికే నీ ఆస్తినంతా పోగొట్టుకున్నావన్నమాట. ఐనా పరవాలేదు. నిరాశపడకు. మా తాత నా చేతిలో పెట్టింది పదివేల వరహాలే. దానిని పెట్టుబడిగా పెట్టి నేను ఎంతో సంపాదించినాను. ఇప్పుడు దానికి రెట్టింపు వరహాలు
నీ చేతిలో వున్నాయి. నీవు కష్టపడి తెలివితేటలతో పనిచేస్తే ఇంతవరకూ నువ్వు పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంతవరకూ నువ్వు ఎక్కడ తప్పు చేసావో ఆలోచించు. మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్తగా అడుగులు ముందుకు వెయ్యి . *ఎవడైతే పొరపాట్ల ద్వారా గుణపాఠాలు నేర్చుకుంటాడో... తిరిగి ఆ తప్పులు చేయకుండా వినయంతో నిజాయితీగా అడుగులు ముందుకు వేస్తాడో...  విజయం వాని చెంతకు తిరిగి అదే వెదుక్కుంటా చేరుతుంది* అని వుంది.
తండ్రి తన గురించి ఎంత ముందు జాగ్రత్త తీసుకొన్నాడో అర్థమయ్యేసరికి కొడుకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. పైకి చూసి దండం పెట్టుకున్నాడు. ఆ ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడి వ్యవసాయం చేస్తా, వచ్చిన వరహాలను క్రమశిక్షణగా ఖర్చు పెడతా తిరిగి కొద్ది సంవత్సరాలలోనే మరలా ధనవంతుడయినాడు.