ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తగిన శిక్ష. ( బాలల కథ )-----రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
November 6, 2020 • T. VEDANTA SURY • Story

   సోము అల్లరి పనులకు అంతులేదు. ఇంటికి వెళితే పుస్తకాల సంచి ఇంట్లో పడేసి, బయటకు వెళ్ళాడంటే ఆటలే ఆటలు. పాఠశాలలో ఉపాధ్యాయుడు గమనించకుండా పక్క వాళ్ళను పాఠం విననివ్వకుండా ఇబ్బంది పెట్టేవాడు. వాళ్ళను చెడగొట్టే ప్రయత్నం చేసేవాడు. వాళ్ళ లెక్కల ఉపాధ్యాయుడు శేఖర్ అంటే చాలా మందికి భయం. ఎంతో శ్రద్ధతో గణితం బోధిస్తాడు. హోం వర్క్ చేరుకున్నా, అడిగిన లెక్కలు చేయకున్నా వారిని సున్నితంగా మందలిస్తూ మంచి మాటలతో మార్చే ప్రయత్నం చేసేవాడు. కానీ క్రమశిక్షణ తప్పితే కఠినంగా దండించేవాడు. 

 
      ఒకసారి ఉపాధ్యాయులు లెక్కలు చెబుతున్నారు. తరగతి అంతా పిన్ డ్రాప్ సైలెన్సుతో వింటున్నారు. కిటికీ అవతల ఓ పిట్ట కూసింది. సోము నవ్వాడు. సోము వల్ల పక్కనున్న కిషన్ నవ్వాడు. మాస్టారు ఇద్దరినీ కఠినంగా శిక్షించాడు. మరోసారి రాముపై కోపం వచ్చి, రాము హోంవర్క్ నోట్స్ ఎవరూ లేని సమయంలో దొంగిలించాడు. మరునాడు ఉపాధ్యాయులు అడుగగా తన నోట్స్ పోయిందని రాము చెప్పాడు. దూరం నుంచి గమనించిన సుదర్శన్, మహేంద్రలు  జరిగిన సంగతి చెప్పారు. ఉపాధ్యాయులు శేఖర్ సోము తల్లిదండ్రులను పిలిపించి చెప్పాడు. వారిముందే సోమూను శిక్షించాడు. 
 
     మరోసారి సోము, సత్యంలు పాఠశాలకు ఆలస్యంగా వచ్చారు. మాస్టారు పట్టించుకోకుండా పీరియడ్ అయిపోయే దాకా లెక్కలు చెప్పారు. పీరియడ్ ముగిశాక కారణం అడిగితే సత్యం "సోము బెదిరించి, బలవంతంగా నన్ను తోటలో పళ్ళ దొంగతనానికి తీసుకెళ్ళాడు." అని చెప్పాడు. సత్యంను సున్నితంగా మందలించి, సోమును తనవెంటే ఉంచుకొని సాయంత్రం దాకా ఆపకుండా ఎక్కాలు చదివించి అప్పజెప్పించుకున్నాడు. సాయంత్రం వరకు కొన్ని ఎక్కాలే రాగా మాస్టారు తనవెంటే ఇంటికి తీసుకెళ్ళి చదివించాడు. మరునాడు కూడా రోజంతా ఇదేపని. దెబ్బకు మనోడు కొంచెం దారిలోకి వస్తున్నాడు. చదువుపై శ్రద్ధ చూపించాడు. దారిలోకి వస్తున్నాడు కదా అని శేఖర్ గారు సోముని ఏమీ అనడం లేదు. సోము ఏ తప్పు చేసినా దగ్గరకు తీసుకొని మంచితనంతో చెబుతూ మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు మాస్టారు. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు సోము. ఆ తర్వాత నన్ను ఎవరూ ఏమనడంలేదని అహంకారం పెరిగి, మళ్ళీ అల్లరి పనులు మొదలు పెట్టాడు. "ఒరేయ్ సోమూ! బుద్ధిగా ఉండేలా! మాస్టారు గారు ఏమీ అనడం లేదని చెడ్డదారిలో వెళితే నీకు తగిన శాస్తి జరిగింది." అని హెచ్చరించాడు వా‌సు. "పోరా! నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. నేను ఆడింది ఆట పాడింది పాట." అన్నాడు సోము. మూర్ఖులను మార్చలేమని ఊరుకున్నాడు వాసు.
 
      తిరుమలేశు ఆ తరగతిలో అతి బుద్ధిమంతుడు. ఎవరినీ నొప్పించకుండా తన చదువేదో తాను చూసుకునేవాడు. అతని సత్ప్రవర్తన ఉపాధ్యాయులను ఆకట్టుకునేది. కల్లా కపటం, కోపం తెలియని వాడు. అందరితో స్నేహం చేసేవాడు. ఒక్కరోజు తిరుమలేశు పాఠశాలకు రాకపోతే తోటి విద్యార్థులకే కాదు, ఆ తరగతి బోధించే ఉపాధ్యాయులకు పెద్ద వెలితిగా ఉండేది. సోమూకు సైతం తిరుమలేశు ప్రాణ స్నేహితుడు. ప్రతిరోజూ తిరుమలేశు తన ఇంట్లో తయారుచేసిన తినుబండారాలు, బయట దుకాణాలలో కొన్న తినుబండారాలు, రకరకాల పళ్ళు సోమూకు ఇస్తుండేవాడు. సోము తో తరచూ ఆటలు ఆడుతుండేవాడు. ఇటీవల సోము ప్రవర్తన వల్ల తిరుమలేశు ఎంతో బాధపడుతున్నాడు. సోమూకు అల్లరి పనులు మాని, బుద్ధిగా చదువుకోమని సలహా ఇస్తున్నాడు. అయినా మనోడు పట్టించుకోవడం లేదు. 
 
      ఒకరోజు శేఖర్ గారు అతి ముఖ్యమైన, కఠినమైన లెక్కలు చెబుతున్నారు. తిరుమలేశు ఎంతో ఏకాగ్రతతో వింటున్నాడు. వెనుక కూర్చున్న సోము తిరుమలేశుకి కితకితలు పెడుతున్నాడు. వద్దు అని బతిమాలుతున్నాడు తిరుమలేశు. అయినా సోము ఆపడం లేదు. సహనం నశించిన తిరుమలేశు సోమూను చెంపమీద కొట్టాడు. శేఖర్ గారు వెంటనే వీరివైపు తిరిగి "ఎందుకు కొట్టావురా సోముని.?" అని అడిగాడు. సమాధానం రాలేదు. శేఖర్ గారు తిరుమలేశుని దండించాడు. "నన్ను క్షమించండి గురువు గారూ! నా ఆరోగ్యం సరిగా లేదు. దయచేసి ఈ ఒక్కరోజు నన్ను ఇంటికి పంపించండి." అని బతిమాలాడు. అనుమతించారు ఆ ఉపాధ్యాయులు. ఎన్నడూ ఏ ఉపాధ్యాయులతో చిన్న మాట కూడా పడని తిరుమలేశు ఇప్పుడు సోము మూలంగా దెబ్బలు తినడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఇంటికి వచ్చిన తిరుమలేశు ఆ పాఠశాలలో నేను చదవనని తల్లిదండ్రులను బాగా బతిమాలినాడు. పట్టణంలో తన పెద్దమ్మ ఇంటికి పంపించమని అక్కడ తన పెద్దమ్మ కూతురు (చెల్లెలు) తో కలిసి చదువుకుంటానని అన్నాడు. తల్లిదండ్రులు అంగీకరించారు.
 
   .   వాసు ఫోన్ చేస్తే తిరుమలేశు తనను శిక్షించిన మాస్టారుపై తాను అలగలేదని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమానమని, తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిందే అని, సోము ప్రవర్తన వల్ల విసిగిపోయానని మనశ్శాంతి కోసం పాఠశాల మారాల్సి వచ్చిందని చెప్పాడు. ఇది అందరికీ తెలిసింది. సోమూతో చాలామంది మాట్లాడటం మానేశారు. అసలు సోమూతో ఎవ్వరూ ఆడుకోవడం లేదు. అందరిలో ఒంటరి వాడయ్యాడు. బయటికి వెళ్తే అందరూ హేళన చేస్తున్నారని ఆటలు మానేశాడు. అన్నింటికన్నా ముఖ్యంగా తన చెడు ప్రవర్తనతో ప్రాణ స్నేహితుని కోల్పోయాడు. ఇంతకంటే కఠిన శిక్ష సోమూకు ఏముంటుంది?.