ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తనకోపమె తన శతృవు: ఎం బిందుమాధవి
November 10, 2020 • T. VEDANTA SURY • Story

తనకోపమె తన శతృవు,
తన శాంతమె తనకు రక్ష దయచుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఖమె నరకమండ్రు తధ్యము సుమతీ! "

సుమతీ శతకం --

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి మనిషికున్న ప్రధమ శతృవులు.
వీటన్నిటిలో క్రోధం అనేది వ్యక్త పరచటంలో మనిషి చర్యలో కాఠిన్యం, మాటల్లో పరుషత్వం వారినిఏ స్థాయికి దిగజారుస్తాయో ఊహకి అందదు.

శాంతం వహించటం కొంత కష్టమే అయినా అసంభవం కాదు. అది ఆపత్సమయంలో రక్ష వంటిది.

అలాగే మనిషికి దయ, కారుణ్యం అనేవి ఆత్మీయమైన చుట్టం వంటివి. తనకి ఉండే తృప్తి-సంతోషం అనేవి స్వర్గం కంటే గొప్పవి.

అసంతృప్తి వల్ల కలిగిన దు:ఖం నరకం వంటిది- అని ఈ పద్యానికి అర్ధం.

ఈ విషయాన్నే ఒక కధా లాగా తెలుసుకుంటే ఇంకా బాగా అర్ధమవుతుంది.

***********

ఆ రోజు స్కూల్ లో జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తున్నది కల్పన.

ఎన్ని సార్లు నేర్పటానికి ప్రయత్నించినా రవి కి ఫార్ములా అర్ధం కావటం లేదు. పోనీ వదిలేద్దామా అంటే యాన్యుయల్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి.

ఓర్పు నశించి చెంప మీద ఒక్కటేసింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండగా, ఒక్కసారిగా వాడు తిరగబడి 'అందరిముందు నన్ను కొడతావా' అని ఏక వచన ప్రయోగం చేస్తూ టీచర్ అనైనా చూడకుండా గట్టిగా అరిచాడు.

కల్పన ఇంక నిగ్రహించుకోలేక చేతిలో ఉన్న స్కేల్ తీసుకుని ఎడాపెడా ఎక్కడపడితే అక్కడ కొట్టింది. రవి స్పృహ తప్పి పడిపోయాడు.

ఇదంతా చూస్తున్న ఆ క్లాస్ లో మిగిలిన పిల్లలు ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేశారు.

ఆవిడ గబ గబా వచ్చి జరిగిందానికి సంజాయిషీ అడిగి, కల్పన మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్ లెటర్ చేతిలో పెట్టింది.

*****************

కల్పన మ్యాత్స్, సైన్స్ సబ్జెక్ట్ ల తో డిగ్రీ చదివి, డిస్టింక్షన్ లో పాస్ అయింది. బి ఇడి కూడా చేసింది. ఎప్పటికైనా మంచి టీచర్ అవ్వాలనేది తన బలమైన ఆకాంక్ష.

మధ్య తరగతి కుటుంబం, ఇంకా ఇద్దరు పిల్లలు తన తరవాత ఉన్నందువల్ల, తను ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేసి ఎక్కడో ఒక చోట స్థిరపడే లోపే తల్లిదండ్రులు పెళ్ళి చేసేశారు.

భర్త తో హైదరాబాద్ కాపురానికి వచ్చి, కొంచెం స్థిరపడ్డాక పేపర్ లో వచ్చిన ప్రభుత్వ టీచర్ పోస్ట్ కి దరఖాస్తు పెట్టి, పరీక్షల కి ప్రిపేర్ అయి బాగా వ్రాసింది. ఫలితాలు వచ్చి కల్పన కి హైదరాబాద్ కి 40-50 కి. మీ దూరంలో ఉన్న ఒక స్కూల్ లో పోస్టింగ్ ఇచ్చారు.

రోజూ ఇంటి పనులన్నీ ముగించుకుని ఉదయం 7 గం.ల కల్లా బస్ స్టాండ్ కి వస్తే తప్ప తనని స్కూల్ టైం కి చేర్చే డిస్ట్రిక్ట్ సర్వీస్ బస్ దొరకదు. అలా ఉదయం భోజనం/టిఫిన్ "ముక్కునా నోటినా" కొట్టుకుని, పరుగెత్తి బస్ స్టాప్ కి చేరుతుంది.

*****************

తనకిష్టమైన ఉద్యోగం అంత దూరంలో వచ్చినా కష్టమనుకోకుండా ఇష్టంగా చేస్తూ, పిల్లలకి పాఠం రావాలని తాపత్రయ పడే టీచర్, కోపాన్ని నిగ్రహించుకోలేక ఈ రోజు ఇలాంటి (సస్పెన్షన్) పరిస్థితి తెచ్చుకున్నది.

మనసంతా వికలమై కాఫీ కలుపుకోవటానికి వంటింట్లోకి వెళ్ళింది. చిన్నప్పుడు అమ్మ ఎప్పుడూ చెప్పే మాట గుర్తుకొచ్చింది.

"తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దు:ఖమె నరకమండ్రు తధ్యము సుమతీ"
అని నీకు విషయ పరిఙ్ఞానం బాగా ఉన్నది. పాఠం చెప్పే నేర్పూ ఉన్నది కానీ కోపాన్ని నిగ్రహించుకోలేకపోతే నువ్వెంత మంచి టీచర్ వైనా అదంతా "బూడిదలో పోసిన పన్నీరు" లాంటిదే అవుతుంది.

నీ స్టూడెంట్స్ కి నీ పట్ల అభిమానం బదులు భయం, అయిష్టం ఏత్పడతాయి, జాగ్రత్త అని ఎప్పుడూ హెచ్చరించేది.

చివరికదే జరిగింది! అనుకుంది.