ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తినకపోతే మానెయ్ :- డా.కె.ఎల్.వి.ప్రసాద్,; హనంకొండ,వరంగల్.
November 22, 2020 • T. VEDANTA SURY • Memories

మా పెద్దక్క కుమారి మహానీయమ్మ. కానేటి ,నాగార్జున సాగర్ ,దక్షిణ ---
విజయపురి ,ప్రభుత్వ పాఠశాలలో ,సైన్స్ అసిస్టెంట్ గా పనిచేసేది. చాలా మంచి ఉపాధ్యాయినిగా పేరుతెచ్చుకుంది. ఆవిడ చేతిలో బెత్తంలేకుండానే 
విద్యార్థులు భయపడేవారు. బహుశః దానిని భయం అనేకంటే,ఆవిడ పట్ల 
ఎనలేని గౌరవం అని చెప్పాలి. అక్క ఖచ్చితమైన నిర్ణయాలకూ,జీవనశైలి 
కి ,క్రమశిక్షణకూ ,మంచి మర్యాద ఇచ్చేవారు. నా .. ప్రస్తుత జీవన శైలి --
బహుశః నాకు అక్క నుండే సంక్రమించిందేమో !
నేను మెట్రిక్యులేషన్ పాస్ కాకముందు ,హైద్రాబాద్ లో పెద్దన్నయ్య దగ్గర వుండే వాడిని. అప్పుడప్పుడూ సాగర్ కు వెళ్లి అక్కను చూసి వచ్చేస్తుం-
డే వాడిని. మెట్రిక్యులేషన్ పాస్ అయిన తర్వాత తదుపరి చదువు నిమి-
త్తం,పెద్దక్కదగ్గరికి నాగార్జున సాగర్ చేరుకున్నాను .అక్కడ నేను ఇంటర్మీ
డియెట్ చదవాలని,నిర్ణయం అయింది .
అక్క దక్షిణ విజయపురి లో ఉండేది .అది గుంటూరు జిల్లాకింద వస్తుంది .
నేను చదవబోయే జూనియర్ కళాశాల విజయపురి-నార్త్,లో-హిల్ కాలనీ
లో ఉండేది .అది నల్లగొండ పరిధిలోనికి వస్తుంది .సాగర్ ప్రాజెక్ట్ పక్షాన ఒక బస్సు మాకు కేటాయించారు .బస్సులో ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే వాళ్ళం .అదొక మరపుకురాని మధుర ఘట్టం !
మా కుటుంబం లో,అక్క వక్కతే చిన్నప్పటినుండీ నూటికి నూరు శాతం
శాఖాహారి .మేము సాగర్ లో ఉన్నంత కాలం ,మాకు నాన్-వెజ్ అనేది గుర్తు రానంతగా రుచికరమైన వంటలు వడ్డించేది .రెండు-మూడు రకాల
కూరలూ,రసం,పచ్చళ్లు,పొడులు,నెయ్యి,ఉండేవి .అందుచేత నేను ఎప్పుడూ నోరుతెరచి నాకు నాన్-వెజ్,కావాలని మాఅక్కను అభ్యర్ధించ-
లేదు!
అయితే మొదటి సారి అక్కదగ్గరకు వెళ్లిన కొద్దీ రోజుల తర్వాత ఒక రోజు
అక్క లంచ్ కోసం కాకర కాయ కూర వండింది .అది నాకు ఇష్టం లేని 
వంటకం .ఆవిషయం అక్కకు తెలీదు .అక్క ఆ..కూర వండుతున్నవిష-
యం నాకు తెలీదు .అక్క బడినుంచి లంచ్ కోసం వచ్చి నాకు కూడా 
వడ్డించింది.కాకరకాయ కూరచూసి నాకు వద్దు అన్నాను .బాగుంటుంది తిన మన్నది.నేను తినమని మొండికేసాను .అక్క చాలా బ్రతిమాలింది .
నేను వినలేదు . అయితే..తినకు మానెయ్..అంది .పంతానికి తినకుండా
వెళ్లి ఒక మూలన కూర్చున్నాను .సమయం ప్రకారం తయారయ్యి అక్క
బడికి వెళ్ళిపోయింది .అసలే నాకు ఆకలి ఎక్కువ! సమయానికి తినక-
పోవడం తో ఆకలి ఉదృతి పెరగ సాగింది ,ఇక తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది .మెల్లగా పిల్లిలా వెళ్లి అన్నం పెట్టుకుని కాకరకాయ తోనే కడుపు నిండా తినేసాను .అప్పుడు కానీ కుదుట పడలేదు శరీరం.
మామూలుగా అక్క బడినుండి సాయంత్రం ఇంటికి వచ్చింది .వంట పాత్రలు ఖాళీగా ఉండడం చూసి ,నాదగ్గరికి వచ్చితల మీద చేయి వేసి
నవ్వింది . ఆనవ్వు తర్వాత, దేనికీ ‘’ నో’’ చెప్పకుండా చేసింది .ఇంతకీ
అప్పుడు నేను అలా బెట్టు చేయడానికి కారణం మా పెద్దన్నయ్య మీనన్!
ఆయన నాకు ఇష్టం లేనివి ఏమీ చేసేవాడు కాదు,నన్నుఏరకంగానూ బాధ పడకుండా ,ఒకరకంగా చాలా గారాబంగా పెంచాడు .ఇద్దరూ,నా అభి
వృద్ధికోసం శ్రమించిన వాళ్ళే! ఆఇద్దరి ప్రేమనూ పొందిన గొప్ప అదృష్టం
నాది .ఇప్పుడు ఇద్దరూ..ఈలోకం విడిచి వెళ్లిపోయారు.