ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలంగాణ ఉద్యమ మాష్టారు.. ప్రొ.జయశంకరు సారు(నేడు ప్రొ.జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా సార్ గురించి రాసిన ఇది నా స్వీయ సమీక్ష వ్యాసం.)--డా.తెలుగు తిరుమలేష్-- తెలంగాణ సిద్ధాంత కర్తగా, తెలంగాణ ఉద్యమ నేతగా,తెలంగాణ ఉద్యమ జ్యోతి గా,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆయన శ్వాస గా, ఆశ గా , స్వప్నం గా ,లక్ష్యం గా జీవించారు జయశంకర్ గారు.తెలంగాణ బావ వ్యాప్తి ని ,తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ దాకా వినిపించిన మేధావి జయశంకర్ గారు.ఈ సందర్బంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన గురించి కొన్ని జ్ఞాపకాలు.. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు 1934 ఆగస్టు 06 తేదీన నాటి వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో మహాలక్ష్మి, లక్ష్మికాంత రావు దంపతులకు జన్మించారు.ఆయన బెనారస్, అలీగడ్ విశ్వవిద్యాలయం లో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పీహెచ్ డి చేశారు ఉపాద్యాయులు గా జీవితం ప్రారంభించిన జయశంకర్ గారు1975లో సీకేఎం కాలేజీ ప్రిన్సిపల్ గా, కాకతీయ యూనివర్సిటీ రిజీస్టర్ గా,ఉపాధ్యాక్షులు గా పనిచేశారు.అంచలంచాలుగా స్వయం కృషి తో ఎదిగిన జయశంకర్ సార్ గారి జీవితం లో ఆంధ్ర పాలకుల అవమానం ,పెత్తం దారి తనం చూసి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని బాల్యంలోనే గుర్తించి వాటిని చదువు తో ఎదిరించాలని అనుకోని చదువుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోర కై అనేక ఉద్యమాలలో పాల్గొని, తుది శ్వాస వరకు తన విజ్ఞాన్ని తెలంగాణ చరిత్రకు దారపోషిన విజ్ఞాశీలి ,చారిత్రక పురుషుడు జయశంకర్ గారు.ఈయన కు తెలుగు ,హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది.పాఠశాల దశలోనే నాయకుడు గా ఎదిగిన జయశంకర్ గారు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.1952లో తెలంగాణ నాన్ ముల్కి ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు.1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి.1969లో జై తెలంగాణ ఉద్యమం లో తనదైన పాత్ర నిర్వయించిన వీరుడు జయశంకర్ గారు.తరువాత 1995 లోని మల్లి దశ తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి గా ,మార్గదర్శి గా నిలిచిన అపర మేధావి.తరువాత 2001ఏప్రిల్ 27 న టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు సరైన నాయకుడిగా ఇప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ప్రోత్సహించి పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లారు జయశంకర్ గారు. తరువాత 2004 లో టీఆర్ఎస్ పార్టీ నుండి లోక సభకు ఎన్నికైన కే. చంద్రశేఖర్ రావు గారు 2006 సెప్టెంబర్ 12 న పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు .తరువాత 2009 సాధారణ ఎన్నికలలో అధిక స్థానాలతో కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి గా వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు.2009 సెప్టెంబర్2 న రాజశేఖర్ గారి మరణం తో తదనంతరం కె.రోశయ్య గారు ముఖ్యమంత్రి గా చేశారు.తరువాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా చేశారు. ఈ దశలోనే 2009 నవంబర్ 29 న కె.సి. ఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష మరియు ఈ సమయంలోనే 2009 డిసెంబర్ 4 న శ్రీకాంతాచారి మరణం తెలంగాణ ప్రజలను కలిచివేసింది.తరువాత 2009 డిసెంబర్ 24 న రాజకీయ ఐ. కా.స ఏర్పాటు కావడం తో ఉద్యమం మరింత ముందుకు వెళ్ళింది. చివరిగా 2009డిసెంబర్ 9న నాడు కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేయడం తరువాత ఆంధ్ర వారి ఒత్తిళ్లకు తలొగ్గి 2009 డిసెంబర్ 23 న అసెంబ్లీ తీర్మానం తరువాత రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం అని చిదంబరం గారు ప్రకటించడం తో తెలంగాణ లో ఆందోళనలు మొదలయ్యాయి. దీనితో జయశంకర్ సార్ గారు ఆందోళన చెంది తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాలను పార్టీలకతీతంగా అందరికి తెలియచేసి ఒక ప్రణాళిక ను రచించి అందరిని కలుపుకుపోయి ఉద్యమాన్ని ఉదృతం చేసి పల్లె పల్లె పట్టాల పైకి, మిలియన్ మార్చ్, సామూహిక రాజీనామాలు సకలజనుల సమ్మె, సాగరహారం, చలోఅసెంబ్లీ,వంటా వార్పు వంటి ఉద్యమ కారిక్రమాలకు ఊపిరిగా నిలిచారు జయశంకర్ సార్ . జయశంకర్ సార్ శాంతియుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నీళ్లు, నిదులు ,నియామకాల పరిణామాలు తెలంగాణ కు ముందు తెలంగాణ తరువాత ఎలా ఉంటాయో ప్రజలకు, మేధావులకు వివరించిన మహనీయుడు. ఆయన వివరణతో ప్రజలు, యువకులు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, కవులు, కళాకారులు, రచయితలు,జర్నిలిస్టులు, ఉద్యోగస్తులు మెలోన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై ,ఉద్యమం కొరకై ఆజన్మ బ్రహ్మ చారిగా ఉండిపోయారు.అనేక ప్రసంగాలతో దేశ,విదేశాలలో తెలంగాణ ఆవశ్యకత గురించి వివరించిన సాధికారిక స్వరం జయశంకర్ గారు.అదును చూసి అడుగులు ముందుకు వేయాలి అని తెలియచేసిన చరిత్రకారుడు, తెలంగాణ వెలుగుల కిరణం, ఉద్యమ జ్యోతి జయశంకర్ గారు.పుట్టుకనీది.... చావు నీది...బ్రతుకంతా దేశానిది అని చెప్పిన కాళోజి మాటలను నిజం చేసిన తెలంగాణ వైతాళికుడు.మూడుతరాల తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర వహించారు . రాష్ట్ర సాధన ఆయన ద్యేయంగా పనిచేశారు. నేను ఉద్యమ కర్తను కాదు....నేను కేవలం ఉద్యమ స్వచ్చంద కార్యకర్తను మాత్రమే అని ప్రకటించుకున్న విశాల హృదయుడు ,నిరాడంబరుడు జయశంకర్ గారు. అలాంటి జయశంకర్ గారు కె.సీ.ఆర్ గారికి రాజకీయ గురువుగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అరవై ఏళ్ళు గా సాగిన ఉద్యమానికి నాయకుడిగా నిలిచి తెలంగాణ నావకు చుక్కాని లా నిలిచిన తెలంగాణ భాస్కరుడు ఆయన.తెలంగాణ వస్తే ఏమొస్తది అని వివరించిన తెలంగాణ ఆశాజ్యోతి ఆయన. అనేక పదవులలో ఆయనకు అవకాశం వచ్చినప్పటికి వాటన్నిటినీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు తృణప్రాయంగా వదిలిపెట్టిన తెలంగాణ త్యాగమూర్తి ఆయన.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కలిగే వందల ప్రశ్నల జవాబులకు తానొక్కడినే సమాధానం అని చెప్పారు. 2010 ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు శ్రీకృష్ణ కమిటిని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి రాష్ట్ర ఏర్పాటు ప్రయోజనాలకు సంబందించిన విషయాలను వారికి వివరించిన విజ్ఞాన శీలి ఆయన. బాధితులు గలం విప్పినప్పుడు... మేధావులు కలం విప్పాలి అని తెలియచేసిన సాహితీ వేత్త జయశంకర్ గారు.ఆయన తెలంగాణ కు పునాదిగా నిలిచిపోయారు. మా తెలంగాణ మాగ్గావాలి! యాభై ఏళ్లు గా ఇదే మా ఆకాంక్ష,ఇదే శ్వాస, ఇదే లక్ష్యం, ఇదే జీవితం, ఇందులోనే మా జీవితం ఉందని చెప్పిన ఆదర్శ గురువు ఆయన. తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ గారి నాయకత్వం బాగుంటుందని గుర్తించి,ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తన బలం... బలహీనత తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన తెలంగాణ బుద్ధుడు ఆయన. తెలంగాణ రాష్ట్రం రావాలి... అప్పుడే నేను చనిపోవాలి అని చెప్పిన ధన్యజీవి ఆయన.చివరిగా అమరుల త్యాగాలను, బలిదానాలను, ఉద్యమ బావాలను గ్రహించి కేంద్ర ప్రభుత్వం 2014 మార్చి 4 న ఒక ప్రకటనను విడుదలచేసింది. అది జూన్ 2 వ తేదీని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం గా జరుపుకోండి అని చెప్పి 29 వ రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. కాని మూడు తరాల తెలంగాణ సుదీర్ఘ ఉద్యమం లో పోరాటం చేసిన జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవాన్ని చూడకుండ 2011 జూన్ 21 వ తేదీన అనారోగ్యం తో తుదిశ్వాస విడిచారు. మనకోసం ,మనపిల్లలకోసం,జాతి వెలుగు కోసం నిరంతరం ఉద్యమ మే ఊపిరిగా చేసుకున్న జయశంకర్ సారు మరియు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరూ తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం చిరంజీవులుగా నిలిచిపోతారు . అలాంటి జయశంకర్ సార్ అందరికి ఆదర్శనీయులు గా ,స్పూర్తి గా ,చరస్మరణీయులుగా నిలిచిపోయారు.ఆయన జ్ఞాపకాలతో ఈ అక్షరాంజలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ సార్ సేవలను గుర్తించి ఆయనను తెలంగాణ రాష్ట్ర పితామహుడిగా గుర్తిచడం,అగ్రికల్చర్ యూనివర్శిటికి ,మరియు ఒక జిల్లా కు ఆయన పేరును ఉంచడం ,మరియు అనేక అభివృద్ధి కారిక్రమాలకు ఆయన పేరును ఉంచడం అభినందనీయం ......జోహార్... జయశంకర్ సార్.. జోహార్...
August 6, 2020 • T. VEDANTA SURY • News