ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలంగాణ గడ్డమీద పుట్టిన బిడ్డలకు మన యాసను మన భాషను అభిమానించే ప్రతి ఒక్కరికి తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు: సరోజ పోచమల్లు
September 9, 2020 • T. VEDANTA SURY • News

.ఆవ్వ సను వాల కమ్మదనం ఎంత మధురమో మన యాసతోని ముచ్చటెడితే అంత మస్తుగుంటది..
ఇగ పట్నం ల ఏరే బాస దాని జాగీర్ ఉన్నట్టు రాజ్యమేలవట్టే.ఇగ పడుసు పోరగాండ్లు,మత్తు సదువుకున్నోళ్లు,పెద్ద,పెద్ధోళ్ళు మన యాస తోని మన బాస(భాష)ను మాట్లాడడు మోటు అనుకోవట్టిరి.
కొద్దిగంత పల్లెలెనే మన బాస గొంతికల కొరిజివనం తోని బతుకుతంది.సదువుకోని ఎనకటి పెద్దమనుసులే నయ్యం మన యాసను మరువక గాళ్ళు యాడికిపోయిన గాళ్ల ముంగట ఎంత పెద్ధోళ్ళు ఉన్న కూడా మన యాస తోని ముచ్చట సెప్తరు.ఒగరిని,ఒకరు ఈ యసతోనే మందలించుకుంటారు.
పల్లెల ఉట్టిన బాస. గా పల్లె ను ఇడిసి పోక గిప్పడిదాకనైతే కొద్దిగంత బతికేవుంది.
పట్నం నాగరికత మీద మోజు ఆళ్ల ఏషం,ఆల్ల బాస ఆళ్ల సోకులను సూసి గట్ల ఏరే బాస ల ముచ్చట వెట్టుడు నాగరికత అన్న మనాధిల పల్లెటూరోళ్ళు కూడా మన యాసను,భాస ను ఎనకకు వెట్టవట్టిరి.
అంతెందుకు యాడ నన్న గద్దెనెక్కినోళ్లు మాట్లాడిన,ఏదన్న సిన్న నౌకరి తానకాంచి పెద్ద నౌకరి సేసే సార్లు అయిన మన తెలంగాణ మనకు అచ్చిన ఇంకా గూడ గా ఆంధ్రోళ్ల బాస నో లేకుంటే ఇంగిలీస్ బాస నో మాట్లాడుతరాయే. మన యాసన ముచ్చటనే సెప్పరాయే..గిండ్ల గూడ కొద్దిగంత మంది మన యాసను మరువక మన బాస తోని ముచ్చట వెట్టేటోళ్లు కూడా ఉన్నరు..
ఇగ అసలు గమ్మతి ఏంది అంటే మన బడి సదువులు. బల్లె పాఠాలు ఆంద్రబాసనే,లేకుంటే ఇంగిలీస్.ఇగ ఇప్పుడు అయితే జరంత కూడా మన బాస తోని బల్లె ముచ్చట పెట్టుకునుడు లేదాయే.మొత్తం ఇంగిలీస్ (ఇంగ్లీష్)లనే ముచ్చటవేట్టుకోమన వట్టిరి.
ఇగ పుస్తకాలల్ల కొద్దిగంత మన తెలంగాణ అచ్చినంక తెలుగు పుస్తకాలల్ల గిప్పుడు,గిప్పుడే కొద్దిగంత తెలంగాణ కవులను బడి పొలగాండ్లకు పరిచయం సేయవట్టిరి.
బల్లె పాటలు కానుండి మొదలు పాటలు సెప్పే పంతుళ్ళు బల్లె పిలగాండ్లు అందరు కూడి మన యాస న మాట్లాడుడే మనకు గొప్ప అని మన బాస గొప్పదనాన్ని సెప్పినప్పుడే ఏరే బాస పెత్తనం మన మీద పోయేది. ఇయితే గిప్పుడు,గిప్పుడే మన బాస పట్టుతోని పుస్తక ముద్రణ మన బాస ల బల్లె పాటలు సెప్పుడు జరుగుతాంది.గాని ఇది కూడా ఇంకా పురాగ జరుగతలేదు.
పెద్ద నౌకరి సేసేటోళ్లు,గద్దెనెక్కిన పెద్ద మనుషులు ,సదువుసెప్పే పంతుళ్ళు అందరు గూడి మన యసన మాట్లాడు వెడితే గప్పుడు కదా మన బాస గొప్పదనాన్ని సాటినొల్లం అయితం..
మనయాస తోని రచనలు ఇంకా రావలె,పుస్తక ముద్రణ మొత్తం మన యాస తోనే ఉండాలే..
మన తెలంగాణల ఒక్కోకాడ ఒక్కో మాండలిక బాస ఉంది.ఏ ప్రాంతం వాళ్లు ఆ భాసను ఆల్లే కాపాడుకోవాలి.అమ్మ బాసను మరువక ఆ యాసలనే మాట్లాడుకోవాలి.అప్పుడే అమ్మ బాస గొప్పదనం సెప్పినోల్లం అయితం.
ఇగ కాళోజి గారు మన యాస ,మన భాష కోసం దాని మనుగడ కోసం ఎంతో పోరాటం చేశారు.దాన్ని స్ఫూర్తి గా తీసుకొని మనం కూడా మన భాష కోసం ఉద్యమిద్దాం.బడి పలుకుల భాష కాదు పలుకు బడుల బాసనే నేర్వాలే.