ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి మారు పేరు సురవరం ప్రతాపరెడ్డి వర్ధంతి నేడు-మాడిశెట్టి గోపాల్
August 25, 2020 • T. VEDANTA SURY • News

పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యసామాన్యం. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు. నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు .జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది. 
 *తెలుగు సాహితీ నాకం తెచ్చుకున్న వేల్పుగిడ్డి దేదీప్యమాన దివ్యకీర్తి ధీరుడు మన ప్రతాపరెడ్డి* అని దాశరథి గారు ఆయనగురించి ప్రశంసించారు. *అతడు ప్రతాపరెడ్డి, ఇరులై పడియున్న తెలుగువారి గుండె తెరల దుల్పి వెల్గులను నిల్పిన మిత్రుడు, మూర్చపోయినట్టి తెలుగుజాతి సంస్కృతికి టీకలు దీసిన మల్లినాథుడు* అని డాక్టర్ సి.నారాయణరెడ్డి అభివర్ణించారు. 
సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ, నారాయణరెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనం లోనే మరణించారు. అతను చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. చదివాడు. 1916లో మరదలు పద్మావతిని వివాహం చేసుకున్నాడు. సంతానం పదిమందికాగా, ఇద్దరు కుమారులు విగతజీవులు. నలుగురు కుమారులు, నలుగురుపుత్రికల సంతానం. సురవరం ప్రతాపరెడ్డి తన చదువు పూర్తికాగానే హైదరాబాద్‌ కొత్వాల్‌గా వున్న రాజబహదుర్‌ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలోని రెడ్డి హాస్టల్‌కు అతను కోరికపై వచ్చాడు. ఇక్కడ అతను పనిచేసిన దశాబ్ది కాలంలో రెడ్డి హాస్టల్‌ నిర్వహణను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దాడు. నాటి నైవాసిక విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు. 1924 ప్రాంతంలో ఈ హాస్టల్‌ వదాన్యుల సహకారంతో స్థాపించబడింది. ఆ విధంగా హైదరాబాద్‌లో రెడ్డి సాంఘిక సేవా జీవితం పునాదులు వేసింది. మద్రాస్‌ కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం అతనుపై పడింది. నిజాం రాష్ట్రాంధ్ర దుస్థితి రూపురేఖలను మార్చాలన్న తపన ఆనాటి నుండే సురవరం మనస్సులో నాటుకొని పోయింది. హాస్టల్‌ కార్యదర్శిగా వచ్చాక, వేయి గ్రంథాలున్న హాస్టల్‌ లైబ్రరరీని 11వేల గ్రంథాల వరకు పెంచి, విద్యార్థులలో భాషాభివృద్ధికి కృషి చేశాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివాడు. కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు. అనేక భాషలు అభ్యసించిండు. మంచి పండితుడు. 1926లో అతను నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టిండు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించిండు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది.
తెలంగాణలో కవులే లేరని ఒక ఆంధ్ర పండితుడు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోలకొండ కవుల సంచిక అనే సంకలనాన్ని 1934లో ప్రచురించి తిరుగులేని సమాధానం చెప్పాడు. ఆ సంచిక ఇప్పటికీ అపురూపమైనది. తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి ప్రముఖపాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అతనుే అధ్యక్షుడు.
1951లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. న్యాయవాదిగా అతను జీవితం ప్రారంభించి, రచయితగా, కార్యకర్తగా, సంపాదకుడుగా జీవితం సాగించి తెలంగాణ ప్రజల హృదయాలలో ముద్రవేసుకున్నాడు.
*రచనలు*
సురవరం వారు దాదాపు 40 గ్రంథాలు రచించారు.
సురవరం  గ్రంథాలలో "గోల్కొండ కవుల సంచిక" ప్రఖ్యాతి చెందినది. నిజాం రాష్ట్రంలో కవులు పూజ్యులు అనే నిందావాక్యాన్ని సవాలుగా తీసుకొని 354 కవులకు చెందిన రచనలు, జీవితాలతో కూడిన గ్రంథాన్ని ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు ప్రతాపరెడ్డి. ఇందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు చెందిన 87 కవుల వివరాలున్నాయి. ప్రతాపరెడ్డి భావుకుడైన రచయిత. కవితలు, కథలు, వ్యాసాలు రచించిండు. అతను రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడమే కాకుండా ఆంధ్ర పండిత విమర్శకుల ప్రశంస పొందింది. సురవరం ప్రతాపరెడ్డి కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రించినయి. హైందవ ధర్మ వీరులు, హిందువుల పండుగలు, రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను రచించిండు. భక్త తుకారాం, ఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాసాడు. ఇతను రాసిన కథలు మొగలాయీ కథలు పేరుతో రెండు భాగాలుగా వెలువడ్డాయి. వీటిని అణా గ్రంథమాల 1940లో అచ్చువేసింది. రాజకీయ సాంఘిక ఉద్యమంగా సంచలనం కలిగించిన ఆంధ్రమహాసభ మొట్టమొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి తెలంగాణా రాజకీయ చరిత్రలో ప్రతాపరెడ్డిగారు ప్రముఖ పాత్ర వహించారు. 1927లో ఏర్పడిన ఏకైక ప్రజాసంస్థ అయిన ఆంధ్ర మహాసభ యొక్క ప్రథమ మహాసభకు అధ్యక్షత వహించారు. వారి సేవలు అందుకొనని సంస్థ తెలంగాణాలో ఏ ఒక్కటి లేదు.ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులుగా పనిచేశారు. శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, వేమన ఆంధ్ర భాషా నిలయం, హిందీ ప్రచారసభ మున్నగు సంస్థల ప్రగతికి ఎంతో కృషి చేశారు.
రెడ్డిగారి మిత్రులైన గాడిచర్ల హరిసర్వోత్తమరావుగరు కర్నూలు నుండి శాసనసభకు పోటీచేయమని కోరగా రెడ్డిగారు తిరస్కరించారు. కాని పోలీస్ చర్య అనంతరం 1952 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో, మిత్రుల ఒత్తిడిపై వనపర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు. కాని రాజకీయాలు వారి కంతగా రుచించలేదు.
సురవరం వారు రచించిన ' ఆంధ్రుల సాంఘిక చరిత్రకు ' కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు ' లభించింది.
త్యాగము, దేశభక్తి, భాషాభిమానం ప్రజా శ్రేయస్సు పరమార్ధంగా జీవించిన సురవరం ప్రతాపరెడ్డిగారు 1953 ఆగష్టు 25న* దివంగతుడైనాడు.వారికి ప్రగాఢ నివాళులు