ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలివైనవాడు--డి.కె.చదువులబాబు
October 14, 2020 • T. VEDANTA SURY • Story

స్వర్ణగిరిని స్వర్ణసేనుడు పరిపాలిస్తున్నాడు.ఆ రాజ్యంలో దొంగలబెడద ఎక్కువగా ఉండేది.రాజభటులు దొరికిన దొంగలను
కారాగారంలో వేసేవారు.అయినా కొత్త దొంగలు పుట్టుకొస్తున్నారు.రాజభటుల కళ్ళు కప్పి దొంగతనాలు చేస్తున్నారు.
ఆ రాజ్యంలో ప్రవీణుడనే స్వర్ణకారుడున్నాడు.నగలతయారీలో అతనికి మంచి పేరుంది.
ఒకరోజు అర్ధరాత్రి ఇద్దరు దొంగలు కిటికీ రెక్కతొలగించి ప్రవీణుడి ఇంటిలో ప్రవేశించారు.అక్కడ దీపం వెలుగులో
పెద్ద మంచంపై ప్రవీణుడు,అతని భార్య,కుమారుడు నిద్రిస్తున్నారు.మంచం క్రిందఇనపెట్టె కనిపిస్తా ఉంది.దొంగలు పెట్టెను పక్కకు లాగి,వారి దగ్గరున్న మారు తాళాలతో తెరిచారు.పెట్టెనిండా రకరకాల బంగారు నగలు కనిపించాయి.తమపంట పండిందని వాళ్ళు సంతోషించారు.వెంటతెచ్చుకున్న వస్త్ర్రాల్లో రెండుమూటలుగాకట్టుకుని,బయటకొచ్చారు.చీకట్లో నక్కినక్కి
అడుగులేస్తున్నారు.కొంతదూరం వెళ్ళాకకాపలాభటులు వాళ్ళను గమనించారు. దొంగలవైపు రాసాగారు.దొంగలు పరుగందుకున్నారు.
కాపలాభటులు దొంగలను వెంటబడి బంధించారు.కారాగారంలో వేశారు.ఉదయం నగలను తెచ్చి అధికారికి అప్పగించారు.అధికారి రాజుకు,మంత్రికివిషయం చెప్పాడు."రాత్రి తమ ఇంటిలో దొంగతనం జరిగిందని
నగలు పోగొట్టుకున్నవారొచ్చి పిర్యాదు చేస్తారు.ఏమేమి పోయాయో విచారించి,
ఈనగలు వారివేయని నిర్ధారించుకున్నాకభద్రంగా అప్పజెప్పండి"అని ఆదేశించాడు
రాజు.నాలుగురోజులుగడిచాయి.నగలు దొంగలించబడ్డాయని ఎలాంటి పిర్యాదు రాలేదు.
అధికారి ఈ విషయాన్ని రాజుకు,మంత్రికిచెప్పాడు.వారుఆశ్చర్యపోయారు.దొంగలను
కారాగారం నుండి తీసుకురమ్మన్నాడు రాజు. భటులు తీసుకొచ్చారు.
"ఈ నగలు మీరు ఎక్కడ దొంగిలించారు?"అడిగాడు రాజు.
వాళ్ళు దొంగతనం చేసిన ప్రాంతాన్ని చెప్పారు.ఆ ఇంట్లో యజమాని,అతని భార్య,కుమారుడు ఉంటారు.ఆ ఇల్లు ముఖద్వారం తూర్పుకు ఉంది.ఇంటి ముందు ఒకవేపచెట్టు,నాలుగు కొబ్బరి చెట్లున్నాయి."అంటూ కొన్నిగుర్తులు చెప్పారు. ఆ గుర్తుల ప్రకారం భటులు వెళ్ళి ప్రవీణుడిని పిలుచుకునివచ్చారు.
"ఈయన ఇంటిలోనే మేము నగలు దొంగిలించింది." చెప్పారు దొంగలు.
"వీళ్ళే నా నగలు దొంగిలించింది"అన్నాడుప్రవీణుడు.
రాజు సైగతో భటులు దొంగలను తీసుకెళ్ళి
కారాగారంలో వేశారు.
"దొంగతనం చేయటం నీవు చూశావా?" అడిగాడు రాజు.
"మహారాజా!ఇనపెట్టె తీస్తుండే అలికిడికి మెలుకువొచ్చి ఓరకంట దొంగలను చూశాను"చెప్పాడు ప్రవీణుడు.
"మరి కేకలు వేయటమో,తిరగబడటమో
ఎందుకు చేయలేదు?"అడిగాడు రాజు.
"నేను ఆపని చేస్తే ఏంచేయాలో దొంగలు ఆలోచించుకుని వచ్చుంటారు.కత్తులతో
గాయపరచటమో,చంపటమో చేస్తారు.
ఎలాగు సమర్థులైన రాజభటులు దొంగలను
పట్టుకుంటారు కదా!"అన్నాడు ప్రవీణుడు.
"సరే...నీ ఆలోచన తెలివైనదే.మరి నగలు
పోయి నాలుగు రోజులైనా పిర్యాదు ఎందుకు చేయలేదు?"
"మహారాజా!అవి నకిలీ నగలు.అచ్చం బంగారులాగే వుంటాయి.ఏమాత్రం విలువచేయవు"చెప్పాడు ప్రవీణుడు.
రాజు ఆశ్చర్యంతో..."నీ ఇంట్లో భార్య తప్ప
స్త్రీలు ఎవరూ లేరుకదా!మరి పదిమంది ధరించగలిగే నకిలీ నగలు ఎందుకుంచుకున్నావు?"అన్నాడు.
"మహారాజా!నేను స్వర్ణకారుడిని.ఎంతో
మంది నగలు తయారు చేయమని బంగారు
ఇచ్చి వెళ్తుంటారు. తినీతినక,ఎండ,వానలో,
రాత్రీ,పగలు కష్టపడి సంపాదించుకున్న
సొమ్ముతో కూతురు పెళ్ళికోసమో,కొడుకు
భవిష్యత్తు కోసమో నగలు చేయించుకుంటా
రు.వారి సొమ్ముకు నేను జవాబు దారిగా
వుండాలి కదా!దొంగలపాలు చేసి,దొంగలు
దోచుకెళ్ళారంటే,వాళ్ళు వీధిపాలవుతారు.
అందుకే దొంగలెవరైనా వస్తే దీపంవెలుగులో వారికి కనిపించేలా మంచంక్రింద ఇనపెట్టె
వుంటుంది.దానితాళంకుండా సులభంగా
వస్తుంది.చాలా నగలు కనిపించగానే సంతోషంతో చంకలు గుద్దుకుంటూ, మూటకట్టుకుని ఇంట్లో మరెక్కడా వెదక్కుండా వెళ్ళిపోతారు.అసలైన నగలను రాత్రి కాగానే ఇంట్లో  ఒక రహస్య ప్రాంతంలో ఉంచుతాను.
  భటులకు దొంగలు దొరకకున్నా నన్ను నగలు చేయమన్నవారికి ఏ సమస్యా వుండదు"చెప్పాడు ప్రవీణుడు.
ప్రవీణుడు క్షణకాలం ఆగి "మహారాజా!మీకు
ఒక విషయం చెబుతాను వింటారా?" అన్నాడు.
చెప్పమన్నాడు రాజు.
"మిమ్మల్ని కలిసి ఓ విషయం చెప్పాలని
నాలుగుసార్లు ప్రయత్నించాను. లంచగొండులైన భటులు,అధికారులు నేను లంచమివ్వలేదని మిమ్మల్ని కలవనివ్వలేదు.ఈ రోజు మీతో
మాట్లాడే అవకాశం వచ్చింది.మన రాజ్యంలో అక్షరాలు నేర్వడం,చదవటం,వ్రా
యటం విద్యగా కొనసాగుతున్నాయి.
విద్య విలువలతో కూడినదై ఉండాలి.
తప్పుడు పనుల పర్యావసానాలను వివరించి,కథల ద్వారా మంచీ,చెడు విచక్షణ
తెల్పుతూ నైతిక విలువలను,పాపభీతిని చిన్నప్పటినుంచే పిల్లల మనసులో చొప్పించాలి.భవిష్యత్తులో మంచిపౌరులు
తయారవుతారు.దొంగలు,హంతకులు,లంచగొండులుండరు.కారాగారంలో వున్న దొంగలకు వృత్తివిద్యల్లో శిక్షణ నివ్వాలి.స్వయం ఉపాధిని కల్పిచాలి.నైతిక
విలువలను,పాపభీతిని గురువులతో చెప్పించాలి.రాజ్యమంతటా ధర్మాన్ని బోధించే ధర్మప్రచారకులను నియమించాలి.అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది"చెప్పాడుప్రవీణుడు.
రాజు ప్రవీణుడి సూచనలను గౌరవించి,విలువైన కానుకలతో ఘనంగా సత్కరించాడు.
కొద్దికాలం గడిచింది.దీపం వెలుగులో మంచం క్రింద నకిలీ నగల ఇనపెట్టెను పెట్టుకోవటం మానుకున్నాడు ప్రవీణుడు.
డి.కె.చదువులబాబు.9440703716