ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలివైన నిర్ణయం (కథ). రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
November 18, 2020 • T. VEDANTA SURY • Story

రామయ్య ఆ ఊరిలో అతి పెద్ద ధనవంతుడు. అయినా దాన గుణం కలవాడు. అతనికి చాలా మంచి పేరు ఉంది. ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళు అత్తవారింటికి వేరే ఊరికి వెళ్ళిపోయారు. రామయ్యే బయటికి వెళ్ళి పనులన్నీ చేసుకుని వస్తుండేవారు. ఈ మధ్యనే రామయ్య అనారోగ్యం పాలు అయ్యాడు. బయటి పనులకు నమ్మకస్తుడిని నియమించుకోవాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని ప్రకటించాడు. ఎంతోమంది ముందుకు వచ్చారు. రామయ్య పెట్టిన షరతులు విని రాఘవ, శివయ్య, సుదర్శనుడు ముందుకు వచ్చారు. అయితే ముగ్గురినీ పరీక్షించి ఒకరిని పనిలోకి తీసుకోవాలని అనుకున్నాడు. 

 
       ముగ్గురికీ తలా వెయ్యి రూపాయలు ఇచ్చాడు‌. కూరగాయలు, పళ్ళు తెమ్మన్నాడు. ముగ్గురికీ ఒకే రకమైన జాబితా ఇచ్చాడు. మొదటగా సుదర్శనుడు వచ్చాడు. 600 రూపాయలు ఖర్చు అయిందని చెప్పి, 400 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ఆ తర్వాత శివయ్య వచ్చి 450 రూపాయలు అయిందని చెప్పి 550 తిరిగి ఇచ్చాడు.  ఆ తర్వాత రాఘవ వచ్చి 600 రూపాయలు ఖర్చు అయిందని చెప్పి 400 రూపాయలు తిరిగి ఇచ్చాడు. ముగ్గురు తెచ్చిన వాటిని పరిశీలించాడు. సుదర్శనుని తనకు సహాయం చేయడానికి నియమించాడు. మిగతా ఇద్దరు నిరాశగా వెనుదిరిగారు.
 
     రామయ్య భార్య జానకమ్మ ఇలా అడిగింది. "శివయ్య అవే వస్తువులకు తక్కువ ఖర్చు చేశాడు. అతడి వల్ల డబ్బు పొదుపు అయ్యేది కదా! రాఘవ, సుదర్శనుడు అవే వస్తువులకు ఎక్కువ ఖర్చు చేశారు. ఇద్దరూ సమానంగా ఖర్చు పెట్టారు. అయితే సుదర్శనుని మాత్రమే తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఏమిటి?" అని. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు.
 
       "శివయ్య చాలా పొదుపు చేసి మెప్పు పొందాలని చూశాడు కాని నాణ్యతను చూడలేదు. ఎక్కువగా బేరం చేశాడో లేదా తక్కువ ధరలో దొరికే వాటిని కొనాలని అనుకున్నాడో కానీ అతడు తెచ్చిన కూరగాయలు, పళ్ళు పాడు అవడానికి సిద్ధంగా ఉన్నవి. అంటే శివయ్యకు తెలివి లేదని తెలుస్తుంది. అతడు తెచ్చినవి తింటే అనారోగ్యం పాలు కావడం ఖాయం. రాఘవ కూడా శివయ్య తెచ్చిన తక్కువ నాణ్యతవే తెచ్చాడు. అతడు ఖర్చు పెట్టింది తక్కువ. మనకు చెప్పింది ఎక్కువ. ఇలా మోసం చేసేవాడితో ముందు ముందు ఎంతో ప్రమాదం. పళ్ళు మన ఆరోగ్యానికి ముఖ్యం. కూరగాయలు అయినా ధర ఎక్కువ పెట్టినా మేలు రకం కొంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సుదర్శనుడు ఆరోగ్యం కోసం నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి ధర ఎక్కువైనా మంచివి కొనుక్కొని వచ్చాడు. అందుకే అతడికి అవకాశం ఇచ్చాను." అని. భర్త నిర్ణయానికి సంతోషించింది జానకమ్మ.