ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు పదబంధం --కె ఎస్ అనంతాచార్య
August 31, 2020 • T. VEDANTA SURY • Poem

ఓంకారం తో పుట్టిన 
తెలుగు మమకారం
వెలుగు జిలుగుల 
నుడికారం 

పచ్చని పావడ కట్టి
మల్లెలు నెత్తిన చుట్టి వినిపించిన
రమ్యా లోకపు ప్రతిధ్వని 

ఎములాడ రాజన్న నెలవంక
కొమురెల్లి మల్లన్న త్రిశూలం
యాదాద్రి నరసన్న వజ్ర నఖం
భాషా ప్రకట డమరుకం!


జ్ఞానదరి మంత్రపురి
శేషప్ప ధర్మపురి
కాళేశ్వరుని పాదచారి గోదారి
తేట తెలుగు నాద ఝరి

పోతన మందార మకరంద 
మాధుర్యమ్ము
బాపు రమణుల
కుంచెల మాటల సోయగమ్ము
జేగీయ మానమై భాసిల్లు తెలుగు
అవధానమ్ము!

పంటచేల మీది
వరిగొలుసు అలుగు పారే చెరువు లోన
 విరిసే కలువ పూవు

పేర్చిన బతుకమ్మ
ఎత్తిన బోనం
అందమైన కందం
కాకతీ శౌర్య చందం
తెలుగు పద బంధం

నన్నయ నుండి నారాయణరెడ్డి దాకా
 పగలే వెన్నెలై ప్రకాశించిన సాహితీ సౌరభం
పలికే బంగార మయిన
 రామదాసు
భక్తి మేలుకొలుపు
యాభై ఆరుఅక్షరాల
 సొబగులు
 నింపుకున్న
ఇటాలియన్ ఆఫ్ ది
ఈస్ట్ అన్నింటా బెస్ట్
సూర్య చంద్రులున్నంత కాలం
ఋతురాగం వినిపించినంత సేపు
వేద ఘోషలాగా ధ్వనిస్తుంది
అమృతం తాగిన
దేవతల్లగా అమరత్వాన్ని పొందినదీ భాష