ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యంలో కవులకు ధీటుగా నిలిచిన కవయిత్రులు కూడా ఉన్నారు. వారిలో కవయిత్రి ఆతుకూరి మొల్ల ఒకరు. ఈమె కాల మును నిర్ణయించుటకు సరైన ఆధారాలు లేవు, కాని ఈమె 15వ శతాబ్దము అంత్య భాగంలో గాని, 16వశతాబ్దము పూర్వ భాగంలో గాని జీవించి యున్నట్లు చెప్పవచ్చును. ఆ కాలంలో స్త్రీలు చదువులకు అతి దూరంగా ఉండేవారు. పురుషాధిక్యత వలన స్త్రీలకు చదువులుండేవి కావు. ఆనాటి సామాజిక పరిస్థితులు కూడా మొల్లకు అనుకూలంగా లేవు. అందుకు కారణం ఆమె కుమ్మరి కులానికి చెందడం. ఎంత ప్రతికూల వాతావరణమైనా, ఆమె చదువులో అపర సరస్వతి అయింది.ఈనాడు వనితలు అన్ని రంగాలలో ముందున్నారు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు కూడా పురుషులతో పాటు పురోగమించడానికి అనుకూలం. నేడు వనితలు నేర్వగరాని విద్యలు లేవు. అనేక రంగాలలో పురుషుల కంటే స్త్రీలదే పై చేయి. నాటి కవయిత్రి మొల్ల నేటి రచయిత్రులకు స్పూర్తిదాయకమని చెప్పవచ్చును.మొల్ల తండ్రి కేసన శెట్టి. ఈయన గొప్ప శివ భక్తుడు. తండ్రి తన కుమార్తెను పసి వయసులోనే శివుని పాదసేవకు అంకితం చేశాడు. అందుచే జీవిత మంతా బ్రహ్మచారిణిగా బసవేశ్వరుని భక్తురాలిగా మొల్ల జీవించినట్లు తెలుస్తుంది "స్తుత గుణోద్దాము నాచన సోము భీము/నవ్య మంజుల వాగ్ధుర్యు నన్న పార్యు/రసికుడై నట్టి శ్రీనాథ రంగనాథు"// మొల్ల తన రామాయణమందలి కవి స్తుతిలో తిక్కన సోమయాజి కించుమించుగ కొన్ని సంవత్సరముల తరువాత ఉన్నట్లు మరియు శ్రీనాధుని స్తుతించుట లేదు కాబట్టి శ్రీనాధుని తర్వాత కాలమనుటలో సందేహము లేదు. కృష్ణదేవరాయల కాలములోనే ఉన్నట్లు అనేక కథలు నేటికి ఉన్నాయి. ఈ కథలను అనుసరించి ఆమె రాయల కాలమందే ఉన్నదని విశ్వసింపక తప్పదు. "... ... ... ... గోప/ వరపు శ్రీకంఠ మల్లేశు వరము చేత/నెరి కవిత్వంబు చెప్పంగా నేర్చుకున్నాను"//అని చెప్పు కొనుట చేత ఈమె నివాసస్థలము నెల్లూరు మండలంలోని గోపవరమని కొందరి అభిప్రాయము.అదే మండలంలోని ఆత్మకూరు అని వాదన మరి కొందరిది. కడప జిల్లాలోని బద్వేలు సమీపాన గల ఆత్మకూరు అని కూడా అంటారు. వీరి పూర్వీకులు ఆత్మకూరు నివాసమై ఆ తర్వాత గోపవరంలో స్థిర పడి ఉంటారని విమర్శకులు అంటారు. మొల్ల అంటే మల్లెపువ్వు, పేరుకు తగినట్లు ఈమె కూడా మల్లె వలె కవితా సుగంధ పరిమళాలు వెదజల్లింది. ఈమె శివ భక్తురాలు అయినప్పటికీ వైష్ణవ మత ప్రభావం చేత శివకేశవ అభేద భావాన్నిమనసున నిలుపు కొని రామాయణ కావ్యాన్ని రచించి ఉండవచ్చును.మొల్ల రచనా విధానం-బమ్మెర పోతనకు అనుకరణ అని చెప్పవచ్చును. మొల్ల కాలంలో కవులు తాము రాసిన కావ్యాలను రాజులకు అంకితమిచ్చి సన్మానాలు పొందే వారు. సన్మాన సత్కారాలు పొంది ధనం సంపాదించాలనే కోరిక ఈమెకు ఉన్నట్లు కనిపించదు. తనకంటే ముందు వాడును. నరాంకితానికి ఇష్టపడనివాడు అయిన మహాకవి పోతనను, ఈమె ఆదర్శంగా స్వీకరించింది. పోతన:-బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్/అయోగ్యులకు అంకితమిచ్చు కంటే సత్కవులు హాలికులైననేమి?... అని పోతన పలికినట్లు గానే కవయిత్రి మొల్ల అదే మాటను అదే బాటను అనుసరించింది: పల్లవిత ప్రతాప గుణ సాగరుడై విలసిల్లి ధాత్రి పై/ బల్లిదుడైన రామ నరపాకులకునిన్ స్తుతిజేయు జిహ్వకు న్/జిల్లార రాజలోకమును జే కొని మెచ్చగా నిచ్చ పుట్టునే/అల్లము బెల్లమున్ దినుచు నప్పటి కప్పటి కాన చేయునే?//అని చెప్పుచూ, తన రామాయణ రచన విధానాన్ని తెలియజేసింది. (ఇంకా ఉంది ) 36-భాగము---బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్. 9290061336
June 22, 2020 • T. VEDANTA SURY • Serial