ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యంలో పేరు పొందిన కవి దిట్టకవి నారాయణ కవి: ఈయన కవి, పండితుడు, చరిత్ర రచనా సమర్ధుడు. ఈయన పలు రచనలు చేసినప్పటికీ రంగరాయ చరిత్రమను చారిత్రిక గ్రంథం మాత్రమే కనిపించుచున్నది. ఈయన వ్రాసిన ఈ ప్రబంధము నందు మూడు ఆశ్వాసములు మాత్రమే ఉన్నవి. దీనినిబెల్లంకొండ దుర్గాధిపతియు, పద్మనాయక వంశీయుడు అయిన మాల్రాజు రామారాయ నింగారికి అంకితం ఇచ్చాడు. ఈ గ్రంధము వీర రసముతో కూడుకొని యున్నది. బొబ్బిలి సంస్థానాధిపతియైన రావు రంగారావు గారి సేనలకు బుస్సీ ఆదిపత్యమునగల ఫ్రెంచ్ సేనలతో కూడిన పూసపాటి విజయ రామ రాజు గారి సేనలకు క్రీ.శ 1757 సంవత్సరమున బొబ్బిలి కోట దగ్గర జరిగిన యుద్ధము వర్ణించ బడినది. ఈ యుద్ధమున బొబ్బిలి వారే ఓడి పోయినను, వారి సైన్యములు చూపిన ధైర్య సాహసములు ఇందు వర్ణింపబడినవి. అక్కడక్కడ లక్షణ దోషములు కనపడినప్పటికీ ఈకావ్యము మిక్కిలి రసవంతంగా ఉంటుంది. కావ్యంలో సందర్భాన్ని అనుసరించి ఆ కాలంలోవాడుకలోనున్న ఉర్దూ పదములు అనేకము వాడబడినవి.మంగళగిరి ఆనంద కవి(1760 ప్రాంతము):- ఈయన బ్రాహ్మణుడు అయినప్పటికీ క్రైస్తవ మతం అవలంబించి, 'వేదాంత సారం' అనే గ్రంధాన్ని రచిం చాడు. ఇతనివలె క్రైస్తవ మతం స్వీకరించిన నిడి మామిళ్ల దాసామాత్యునికి అంకితమిచ్చాడు.ఈ గ్రంథమున క్రైస్తవ మత ప్రవక్త అయిన యేసుక్రీస్తు చరిత్రము వర్ణింపబడినది. ఇందలి శైలి ప్రౌఢంగా ఉంటుంది. ఈ కావ్యం నందలి వర్ణనలు ప్రబంధ కవులు వర్ణనలను అనుకరించిన ట్లుండును.అలాగే పింగళి ఎల్లనార్యుడు అనే కవి కూడా ఈ విధంగానే క్రైస్తవ మత సంబంధమగు సర్వేశ్వర మహత్యమును వ్రాసి ప్రసిద్ధి చెందాడు. ఈ కావ్య మునందలి శైలి మృదుమధురంగా ఉంటుంది.పిండిప్రోలు లక్ష్మణ కవి:- ఈయన "రావణ దమ్మీ యము"అను నామాంతరము గల "లంకా విజయము" అను ద్వ్యర్థి కావ్యము రచించాడు.ఇందు రెండే ఆశ్వాసములు ఉన్నాయి. రావు ధర్మా రాయుడు అను దురుసు బలిమిగల వ్యక్తి ఇతని లంక భూములలో కొంత అపహరణ గావించాడు. ఇతడు కోపముతో అతనిని రావణుని తోడను,క్షేత్రాపహరణ వృత్తాంతమును రామాయణ కథతోడను పోల్చి ఈ ద్వ్యర్థి కావ్యమును రాశాడు. తిట్లు కవిత్వము నందు ఈయన కడు దిట్ట. భీమకవి శ్రీనాథుడు, సూరకవి వంటి కవులు తనతో సాటిరారని ఈయన చెప్పుకున్నాడు. ఇతని మరొక కావ్యము "రాఘవ పాండవీయం"అంత ప్రౌఢ మైన గ్రంథం కాదు. ఇందు అర్థ శ్లేషమే అనేక చోట్ల కనిపిస్తుంది.అక్కడక్కడ వ్యాకరణ దోషములు కూడా ఉన్నాయి. ఇతడు పలు చాటు పద్యములు వ్రాసినట్లు తెలియుచున్నది.శిష్టు కృష్ణమూర్తి:- ఈ కవి పిండిప్రోలు లక్ష్మణకవికి సమకాలీనుడని చెబుతారు. శిష్టు కృష్ణ మూర్తి కవి సంస్కృతాంధ్రములయందు గొప్ప పండితుడు. ఇతడు పలు గ్రంథాలను రచించాడు. సంగీతమునందు కూడా అపారమైన పాండిత్యము ఉన్నది. పురాణములను, ప్రవచనములు చెప్పుట యుందును,రచించుటయందును, ఆశు కవిత్వము చెప్పుటలోను ప్రావీణ్యుడు. ఇతడు తన జీవిత కాలమంతా గొప్ప అధికారులను, భూస్వాములను దర్శించే వాడు. వారి వద్ద తన పాండిత్య ప్రతిభను చూపేవాడు. వారిచే గొప్ప సన్మాన సత్కారాలు పొందాడు. ఈయన సర్వ కామదా పరిణయము, వెంకటాచల మహత్యం, వీక్షా రణ్య మహత్యము, పంచతంత్రము, స్త్రీ నీతిశాస్త్రము,వసుచరిత్ర- వ్యాఖ్యానము మున్నగునవి తెలుగులో రచించాడు. సంస్కృతంలో కూడా ఇతడు రచించిన పలు గ్రంథములు ఉన్నవి.అందు హరికారికలను వ్యాకరణం పేర్కొనదగినది. చిన్నయ సూరి బాల వ్యాకరణమునకు దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నవి. తెలుగులో ఇదొక పేర్కొనదగిన వ్యాకరణము.మండపాక పార్వతీశ్వర కవి (1888-97):- ఈ కవి శిష్టు కృష్ణమూర్తి వలెనే గొప్పవిద్వాంసుఁడు. ఇతడు బొబ్బిలి సంస్థానమున, ఆస్థాన కవిగా ప్రసిద్ధికెక్కాడు. రాధాకృష్ణ సంవాదము, కాంచీపుర మహత్త్వము, అమరుక కావ్యము అను కావ్యములే కాక ఇతడు పెక్కు శతకములు, దండకములు, వంశ చరితములు రచించెను. ఇతడు నుమారు యెనుబది గ్రంథములు రచించెనని చెబుతారు. ఇతని గ్రంథముల లోని కెల్ల రాధాకృష్ణ సంవాదము సుప్రసిద్ధమైనది.తెలుగుసాహిత్యములో పేర్కొనదగిన కవి ఇతడు. (ఇది 81వ భాగం) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 3, 2020 • T. VEDANTA SURY • Serial