ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యంలో మహా పండితులు, గొప్ప విమర్శకులు, గొప్ప కవులు ప్రాచీన కాలం నుండి ఉన్నారని మనకు తెలుసు. ప్రసిద్ధికెక్కిన పురాణాలు, ఇతిహాసాలు, ప్రబంధ కావ్యాలు వివిధ ప్రక్రియలలో పద్య గద్య రూపాల్లో వ్రాసి తెలుగు భాషను విశ్వవ్యాప్తి చేసి, కీర్తి పతాకం ఎగురేసిన మహా కవులెందరో ఉన్నారు. కానీ, గణిత శాస్త్రము రచించి ప్రసిద్ధి కెక్కిన మహాకవి పావులూరి మల్లన. ఈయన గోదావరి జిల్లాలోని పావులూరి గ్రామమునకు కరణము. ఈయన పదకొండవ శతాబ్దం వాడని అంటారు. నన్నయకు పూర్వపు కవి అని కొందరు చెబుతారు. మరికొందరు సాహితీ విమర్శకులు నన్నయ తర్వాత వాడని అంటారు. ఈ కవి కాలాదులు నిర్ణయిండానికి సరైన ఆధారాలు కనబడడం లేదు.పావులూరి మల్లన, ఆనాడే గణిత శాస్త్ర గ్రంథము వ్రాశాడు. "పావులూరి మల్లన మహత్య విరచితంబైన దశ గణిత శాస్త్రము నందు", అను వాక్యము చేత ఇతడు నియోగియని తెలియుచున్నది. పూర్వకాలంలో లెక్కలు గణించు టలోనే గాక త్వరగా చెప్పుటలోను నియోగులు శ్రేష్టులని లోకోక్తి. క: ఇల గమ్మ నాటి లోపల/ విలసిల్లిన పావులూరి విభుడను సూత్రా/ కలితాస్తంభ ద్విజ/ కులతిలకుడ వినుత గార్గ్య గోత్రోద్భవుడన్ // ఈయన రాసిన గణిత కావ్యము మహా వీరా చార్యులవారి "సంస్కృత గణిత సార సంగ్రహం" భాషాంతరీకరణము. ఇందలి పద్ధతులు మాత్రమే పై గ్రంధము నుండి తెనిగింప బడినవ కానీ లెక్కలన్నియు మల్లనార్యుని చేత స్వతంత్రముగా కల్పించబడినవి. ఈ పావులూరి గణితము గాక ప్రతాపరుద్రుని కాలంలో రచింపబడిన సూత్ర గణితమొకటియు, అచ్యుత దేవ రాయని కాలములో వల్లభామాత్యునిచే తెనిగింపడిన లీలావతీ గణితమును వెంకటేశ గణితము ఎలుగంటి పెద్ద నార్యుని ప్రకీర్ణ గణితమును తెలుగునందు గలవు. పావులూరి మల్లన తాను రాసిన గ్రంథములో తనకు ముందు గల కవులెవ్వరిని ప్రస్తుతించి యుండలేదు, దీనిని బట్టి ఈ కవి నన్నయభట్టు సమకాలీనుడయినట్లు కనబడుతున్నది.రాజరాజ నరేంద్రుడు తనకు పిఠాపురంనకు దగ్గరలో ఉన్న నవఖండవాడ అను గ్రామము ఇచ్చినట్లుగా చెప్పుకొని ఉన్నాడు అందుకు ఉదాహరణ ఈ క్రింది పద్యమున తెలియజేశాడు. ఉ. శ్రీ నిలయుండు శివ్వనను జిమ్మనను న్మరి సూర్యదేవునిన్ /ధీనిథి బోలయార్యునిని దేజమునన్ రవితుల్యు లైనయా/సూ‌నుల నల్వురం బడసె సూరిజన స్తుత సత్య భారతీ/జ్ఞానుల పద్మ గర్భు వదనంబులు నాలుగుబోల వారిలోన్// --- ఉ. శ్రీ లల నేను ఢాంధ్రన్రృప శేఖరుడై రాజరాజభూ/ పాలకు చేత బీఠపురి పార్స్వమునన్ నమఖండ వా డయన్/ప్రోలు విభూతితో బడసి భూరిజనస్తుత డైనా సత్కళా/ శీలుడ రాజపూజితుడ శివ్వన పుత్రుడు మల్లనాఖ్యుడన్// ఇందులో మొదటి పద్యమునప్పకవి తద్భవ వ్యాజ విశ్రమమునకు ఉదాహరణగా తీసికొని యున్నాడు. దీన్నిబట్టి ఇతడు లాక్షిణిక కవిగా తెలుసుకోవచ్చును రాజనరేంద్రుని కాలములోనే నన్నయ్యభట్టు గాక మరి కొందరు కవులు ఉండుట చేత లాక్షణిక కవులలో నన్నయ భట్టారకుడు మొదటివాడు కాదనే తెలియజేయునది. అతని కాలమునందు అంతకు పూర్వము కూడా తెలుగు కవులు ఉన్నారనియు వారట్టి కవిత్వం చెప్పుటకు కావలసిన లక్షణ గ్రంధములు ఉండేవనియు స్పష్టమగుచున్నవి. ఆ కాలమునందు అంతకు పూర్వము కూడా తెలుగు కవులు తమ గ్రంథములలో మొట్టమొదట దేవతా స్తుతి ఒక సంస్కృతములో శ్లోకములో రాసి తర్వాత తెలుగు పద్యములు ఆరంభించే ఆచారముగా ఉన్నట్లు కనబడుతున్నది. ఆ కాలమా గ్రంథములో కవి,క్రృతిపతిని స్తుతి చేయుట లేదు కృతినిచ్చే పద్యములు చెప్పుటలేదు‌ ఈ ఆచారము తిక్కన కాలము వరకు కొనసాగినది. తిక్కన తన నిర్వచనోత్తర రామాయణములో పూర్వుల పద్ధతిని అనుసరించాడు కానీ భారతములో నూతన మార్గమున అనుసరించి గ్రంథ ఆరంభంలో తెలుగు పద్యములు వ్రాయడంతో పాటు కవి స్తుతియు స్వప్న గాథయు షష్ఠ్యంత పద్యములు చేర్చినాడు.పిమ్మట కవులందరూ తిక్కన చూపిన ప్రభావం సాగి ఉన్నారు. పావులూరి గణితము నందు మొదట ఈ క్రింది శ్లోకమును తరువాత పద్యములు ఉన్నాయి. శ్లో: శ్రీకంఠ సగుణం సమస్త జగతాం కర్తార మీశం గురుం/భూతో యానాల చంద్ర సూర్య పవన నవ్యో మాత్మ మూర్తిన్ విభుమ్/నిత్యానందయోపయో గిరిజయా స్వార్థం ప్రజావ్రృద్ధయే/మాయాయోగ ముపైతి తం శివ కరం వందే శివం శ్రేయసే// *** . *** ‌ ***. **** క: ప్రణమిల్లి శివుని కీక్రియ/ నణిమాదిగుణస్పదునకు నాభిని సంఖ్యా/ మణి దీప్తిసారసంగ్రహ/గణిత సముద్రుడు దరియ గడగితి బ్రీతిన్// శా:అర్కాది గ్రహ పంచక గ్రహణ అన్వేషణో పాయమున్/దర్గా వ్యాకరణాగమాది బహు శాస్త్ర ప్రోక్తం పాపాల్ని సం/పార్కాదివ్యవహారమున్భు భువనరూప ద్వీపవిస్తారమున్/దర్కిన్పన్ గణిత ప్రవ్రృత్తివెలిగా దార్కుం డెరింగించుకునే? ఈ పద్యం ద్వారా శైలి చూపుటకు ఉదాహరణలు తప్ప కవిని గూర్చి వ్రాయుటకు తగినదేదియు కాదు.మల్లన్న వ్రాసిన ఈ క్రింది పద్యం వల్ల అప్పుడు జనం తర్క, వ్యాకరణ, గణిత, ఖగోళ, భూగోళ విషయాలలో ఆసక్తి కలిగి ఉండేవారని తెలుస్తున్నది. అర్కాది గ్రహ సంచర గ్రహణకాలాన్వేషణోపాయమున/ న్దర్కవ్యాకరణాగమాది బహుశాస్త్రప్రోక్త నానార్ధ సం/పర్కాది వ్వవహారమునన్ భువనరూపద్వీప విస్తారము/ న్దర్కింపగన్ గణిత ప్రవృత్తి వెలిగా దక్కొండెరింగించునే?//విజ్ఞాన శాస్త్ర పఠనానికి గణితం చాలా ముఖ్యమనే విషయం ఈ పద్యంలో తెలియజెప్పబడింది.ఈ పావులూరి మల్లన భద్రాద్రి రామ శతకమును కూడా రచించినట్లు చెప్పుదురు. తల్లిదండ్రులను పరిశీలింప చూడ మరొక మల్లన్న యేమో అనిపిస్తుంది. ఈ మల్లన్న తండ్రి పేరు శివ్వన్న రెండవ పావులూరి మల్లన్న తండ్రి పేరు రామన్న యని ఈ శతకంలోని ఈ క్రింది పద్యము నందు ఉన్నది. క: శ్రీ మహిత పావులూరి సు/ ధాముడు రామన్న మంత్రి తనయుడ గవిసు/ త్రాగుడు మల్ల నా శివుడ/ శ్రీ మద్భద్రాద్రి థామ శ్రీ రఘురామా// అందుచేత పావులూరి మల్లన రామ రామ శతకం రాశాడనుట సందేహ పడవలసి వస్తుంది.ఏది ఏమైనా పావులూరి మల్లన గణిత సార సంగ్రహ గ్రంథాన్ని తెలుగులో రాసి, విజ్ఞాన శాస్త్ర పఠనానికి గణిత శాస్త్ర ఆవశ్యకత ఎంతో ఉందని తెలియజెప్పి వినుతికెక్కాడు. -(ఇది 43వ భాగం)- బెహరా ఉమా మహేశ్వర రావు సెల్ నెంబర్:9290061336
June 29, 2020 • T. VEDANTA SURY • Serial