ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యం-కందుకూరి వీరేశలింగం- బెహరా ఉమామహేశ్వర రావు
August 22, 2020 • T. VEDANTA SURY • Serial

మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
నేను రాసిన "మొలక"పత్రిక వ్యాసాలలో ఇది నూరవ  వ్యాసం. ఇంతవరకు నిరాటంకంగా 
ప్రచురించిన " మొలక"దిన పత్రిక , సంపాదకులు టి.వేదాంత సూరి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
-------       -------.        ------.      -------.          -----      
 నేను, బెహరా ఉమామహేశ్వరరావు (జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత )
1978‌సం నుండి రచనా వ్యాసాంగం ప్రారంభించాను. వేయికి పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురింప బడినవి. కథలు, బాలల కథలు, బాల గేయాలు,బాల గేయ కథలు, పాటలు,  25 కి పైగా బాలల పుస్తక సంకలనాలు వెలు వడినవి. 50కి పైగా వ్యాసాలు వ్రాసినా అందులో అత్యధికం బాల సాహిత్య వ్యాసాలు. ఈ వ్యాసాలు 1980-90  మధ్యకాలంలో పలు దిన,వార, మాస పత్రికలలో  ప్రచురింప బడినాయి. నా మాటగా ఈ నాలుగు వాక్యాలు మీ ముందు ఉంచాను. నన్ను అభినందిస్తూ ప్రోత్సహించిన మిత్రులందరికీ  నా కృతజ్ఞతలు తెలుకుంటున్నాను.
***** ‌‌ ‌   ***** ‌‌   ***** ‌      *****    *****
     కందుకూరి వీరేశలింగం గారు సాంస్కృతిక సంస్కరణలతో పాటు, రచనా వ్యాసంగంలో కూడా ఎనలేని కృషి సల్పారు. సామాజిక సంస్కరణల కోసం తన జీవితమంతా అంకితం చేసిన మహా వ్యక్తి.,    తెలుగు సాహిత్యంలో ఈయన చెప్పుకోదగిన నూతన ప్రక్రియలు కూడా చేపట్టిన ఘనుడు.
           వీరేశలింగం గారు అనేక వ్యాసాలు, కథలు,     నాటకాలు, నాటికలు, పుంఖాను పుంఖాలుగా వ్రాశారు. దీని ఫలితమే ఈయన ముద్రణా యంత్రాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకోవలసిన పరిస్థితి వచ్చిం ది. ఈయన రాసిన మొదటి నవల "సత్యవతి".ఈ నవల ఇంగ్లీషులో, కన్నడంలోనికి
కూడా ఆనాడే అనువదించడం జరిగింది. ఈ నవలలో మూల వస్తువు స్త్రీ విద్య. స్త్రీలకు విద్య లేకుంటే కలిగే అనేక అనర్ధాలు ఇందులో పూసగుచ్చినట్లు చెప్పారు. తద్వారా ఆనాటి సమాజానికి కనువిప్పు కలిగించారు.వేశ్యా వృత్తి వల్ల జాతికి కలిగే కీడు గురించి విపులంగా వివరించారు. ఒక ప్రక్కఆచారాల పేరిట జరిగే అకృత్యాలను, తీవ్రంగా  విమర్శిస్తూ, విశ్లేషణ చేసారు. మరో ప్రక్క సున్నితమైన హాస్యంతో చక్కగా విపులీకరించి కళ్లకు కట్టారు.ఆనాటి మేధావుల మన్ననలందుకునే నవల ఇది.పురుషుల అహంకారం,  ఆథిపత్యం గురించి ఇందులో చక్కగా వ్యక్తీకరించారు.
వీరేశలింగం గారు నిర్వహించిన పత్రికలు:
   ఈయన 1876లో సొంత ఇంటిలో స్థాపించబడిన
 వివేకవర్ధని ముద్రణ శాలలోనే పలు పత్రికలు వెలువడినాయి. అందులో చెప్పుకో  దగినది   "వివేకవర్ధని"!  అనే పత్రిక.1874లో  ఈ పత్రికను స్థాపించారు.
1883లో స్త్రీల సమస్యలు సమాజానికి వివరంగ తెలియజేయాలని ప్రత్యేకంగా  "సతీ హిత బోధిని"
అనే మహిళా పత్రికను స్థాపించారు.,
కార్లీవియస్  (ఆంగ్ల పత్రిక)కూడా ప్రచురించారు.
కందుకూరి వారికి అనేక బిరుదములు గలవు.
వాటిలో ముఖ్యమైనవి 1. రావు బహదూర్ 2. గద్య తిక్కన 3. దక్షిణ దేశ విద్యా సాగరుడు.
ఇతడు 1874లో  అష్టావధానం ప్రక్రియ చేపట్టారు.
15 ఆగస్టు 1875 లో ఐకమత్యం అనే అంశంపై ఉపన్యాసమిచ్చి కీర్తి కెక్కారు.
"వ్యవహార ధర్మబోధిని" పిల్లల చేత వేయించిన ప్లీడరు నాటకము చెప్పుకో దగ్గది. "చమత్కార రత్నావళి"అనే నాటకం కూడా ప్రదర్శించారు.
వీరేశలింగం గారు అనేక సంస్థలు ఏర్పాటు చేశారు.
రాజమండ్రిలో సంఘ సంస్కార సమాజం, హితకారిణి సమాజం, పురమందిరం, స్థాపించారు.
తన సొంత ఇంటిలో  వితంతు గృహము, ప్రార్థనా సమాజం, స్త్రీ పునర్వివాహ సమాజం, నెలకొల్పారు.
మద్రాసులో వితంతు శరణాలయాన్ని స్థాపించారు.
ఈయన బాలలకు ఉపకరించు వాచక పుస్తకాలు
రచించి ముద్రించారు. బాలలకు అందజేశారు.
అలంకార సంగ్రహము, తర్క సంగ్రహము, స్మృతి,
శృతుల మీద వ్యాఖ్యానాలు,
కాళిదాస విరచితమైన సంస్కృత "అభిజ్ఞాన శాకుంతలము"ను తెలుగులోకి అనువదించారు.
ఇవిగాక చాలా రచనలు ఉన్నాయి.(100వ భాగము)సశేషం: -  బెహరా ఉమామహేశ్వరరావు, పార్వతీపురం.- సెల్ :9290061336