ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
September 26, 2020 • T. VEDANTA SURY • Serial

నన్నయ యుగం:-తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే పదకొండవ శతాబ్దంలో నన్నయ వ్రాసిన ఆదికావ్యం మహాభారతం తెలుగున అనువదించినట్లు స్పష్ట 
మవుతుంది. అందుకే ఈ యుగాన్ని నన్నయ యుగం అంటారు. నన్నయ్య ఎక్కువ కావ్యాలు రాసి అందరినీ ప్రభావితం చేశాడు.   తన అను యాయులతో పాటు తను వేసిన మార్గంలోనే, తన
 సాహిత్యాన్ని నడిపించాడు.  యుగకర్త నన్నయను,
ఆదికవి యని బిరుదు నివ్వడం జరిగింది.               తిక్కన యుగం :-13వ శతాబ్దికి తిక్కన యుగమని అంటారు.తిక్కన ఇంటి పేరు "కొట్టరువు"వారు. ఇతని తండ్రి పేరు కొమ్ననాథుడు. తాత గారి పేరు భాస్కరుడు. తిక్కన నెల్లూరు నివాసి.
నన్నయ్య, తన రచనలో సంస్కృత పదాలు ఎక్కువగా వినియోగిస్తే, తిక్కన తెలుగు పదాలు ఎక్కువగా వినియోగించి,తెలుగు భాష వైశిష్ట్యాన్ని చాటి చెప్పాడు.కవిత్వం తన జాతి కోసం రాస్తున్నానని తిక్కన చెప్పుకొచ్చాడు. "ఇతను కావించిన కవిత్వ సృష్టి ఇతరులకు చేత కాదు."అని తిక్కనను, ఎర్రన్న ప్రశంసించాడు.
నన్నయ పదకొండవ శతాబ్దం వాడు అయితే తిక్కన పదమూడవ శతాబ్దము వాడు.
వీరిద్దరి మధ్య కాలం అనగా పన్నెండవ శతాబ్దము, తెలుగు సాహిత్యంలో కొందరు శూన్యం అని పొరబడతారు.
కాని ఈ కాలం, శూన్యము ఎంతమాత్రం కాదు.
    పన్నెండవ శతాబ్దంలో కూడా సాహిత్యం వెలసింది.
ఈ కాలాన్ని శివకవి యుగం అంటాం. ముఖ్యంగా ముగ్గురు శివకవులు వల్ల ఈ యుగానికి శివకవి యుగం అని పేరు వచ్చింది. ఆ ముగ్గురు కవులు వరుసగా నన్నె చోడుడు, పాల్కురికి సోమనాథుడు,
మరియు మల్లికార్జున పండితారాధ్యుడు. శివ కవులలో ముఖ్యలు వీరే. అయితే శ్రీపతి పండితుడు మరియు యథావాక్కుల అన్నమయ్య వంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ కాలంలోని చాలామంది శివకవులు చరిత్రకెక్క లేక పోయారు.
దానికి కారణం, వీరు రాసిన తాళపత్ర గ్రంధాలు కాలగర్భంలో కలిసిపోవడము, మరికొందరు కవులకు ప్రచారం కూడా లేకపోయింది.శివ కవులలో మొదటివాడు నన్నెచోడుడు. ఈయన రాసిన గ్రంథం కుమారసంభవము. కవి రాజా శిఖామణి అని ఇతనికి బిరుదము కలదు. ఇతడు మొదటిసారిగా మార్గ దేశి కవితల ప్రస్తావన చేశాడు.నన్నెచోడుడు రాసిన కుమార సంభవానికి మూలం, కాళిదాసు రచన కుమారసంభవము.
    కుమార సంభవాన్ని నన్నెచోడుడు రాయలేదని వాదన కూడా ఉంది. ఈ వాదం కొర్లపాటి శ్రీరామ మూర్తి గారు చేశారు. దీనిని మానవల్లి రామకృష్ణ కవి
రాసాడని ఈయన అంటారు.
శివ కవులలో తదుపరి కవి పాల్కురికి సోమన.ఈయన బసవ పురాణము వృషాధిప శతకము, అనుభవసారం మొదలగు గ్రంథాలను రాశాడు.
  ఈయనను వీరశైవ కవిగా పేర్కొంటారు.
    పాల్కురికి సోమన తెలుగులోనే కాక కన్నడంలో కూడా సద్గురు రగడ, బసవ రగడ వంటి కావ్యాలు మరికొన్ని రాశాడు.
ఇతడు సంస్కృతంలో సోమనాథ భాష్యం, వృషభాష్ట కం. సంస్కృత బసవోదాహరణం, మొదలగునవి.
పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రము రాశాడు
      తరువాత శివ కవులలో పేర్కొనదగిన వాడు. పండితారాధ్యుడు. ఈయన రచనలు శివ తత్వ సారం. శ్రీగిరి శతకం. శివకవుల సమకాలికులలో
యథావాక్కుల అన్నమయ్య ఒకడు. ఈయన  అనేకం రాసినప్పటికీ, సర్వేశ్వర శతకం మాత్రమే లభ్యమవుతున్నది.
      ఈ కవులు శైవ మతాభిమానమే ధ్యేయంగా
కవిత్వం రాశారు. అందుకే వీరిని శివకవులని అన్నారు. ఈ యుగంలో తెలుగు భాషకి, దేశీ కవితకి
అత్యధిక ప్రాధాన్యథనిచ్చే రచనలు కావడం చేత, జనం నుండి మంచి ఆదరణ లభించింది. జనం కోసం కలం పట్టిన విలక్షణమైన కవులు వీరు. అందుకే పన్నెండవ శతాబ్దం వీరి పేరు మీదగా శివకవి యుగం అని పేరు వచ్చింది. అయితే వీరికి పరమత సహనం లేకపోవడం ఒక ఒక ముఖ్యమైన దోషం.(సశేషం)
  (104 వ భాగం)
    తెలుగు సాహిత్యం-శివ కవులు--  బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.