ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యమున ప్రసిద్ధి చెందిన కవులలో వేములవాడ భీమకవి ఒకరు. ఈయన యొక్క నివాస స్థానము గోదావరి మండలంలోని దాక్షారామమునకు సమీపమున వేములవాడ గ్రామంగా చెబుతారు. మరో గాథ కూడా ఉన్నది. భీమకవి నివాసము నిజాం రాష్ట్రంలోని వేములవాడని మరి కొందరి అభిప్రాయం. ఇతని జన్మ గురించి ఒక విచిత్రమైన కథ ఉన్నది. వేములవాడ గ్రామమునందు సోమన అనే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. ఇతడు కడు పేదవాడు. అతని మరణానంతరం భార్య నిరుపేదరాలైనందున, విద్యావతి యగుటచే ధనికుల ఇండ్లలో పిల్లలకు పాటలను, పద్యములను బోధించి జీవనము సాగించెను. ఆమె శివరాత్రి పుణ్య కాలమునందు తన ఊరి మహిళలతో కలసి దాక్షారామము యాత్రకు పోయెను. తోటి స్త్రీలంతా తమకు సంతానము ప్రసాదించమని ఆ దేవుని ప్రార్థన చేసారు. ఈమె తనకు ఇక సంతానం కలగదని నమ్మకము కాలేదు. అయినను ఆమె తనకు పుత్ర సంతానము కలిగినచో స్వామికి పుట్టెడు నీటితో దీపారాధనము చేయించెదనని మ్రొక్కుకొనెను.ఆమె మాటలకు అచ్చట ఉన్న స్త్రీలందరూ వెటకారంగా నవ్వారు.ఆమె ఇల్లు చేరింది తర్వాత కొంతకాలమునకు దైవము ఆమె కోరికను సఫలము చేసెనాయన్నట్లుఆ వితంతువునకు ఇట్లు గర్భము నిలిచెను. తాను భక్తితో మొక్కుకున్న ఆ స్వామియే గర్భము కలిగించెనని ఆమె చెప్పెను. ఆ ఊరి వారంతా ఆమెను జాతి నుండి బహిష్కరించారు. తమ ఇండ్లకు రానీయకుండా అరి కట్టారు.ఆమెకు అటు పిమ్మట పురుష శిశువు జన్మించాడు. ఆ శిశువును ప్రేమగా పెంచి, స్వామి వారి పేరు పెట్టింది. ఈ భీమన్న తాను తోటి పిల్లలతో ఆడుకుంటు న్నప్పుడు, వారందరూ ఆ బాలుని "విధవ కొడుకా" అనే పిలిచి పరిహాసము చేయసాగిరి. జ్ఞానము వచ్చిన వాడగుటచే, తల్లి దగ్గరకు పోయి భీమన్న తన బాధనంతా వెలిబుచ్చాడు. తల్లి వలన తన జన్మవృత్తాంతము తెలుసుకొని వెంటనే ఆ గ్రామము విడిచి పోయి, ద్రాక్షారామము చేరి భీమాలయంలో స్వామిని కౌగలించుకుని వదలక కూర్చుండెనట, అప్పుడు స్వామికి ఆ బాలునిపై అనుగ్రహం కలిగి "నీవు ఆడినదంతయు ఆటయు, పాడినదంతయు పాట యగును"అని వరమిచ్చి పంపెనట.ఆ బాలుడు మరల స్వగ్రామమునకు వచ్చిన తర్వాత ఒక ఇంట బ్రాహ్మణ సమారాధనము జరుగుచుండగా, అచ్చటకు వెళ్ళెను. బ్రాహ్మణులు ఎవరూ ఆ బాలుని లోనికి రానీయలేదు, తలుపులు లోపల గడియ వేసినారట. అంతట వడ్డనలు పూర్తి అయి, భోజనములు ప్రారంభము కాగా భీమన్న కిటికీ నుండి చూచి ,"మీ పప్పలు కప్పలుగాను, మీ అన్నము సున్నము గాను మారును గాక!" అని శపించెనట. ఆ శాపాక్షరములు సత్యమయ్యెనట! విస్తర్లలో అన్నము సున్నం ఆయెను, అప్పములు కప్పలై దుముకు లాడసాగెనట! అప్పుడు బ్రాహ్మణలందరూ తలుపులు తీసి ఆ బాలుని లోనికి రానిచ్చిరి.ఆ బ్రాహ్మణులంతా "సున్నము అన్నముగా మారిన, కప్పలు అప్పములుగా మారిన నిన్ను పంక్తి భోజనమునకు రానివ్వగలము," అని చెప్పారు.అంతా యధా ప్రకారంగా మారిందట, ఆ బాలుని బ్రాహ్మణులు భోజనమునకు కూర్చో పెట్టుకున్నారు. నాటినుండి అతనినే వరప్రసాదిగా తలచారు. అతనికి ఉపనయనాది సంస్కారములు చేయించారు. బహిష్కరణము ఎత్తివేశారు. అతనిని పంక్తి భోజనములకు ఆహ్వానిస్తూ గౌరవింప సాగారు. భీమకవి సంస్కృతమున రచించినట్లు చెప్పబడుతున్న జ్యోతిష్య గ్రంథమును తెనిగించిన ఒకానొక దానిలో ఇంచుమించుగా ఈ కథను తన గ్రంథంలో పద్య రూపంలో చెప్పియున్నాడు.(ఇంకా ఉంది)-బెహరా ఉమామహేశ్వరరావుసెల్ నెంబరు: 9290061336
June 26, 2020 • T. VEDANTA SURY • News