ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యములో తంజావూరు రాజుల సాహిత్య సేవ యెన్నదగినది. రఘునాథ నాయకుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తర్వాత విజయ రాఘవుడు గొప్ప కవి. ఈయన రాసిన విప్రనారాయణ చరిత్ర రఘునాధ నాయకుడు రాసిన దానికి విభిన్నంగా ఉంటుంది. రఘునాథ నాయకుడు వ్రాసిన విప్రనారాయణ చరిత్రలో విప్రనారాయణుడి ఆలయంలో జరిగిన దొంగతనానికి బాధ్యుడ వుతాడు. అతడు అపరాధియని చోళరాజు శిక్షించమంటాడు. కాని విజయ రాఘవుడు వైష్ణవ మత అభిమాని. అందుచే విప్రనారాయణ అపరాధి కాదని, ఆలయంలో రాజగోపాలస్వామి దేవుడే ప్రత్యక్షమై సత్యం చెప్పినట్లు, ఈయన వ్రాసాడు.("విప్రనారాయణ" కథ 1954లో సినిమాగా వచ్చింది. విప్రనారాయణ కావ్యానికి ఆధారమైన ఈ కథ మూలకథను పోలి ఉండుట ఒక విశేషము. విప్రనారాయణుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. నాయిక దేవదేవి పాత్రను భానుమతి గారు నటించారు. ఈ చిత్రం అద్భుతమైన కావ్యరాజము. ఇందులో ఎస్.రాజేశ్వరరావు గారు వీనుల విందుగా సంగీతం అందించారు.భానుమతి గారు మరియు ఏ.ఎం.రాజా గారు మధురమైన పాటలు పాడారు. ఈ చిత్రం ఆద్యంతం వైష్ణవ సాంప్రదాయానికి నిలువుటద్దం. ఈ కావ్యం వైజయంతీ విలాసము అను పేరున సారంగం తమ్మయ్య గారు రచించినదానికి ఆధారం. నేటి యువ సాహితీవేత్తలు ఆద్యంతం చూడదగినదీ చిత్రం.కాని కాస్త ఓపిక అవసరం. ప్రతి ఒక్కరు చూసి తెలుసుకో దగిన చిత్ర కావ్యం.) విజయ రాఘవుని రచనలలో యక్షగానాలు ప్రసిద్దమైనవి. ఈ యక్షగానాలలో ప్రత్యేక తరహా సంగీత రూపక రచనలు సాగించారు. దీనిని కేవలం గీతాల వలె కాక పాత్రోచితమైన సంభాషణలతో వ్రాయడం విశేషం. విజయ రాఘవ నాయకుని కొలువులో విదుషీమణులలో రంగాజమ్మ అగ్రగణ్యురాలు. ఈమె అష్టభాషా కవితా సర్వం, "కృషి మనీషా విశేష శారద", "రాజనీతి విద్యా విశారద" పురస్కార గ్రహీత. ఈమె సంగ్రహ భారతం, సంగ్రహ భాగవతం, సంగ్రహ రామాయభము, ఉషా పరిణయం, మన్నారుదాస విలాసము, మన్నారుదాస విలాస యక్షగానము అను ఆరు గ్రంథములు రచించింది. ఇందు మొదటి ఐదు ప్రబంధములు, చివరిది యక్షగానము. ఇవి కాక ఈమె రచించిన పాటలు, పదములు అనేకము ఉన్నవి. మన్నారుదాస విలాస ప్రబంధమున నాయకుడు విజయరాఘవుడే, అందుకే ఇతనికి మన్నారు-దాసుడను నామాంతరము ఉన్నది. ఈమె రాసిన ఉషా పరిణయము నందలి కథ హరివంశము నుండి గ్రహింపబడినది. దీనిలో కథా నిర్మాణము నందును, కవితా పఠనమునందును కవయిత్రి చాలా ప్రతిభ చూపించి నేర్పు ప్రదర్శించినది. ఈమెకు రాజసభలో కనకాభిషేకము కూడా జరిగినది.రంగాజమ్మ మన్నారుదాస విలాస ప్రబంధం నందలి కథను గ్రహించి, ఆ పేరు తోడనే ఒక యక్షగానము కూడా రచించినది. రాజగోపాలస్వామిబ్రహ్మోత్సవముల సందర్భంలో కాంతిమతి అను కన్య విజయ రాఘవుని చూసి కామించి, అతనిని పెండ్లి యాడడం ఇందలి కథా వస్తువు. ఈ కథ విజయ రాఘవుడు రాసిన రాఘవాభ్యుదయ మందలి కథకు ఇంచుమించుగా ప్రతిరూపము. కథా చమత్కారము అంతగా లేకపోయినప్పటికీ ఈ కాలములో వెలసిన యక్షగానములలో ఇది మిక్కిలి ప్రశస్తమైనది. ఇందు పాటలు, పదములు, దరువులు వాటితోపాటు పద్య రత్నాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. రంగాజమ్మ తన మన్నారుదాస ప్రబంధం అందలి పద్యములు సందర్భానుసారంగా చొప్పించినదని పండితుల అభిప్రాయము. ఈమె రచనా చాతుర్యమునకు నిదర్శనం. సంభాషణలు హాస్యరస చమత్కారముల తోడను, పాత్రోచితమైన భాష తోడను మిక్కిలి సహజముగా నుండి రక్తికట్టించును. కోనేటి దీక్షితులు అను వైష్ణవ పండితుడు ఉండేవాడు. అతడు విజయ రాఘవుని కొలువున ఉంటూ రామాయణం ఉపదేశించాడని మరియు అనేక సత్కారములు పొందాడని ప్రతీతి. ఇతడు విజయరాఘవుడు, మదన మంజరిని వివాహమాడిన వృత్తాంతమును తీసుకొని విజయరాఘవ కళ్యాణమను యక్షగానం రచించాడు.విజయ రాఘవుని ఆస్థాన కవియగు కామరసు వేంకటపతి సోమయాజి విజయరాఘవ చంద్రికా విలాసము రచించాడు. విజయ రాఘవ చంద్రిక విహారమందు మనోహరముగా వర్ణించడం జరిగింది.పురుషోత్తమ దీక్షితుడను మరొక కవి, "సత్ర మరల్"అను నామాంతరము గల తంజాపురాన్న దాన మహా నాటకమును రచించాడు. ఇది శృంగార హాస్య రస అద్భుత కావ్యమని తెలియుచున్నది.(సశేషం) ( ఇది 73వ భాగం ) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
July 26, 2020 • T. VEDANTA SURY • Serial