ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యములో దక్షిణాంధ్ర యుగము పేర్కొనదగినది. ఈ కాలంలో అనేక గ్రంధములు వెలసి తెలుగు సాహిత్యాన్ని సుసంప న్నం చేశాయి. ఈ యుగంలో కవులు కూడా ప్రతిభా సంపన్నులే, వీరు అనేక సాహిత్య ప్రక్రియలకు ఆద్యులయ్యారు.ఈ కాలమున వ్రాయబడిన చారిత్రిక వచన కావ్యములలో "రాయవాచకము" ఎన్నదగినది.ఈ గ్రంథములో "కృష్ణరాయ చరిత్రము" వ్యవహారిక భాషలో చెప్పుకోదగిన గ్రంథము. దీనిని విశ్వనాధ నాయకుని ఆస్థానంలో ఉంటూ అజ్ఞాత నామము గల రచయిత వ్రాసి యుండెనంటారు. ఈ గ్రంథములో అజ్ఞాత రచయిత విన్నపము కూడా ఉన్నది. " సుజనులచే విన్న సూనృత వాక్యములను రచించాను" అని గ్రంధకర్త చెప్పుకోవడం‌ జరిగింది. ఇందులో పేర్కొన బడిన వివరాలను సేకరించి, విశ్వనాథనాయకుడు మధుర స్థాపకుడుకాడని తెలియు చున్నది. క్రీ.శ.1590-1610 వరకు పాలించిన రెండవ కృష్ణప్ప తమ్ముడనియు సాహిత్య విమర్శకుల అభిప్రాయం. కృష్ణ రాయల కాలమున అధికార వర్గమునందు వాడుకలో ఉన్న భాషయే ఈ గ్రంధము నందు ఉపయోగించబడినది. పార్సీ భాషయందలి రాజకీయ, ఆర్థికర, పారిభాషిక పదములు అనేకము ఇందులో చేరి పోయినవి. వాక్యములు దీర్ఘంగా కనబడును. వాక్య ప్రయోగములు కూడా పాత పద్ధతిలో ఉండుట చేత అక్కడక్కడ కొంత అర్థం కాక పోవుట కొంత వరకు నిజమే, కానీ ఇక్కడ వినియోగించిన భాషలో పనికి రాని పదములు గాని ఆడంబర, అనవసర పదజాలము గాని కానరావు‌. భాష సరళమై యుండి వినియోగ మున శక్తివంతమైనదిగా కనబడు తుంది.రాయవాచకము వంటి మరొక వచనగ్రంథము కలదు, దానిని ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ముద్రించి యున్నారు. ఈ గ్రంథము లోని భాష, రాయవాచకము లోని భాషలో ఒకే విధమైన ప్రయోగములున్నవి. కానీ ఇందు వివరింపబడిన విషయములు సందేహం తో కూడి ఉన్నవి.ఈ గ్రంథ కర్త కూడ యెవరో తెలియుట లేదు. చొక్కనాధుని భార్య అయిన రాణి మంగమ్మ మనుమడగు, విజయ రంగ చొక్కనాధుని పక్షమున మధుర రాజ్యమును క్రీ.శ.1689-1708 వరకు పాలించియుండెను. ఆమె శృంగార క్రీడలను వర్ణించు అసభ్య పదములతో కూడిన మరొక రచన గ్రంథము గోచరిస్తున్నది. ఆ గ్రంధము పేరు "మధుర మంగాపుంశ్చలీ విలాసము". దీనిని రచించిన కవి ఎవరో తెలియుట లేదు. అతడు ఏ కారణం చేతనో రాణి కోపమునకు గురి అయి, అక్కడ అక్కడ తిరుగుతూ ఆమెపై కోపము తీర్చుకొనుటకు అసభ్య పదజాలంతో నింపి ఈ గ్రంథం వ్రాసి ఉండవచ్చునని విమర్శకుల భావన.ఈ గ్రంథములో ఆనాటి దేశ కాలమాన పరిస్థితులు వివరింపబడడం చేత దీనిని చరిత్రకారులు ఉపయోగించు చున్నారు. ఇందలి భాష రాయవాచకము నందలి భాషనే పోలియున్నది. ఈ గ్రంథమును పరిశీలింపగా ద్విపద వాక్యములు కూడా కనబడుచున్నవి.రాయవాచకము వంటిదే మరో గ్రంథము కనబడుచున్నది. "తంజావూరు ఆంధ్ర రాజుల చరిత్ర"అను వచన గ్రంథము మరొకటి కలదు. దీని గ్రంథకర్త కూడా ఎవరో తెలియ కున్నది. కడకు పరిశోధకులు అజ్ఞాత రచయితగా పరిగణింపక తప్పలేదు. తంజావూరు రాజ్యమును ఆక్రమించి పరిపాలించు టకు, మధుర నాయకులకు సర్వాధికారములు ఉన్నవని నిరూపింప ప్రయత్నించడం జరిగింది. అందుచేత ఈ గ్రంథ రచయిత మధుర నాయకులకు ఆశ్రితుడై ఉండవచ్చుననే ఆలోచన కలుగుచున్నది.ఇందలి ముఖ్యాంశం రాయలపై తిరగబడిన నాగమ నాయకుడిని, తన తండ్రి అని ఆలోచింపక విశ్వనాధ నాయకుడు బంధించి తెచ్చాడు. ఈ సంఘర్షణలో రాయలు విశ్వనాధ నాయకుని రాజభక్తి మెచ్చుకొని చోళ, పాండ్య రాజ్యమును ఇచ్చినట్లు తెలియు చున్నది. తరువాత కాలంలో అచ్యుతరాయలు,విశ్వనాధ నాయకుని ఏలుబడిలో ఉన్న చోళ రాజ్యమును తిరిగి తీసుకున్నాడు. తన మరదలు అయిన మూర్తమాంబను, చెవ్వప్పకిచ్చి వివాహము జరిపించాడు. వీరికి రాజ్యం ఇచ్చినట్లు ఈ గ్రంథంలో వ్రాయబడి ఉంది.మరో చారిత్రక గ్రంథము పరిశీలింపగా ఇందులో చెంగమలదాసు మనుమడు విజయమ్మ నారప్ప నాయుడు తన సోదరిని విజయ రంగ విశ్వనాధుని(1706-1732) కిచ్చి పెండ్లి చేసిన వృత్తాంతం వ్రాయబడి ఉంది. ఈ చారిత్రక గ్రంథ రచయిత కూడా అజ్ఞాత కవియని తెలియుచున్నది. దీని ననుసరించి 18వ శతాబ్దంలో వ్రాయబడినట్లు సాహిత్య విమర్శకులు విశ్లేషిస్తున్నారు. ఈ గ్రంథము లోని శైలి ప్రత్యేకత సంతరించుకున్నది. ప్రాంతీయ పదములు ఉపయోగించి చిన్న చిన్న వాక్యములలో స్పష్టమైన భాషలో రచన సాగింది. ఇందులో అన్య భాషల పదములు ఏవీ వినియోగించ లేదు. అదే ఈ గ్రంథము ప్రత్యేకత. (సశేషం) (ఇది 79వ భాగం) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 1, 2020 • T. VEDANTA SURY • Serial