ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్యములో వేములవాడ భీమకవి: --జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఆధారం అతను చెప్పుకున్న కథయే. భీమ కవి రాసిన సంస్కృత జ్యోతిష్య గ్రంధము, తెనిగించిన గ్రంథావతారిక యందు సీసమాలిక లో చెప్పియున్నాడు.సీ.: శ్రీకరంబై ధర జెలువు గాంచినయట్టి; భీమ పురంబున ప్రేమమీర/ భీమేశ్వరుండును బ్రియముతో భక్తుల; కోర్కు లొసంగుచు గొమరు మిగుల/నొకనాడు తత్పురియువతులు కొందరు; భక్తి భీమేశ్వరు భవనమునకు/ బోయి పుత్రుల వేడ ముగ్థత్వమున నొక్క విధవ కుమారుని వేడ్క గోర// తే.గీ: ఇతడు చెప్పిన శాస్త్రమం దధికభక్తి/ కలిగి నిజమని తలచిన గల్గు శుభము/ కోర్కు లెల్లను ఫలియించు గురుతర ముగ/ సకల జనులకు దప్పదు జగతిలోన// నాటి నుండి ఇతడు కవిత్వము చెప్పుకొనియే జీవనం సాగించుచుండెను. తిట్టు కవిత్వము నందీతడు ప్రసిద్ధుడు. అందుచేతనే ఇతనిని ఉద్దండ కవి అనియు కవి రాక్షసుడనియు జనం వాడుకలో ఇట్లు వచ్చెననిపించు చున్నవి. ఇతడు కాక కవి రాక్షసుడనువాడు వేరొకడు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఇతడురాజ్యసభలకు పోయినప్పుడు, తాను దాక్షారామ భీమేశ్వరుని పుత్రుడనని చెప్పుకొనుచు వచ్చునట్లు తెలియుచున్నది.భీమకవి క్రృతులని చెప్పుటకు సరి అయిన కావ్యములు లభించుట లేదు. ఈయన రాసిన వాటిలో రామ గోపాల చరిత్రమనే ద్వర్థి కావ్యం ఉంది.కానీ ఈ కావ్యం మరొక కవి క్రృతిగా లభ్యమవుతుంది. అలాగే కస్తూరి రంగ కవి ఆనందంరంగట్ఛందంలో హర విలాసం భీమ కృతి అన్నాడు. కానీ ఇదీ వేములవాడ భీమ కవి క్రృతం అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఏవిధంగా చూసినా వేములవాడ భీమకవి వ్రాసినవని చెప్పుకునే కావ్యాలకు తగినన్ని ఆధారాలు నేడు కనబడడం లేవనే చెబుతున్నారు విమర్శకులు. మ: ఘనుడన్ వేములవాడ వంశజుడ దాక్షారామ భీమేశనం/ధనుడన్ దివ్య విషామృత ప్రకటనానా కావ్య ధుర్యుండ మీ/మన నాపేరు వినంగా జెప్పితి దెలుంగాధీశ కస్తూరికా / ఘన సారది సుగంధ వస్తువులు వేగం దెచ్చి లాలింపురా// ఈ పద్యంతో పాటు మరి కొన్ని పద్యాలు కూడా వేములవాడ భీమకవి ఘనతను చాటే పద్యాలు అనేకం కనిపిస్తుంటాయి. భీమకవి నన్నయ కాలానికి చెందినవాడని, కాదు తరువాతి కాలంవాడని అభిప్రాయాలున్నాయి.శ్రీనాధుడు, పింగళి సూరన, అప్పకవి తమ కవితలలో భీమకవిని ప్రస్తావించారు. కాశీఖండం ఆరంభంలో శ్రీనాధుడు తన కవితా శైలి విశేషాలను చెప్పుకొంటూ వచియింతు వేములవాడ భీమన భంగి నుద్ధండ లీల నొక్కొక్క మాటు భాషింతు నన్నయ మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు.... అంటూ ముందుగా వేములవాడ భీమ కవిని, తరువాత నన్నయను, ఆపై తిక్కనను, ఎఱ్ఱనను పేర్కొన్నాడు. అందువలన భీమకవి నన్నయ సమకాలికుడనే అభిప్రాయం ఉంది. అప్పకవి తన అప్పకవీయంలో ఒక కథ చెప్పాడు భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి నట్టి రాఘవ పాండవీయంబు నడఁచె ఛందమునడంప నీ ఫక్కి సంగ్రహించె ననుచు భీమన మ్రుచ్చిలి నడఁచె దాని ఆదిని భీమకవీంద్రుడు గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున, నా మీఁదట రాజనరేంద్ర క్ష్మాదయితుని పట్టి దాని మహి వెలయించెన్m భీమకవి తాను రచించిన "రాఘవ పాండవీయము"ను నన్నయకు చూపాడు. దాని ముందు తన భారతం నిలువదని అసూయతో నన్నయ ఆ భీమకవి గ్రంధాన్ని నాశనం చేశాడట. అందుకు కోపించి నన్నయ రచించిన "ఆంధ్ర శబ్ద చింతామణి"ని భీమకవి గోదావరిలో కలిపేశాడట. - ఈ కథ కల్పితమనీ, నన్నయకూ భీమకవికీ కూడా అన్యాయం చేస్తున్నదనీ సాహితీకారులు అభిప్రాయపడ్డారు. ఆంధ్ర శబ్ద చింతామణిని నన్నయకు అంటగట్టి ఆయనకు లేని కీర్తిని సంపాదించి పెట్టదలచిన అప్పకవి ఈ పాపపు వృత్తాంతమును కూడ అతనికి అంటగట్టి లేని దుష్కీర్తిని సంపాదించి పెట్టెను. 125 సంవత్సరాల తరువాత పింగళి సూరన, రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యాన్ని వ్రాశాడు. అతను కూడా కూడా ఈ లోక వదంతిని గౌరవిస్తూ భీమకవి వ్రాసిన రాఘవ పాండవీయం ఎలాగుండేదో తెలియదని, బహుశా అది ద్వ్యర్ధ్యాకృతినుండెనని తానూహిస్తున్నానని చెప్పుకొన్నాడు. తెలుగు సాహిత్యాకాశంలో నిత్యం వెలిగే తారకలలో వేములవాడ భీమకవి ఒకరు. (ఇది 41వ భాగం) -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్: 9290061336
June 27, 2020 • T. VEDANTA SURY • Serial