ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తెలుగు సాహిత్య ఆధునిక యుగంలో యుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం. ఆయన బాల్యం గురించి తెలుసుకుంటే, నాటి ఆంధ్రుల జీవన పరిస్థితులు తెలుస్తుంటాయి. 1857 వ సంవత్సరము ఐదవ తరగతి ప్రవేశపరీక్షలో ఉండగా తండ్రి జబ్బు పడి మరణిం చారు. పాఠశాలకూ వెళ్లే అవకాశం లేకపోయింది. బంధువులు ఉద్యోగంలో చేరమని చెప్పడమే కాక తల్లి చేత కూడా చెప్పించారు. ఆ మాటలకు ఆయనకు మనసులో చాలా బాధ కలిగింది.వీరేశలింగం గారికి బహుమతి ఇచ్చిన మారిన్ దొరగారి వద్దకు అప్పుడప్పుడు వెళ్లేవాడు . తన ఇబ్బందులు అతనికి చెప్పుకొనే వాడు. పెద తండ్రి చనిపోయిన వార్త విని ఉద్యోగము ఇప్పించగలనని ఊరడించాడు. ఇంత చిన్న వయసులో నీకు ఉద్యోగం ఎందుకు? పెద్ద చదువులు చదివి రమ్మని అందరూ అంటుండే వారు.వీరేశలింగం శాంత స్వభావుడే. మంచి ప్రవర్తన కలవాడు. ఒక కార్యం తలపెడితే అది పూర్తి కాకుండా నిద్రపోయేవాడు కాదు.ఇతనికి 13 ఏండ్ల వయస్సులో పెళ్లి జరిగింది.తొమ్మిది ఏళ్ళ వయసు గల బాపమ్మ అనే పిల్లతో ఘనంగా పెళ్లి జరిగింది. ఇతడు చిన్నవాడు గనక ఈయన వివాహం ఈయన చేతుల్లో లేకుండాపయింది! బాల్యవివాహాలను ఖండించే వీరేశలింగంగారికి బాల్య వివాహము తప్పలేదు. ఈ వివాహము తరువాత ఇతడు బాల్యవివాహాలను రూపు మాపడానికి కంకణం కట్టుకున్నాడు.వీరేశలింగం వివాహం 1861 లో జరిగింది. ఈ వివాహానికి వచ్చిన వారంతా ఈడు జోడు బాగుందని అన్నారు. ఈ పెళ్లిలో రుక్మిణి కళ్యాణం పద్యాలు వధూవరులచే చదివించారు. పెళ్లి కొడుకు ఒక పద్యం చదివితే పెళ్లికూతురుచే మరొక పద్యం చదివించారు.ఈ విధంగా పెళ్లి ఘట్టం ఆనందంగా సాగింది. పెళ్లికి వచ్చిన వారంతా జంటను ఆశీర్వదించారు. వీరేశలింగం పెద తండ్రి వెంకటరత్నం ద్వితీయ వివాహం చేసుకోవలసి వచ్చింది. ఇంట్లో స్పర్ధలు రావడంతో వీరేశలింగం వేరింటి కాపురం పెట్టు కోవాల్సి వచ్చింది. అయినా పెదతండ్రి వెంకట రత్నం గారు చాటుమాటుగా వీరేశలింగం కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తుండేవారు.వీరేశలింగానికి బాల్యం నుండి కూడా తానొక గొప్ప కవి కావాలనే కోరిక ఉండేది. యువకుడైన ఇతనికి విగ్రహారాధన అంటే ఇష్టమే. కవిత్వం కూడా చెప్పనారంభించాడు. భక్తునికి నీతి నిజాయితీలు ఉండాలని ఈయన ఏకాదశి నాడు గోపాల స్వామి ఆలయానికి వెళ్ళేవాడు. భజన గీతాలు కూడా పాడే వాడు. ఇతడు మొదట్లో గోపాల స్వామి మీద మరియు మార్కండేయ స్వామి మీద రెండు శతకాలు రచించాడు. శివకేశవులిద్దరు ఒకటే అను భావన ఈయనలో ఉండేది. తనికి మంత్రాల మీద గొప్ప విశ్వాసం. అంతేకాదు మంత్రాల వల్ల దెయ్యాలు పారి పోతాయని నమ్మకం. దెయ్యాలు పట్టే ఇండ్లకు వెళ్లేవాడు. మంత్రగాళ్లు చేసే నిర్వాకం చూసేవాడు. తనకు దెయ్యాలను చూపించమని మంత్రగాళ్ళ దగ్గర నడిగేవాడు. "నీవు దెయ్యాన్ని చూస్తే నీవు జడుసుకుంటవు." మంత్రగాళ్ళు సమాధానం ఇచ్చేవారు. "నేను జడుసుకోను! భయపడను! చూపించండి" అని వీరేశలింగం గారు చెప్పేవారు.కానీ మంత్రగాళ్ళు మాటల మార్చి ఎలాగో ఒకలా తప్పించుకునే వారు. అది మొదలు మనసు మార్చుకుని మూఢనమ్మకాలని విడిచి పెట్టాడు.తరువాత కేశవ చంద్ర సేన్ గారి ఉపన్యాసాలు చదివాడు. అంతవరకు తాను విశ్వసించిన విషయాలు నిజం కాదనే సందేహం కలిగింది.తర్వాత బ్రహ్మ సమాజం మతం తో ప్రవేశం గల దాత్మూరి లక్ష్మీ నరసింహం గారితో తరచు చర్చలు, వీరేశలింగం గారు కూడా బ్రహ్మసమాజ మత సిద్ధాంతాల వైపు మొగ్గు చూపడానికి కారణం అయ్యాయి.1869లో వ్యాధి వచ్చి, రాయడానికి గాని, ఏ పని చేయడానికి గాని వీలుపడలేదు. ఇంటిపట్టునే ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. ఆ సమయంలో చాలా గ్రంథాలు చదివాడు. తాను కూడా గ్రంథాలను రచించాలని అనుకున్నాడు. అచ్చ తెలుగు కావ్యాలు ఒకరిద్దరి కవులే రచించారని అర్థం అయింది. "నిరోష్ట్య కావ్యము" ఒక కవియే రచించారని తెలుసుకున్నాడు. ఇక సామాన్య కవుల దారిన సాగక, నూతన మార్గలననుసరించాలని సంకల్పించాడు. "శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధం" అనే నల చరిత్రం వ్రాసాడు. వీరేశలింగంగారు "రసికజనమనోరంజనం" అనే మిశ్రమ ప్రబంధాన్ని కూడా రాయనారంభించాడు. ఆ తరువాత రాజమండ్రి మండల పాఠశాలకు ప్రధానోపాధ్యాయులైన బోరో దొరగారికి, కారాగృహ అధికారి అయిన కెప్టెన్ హాల్లెట్ దొరగారికి తెలుగు చెప్పే పనికి కుదిరాడు. నెలకు ముప్పై ఐదు రూపాయల జీతానికి కుదిరాడు. దొరగారు ప్రచురిస్తున్న 'విద్య ప్రబోధిని' అనే మాస పత్రికను తెలుగు లో వ్రాసే వాడు. అతని "శుద్ధాంధ్ర నిర్థోష్ఠ్యనిర్వచనం నైషధం", ఆ పత్రికలోనే కొంత భాగం ప్రచురితమైంది. పాఠశాలలో చదవకుండానే 1870సంవత్సరపు సర్వ కళాశాల ప్రవేశ పరీక్షకు పోయి ఉత్తీర్ణుడయ్యాడు. ( ఇది 89వ భాగం ) - ఇంకా ఉంది - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336
August 11, 2020 • T. VEDANTA SURY • Serial