ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
తొలి రచయితలకు అభివాదాలు--పదో తరగతిలో అనుకుంటాను. ఆంధ్ర భూమి వార పత్రికలో కలం స్నేహం ఫీచర్ లో నా వివరాలు అచ్చవడం జీవితంలో మరపురాని అనుభవం.మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ శీర్షికలో అచ్చుకావాలంటే మన అభిరుచులు రెండు మూడు రాయాలి. అభిరుచి అంటే ఏమిటో కూడా తెలియని రోజులవి.కలం స్నేహం, పత్రికా పటన, ప్రకృతి ఆరాధన, సంగీతం వినడం, ఫోటోగ్రఫీ... వీటిలోంచి రెండు మూడు ఎంచుకుని అందరూ రాసేవారు. నేను కలం స్నేహం, పత్రికా పటనం అని రాశాను. ఫోటోగ్రఫీ ఎట్లాగూ ఇంట్లో న్నదే కనుక అది రాయలేదు. ప్రకృతి ఆరాధన అంటే రాయాలంటే మటుకు భయమేసేది. ఎందుకంటే అప్పడు మా వూరు దాటి మా అమ్మగారి వూరు మానకొండూరు, మా తాత గారు ఉండే పెద్దపెల్లి, చిన్న కల్వల వంటివి తప్పా పెద్దగా తిరిగింది లేదు. ప్రకృతి ఆరాధన అంటే దూరంగా వెళ్ళాలి కదా అనుకునేవాడిని.మా ఊరి మంగలయ్య కాలువా, అందలి చిరు చేపలు, ఇంటి వెనకాల నుంచి కనిపించే దర్శాల గుట్టా...దసరాకు జంబి కోసం వెళ్లి పాలపిట్టను చూడటం, ఇవే ప్రకృతి ఆరాధనకు నాటి ఆనవాళ్ళు కాబోలు. సిగ్గవుతది గని, దసరా బతుకమ్మ పండుగలప్పుడు ఓణీలలో కనిపించే మా క్లాస్ మేట్స్ ఐన అమ్మాయిలను చూడటం అప్పట్లో చెప్పుకోదగ్గ సంబుర విశేషం.సంగీతం వినడం అన్నది తెలియదు. బహుశా రేడియో వినడమే అనుకునే రోజులు. సొంతగా వినదానికి చిన్న ట్రాన్సిస్టర్ లేదు అనుక అదీ అభిరుచుల్లో రాయనేలేదుభూమిలో నా వివరాలు అచ్చవడం, అందులో పేర్కొన్న అభిరుచులు చూసో లేదా అచ్చైన ఫోటో కారణంగానో వందలాది స్నేహ విజ్ఞప్తులు అందాయి. అందులో మా పక్క వూరు, సిరిసిల్ల నుంచి శ్రీనివాస్ రాయడం ఒక గమ్మత్తు. దూరం నుంచి కాకుండా దగ్గరి నంచి వచ్చిన ఆ ఉత్తరం మొదలు చాలా మందితో కలం స్నేహం మొదలెట్టడం, పోస్టు కార్డులు, వందలకు వందలు ఇంగ్లాండ్ లెటర్లు ( అలా అందమే ఇష్టం), ఒక్క మాటలో పోస్టాఫీసుతో తెరుచుకున్న ఒక పెద్ద ప్రపంచానికి ఎక్స్ పోజ్ కావడం ఒక ఆహ్లాదకరమైన అనుభవం. ప్రతి రోజూ ఉత్సాహం పరిడవిల్లిన నూతన యవ్వనపు దినవారాలవి. రోజులు గడవడం అంటే ఉత్తరాలతో లెక్కించడమే aనాలి.తర్వాతి రోజుల్లో అభిరుచి విస్తరించడం, సాహిత్య పేజీల ద్వారా ఎందరెందరో మహా రచయితలు ప్రపంచానికి గవాక్షంగా మారారు. ఐతే, అందుకు పునాది వేసిన తొలి రచయితలు మాత్రం కలం స్నేహితులే.చూస్తుండగానే కలం స్నేహం మెల్లగా రచనా వ్యాసంగానికి దారి తీయడం ఎంత అందమైన విషయం! పత్రికా పటనమే పత్రికా రచనగా మారడం మరెంత సంతృప్తికరమైన వ్యాసంగం! ఫోటోగ్రఫీ ఒక అభిరిచిగా అప్పుడు రాయకపోయినా అదే ఇష్తమైన సౌందర్య శాస్త్రం కావడం ఎంతటి కవితా న్యాయం.కావ్యం అంటే అప్పుడు తెలియదు. ఒక్కో ఉత్తరం ఒక కావ్యంగా అనిపించాయని పిస్తోంది ఇప్పటి ద్రుశితి గనుక చెబితే. అన్నీ కాకపోయినా చాలా దాచుకోవడం, నా అంటి తరం అందరికీ అదెంత సంపదో ఎలా మాటల్లో చెప్పగలం!ఉన్న స్పెసులోనే రాసే విషయంతో, మనదైన దస్తూరితో ఎంత ఆకర్షించేవాళ్ళం.ఒకరి ముఖం మరొకరికి తెలియకుండా ప్రతి ఉత్తరంలో ఒకర్నొకరు దర్శించుకోవడం ఎంత బాగుండేది!రాసే ప్రతి అక్షరం, వాక్యం ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు అర్థం చేసుకోవడానికి దోహదపడేలా ఎంత శిల్పం ఉండేది అప్పుడే!నేటి స్నేహితుల దినోత్సవం రోజున ఎన్నో రకాల స్నేహాల్లో కలం స్నేహం తాలూకు అనుభూతిని యాది చేసుకుంటూ నాలుగు మాటలు రాస్తుంటే ఎంత సంతోషంగా ఉన్నదో చెప్పలేను.నా అభిరుచులు చూసి, కలం స్నేహం చేయడానికి తొలి ఉత్తరం రాసిన మిత్రులందరినీ నేడు ప్రేమతో తలుచు కుంటున్నాను. ఈ వేళ ఆ స్నేహితులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాబివంధనాలు తెలుపు కుంటున్నాను.ఇది నా ఒక్కరి అనుభవం కాదని మీకు తెలుసు. కలం స్నేహం అనుభూతిని ఆస్వాదించిన అందరికీ ఈ సందర్భంగా చీర్స్.అన్నట్టు, అప్పటి వాళ్ళు ఎవరైనా నన్ను గుర్తు పడతారని, నా పాత పేరుతో ఈ ఉత్తరం రాస్తున్నాను.-కె రమేష్ బాబు,ఎల్లారెడ్డిపేట.
August 3, 2020 • T. VEDANTA SURY • Memories