ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
త్వరలో మన పి . వి. తాతయ్య సీరియల్ .. ప్రమోద్ ఆవంచ
November 16, 2020 • T. VEDANTA SURY • News

మొలక  లో నేను రాస్తున్న టాగూర్ తాతయ్య ఇంకో వారంలో పూర్తవుతుంది.తరువాత ఎవరి గురించి రాద్దామా అనుకుంటున్న సమయంలో, కొమరం భీమ్ జీవిత చరిత్ర ను రాస్తే ఎలా వుంటుంది, గురువు గారు అని  మొలక వ్యవస్థాపక సంపాదకులు వేదాంత సూరి న్యూజిలాండ్ నుంచి ఫోన్ చేసినప్పుడు అడిగాను.మంచి ఆలోచనే కానీ, ప్రస్తుతం పీవీ నరసింహారావు తాతయ్య  శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం ముందు వుంచారు.అంత పెద్ద ప్రముఖుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రధాన మంత్రి గా దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు చేసిన పీవీ తాతయ్య గారి జీవిత చరిత్ర గురించి చాలా మందికి తెలియదు.ముఖ్యంగా భావి తరాలకు ఆయన చరిత్ర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
 ఆయన బాల్యం, సాహిత్య, రాజకీయ జీవితాన్ని పిల్లలకు పరిచయం చేసి,భారత రత్న పురస్కారానికి అర్హుడైన ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను పిల్లలకు చెప్పి, వాళ్ళలో ఉత్తేజం కలిగించాలనిచెప్పారు.అటు తరువాత వెంటనే,ఆయన మీరు కరీంనగర్ వెళ్లి నప్పుడు సంతోష్ బాబు గారికి కలవండి ఆయన మీకు పీవీ తాతయ్య గారి గురించి కావాల్సినంత మెటీరియల్ ఇస్తారనీ చెప్పారు.
              సరే అని చెప్పి, మొన్న కరీంనగర్ వెళ్లినప్పుడు పని పూర్తయ్యాక, లంచ్ టైమ్ లో సూరి గారు చెప్పిన కల్వకోట వెంకట సంతోష్ బాబు గారిని కలువడానికి ఆయన ఇంటికి వెళ్ళాను.నెహ్రూ సెంటర్ నుంచి లోపలికి వెళ్లి, కుడివైపుకు తిరిగితే ఒక ఇంటికి 'పీవీ సాహిత్య పీఠం' అని ఒక పెద్ద బోర్డు వుంది.ఆ వీధిలో చాలా మంది ప్రముఖులు వుండే వాళ్ళనీ, తరువాత ఆయన మాటల్లో తెలిసింది.శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో పనిచేసినప్పుడు ఈ వీధిలోనే అద్దెకు వుండేవారని చెప్పారు.
                  ఇక సంతోష్ బాబు గారి విషయానికొస్తే,ఆయన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి.ఆయన సతీమణి సుభాషిణి గారు పీవీ నరసింహారావు గారి తమ్ముడి కూతురు.వారికి ఒక అబ్బాయి,ఒక అమ్మాయి, అబ్బాయి, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం.అమ్మాయి అమెరికాలో వుంటుంది.2013లో రిటైర్ అయిన తరువాత ఆయనకున్న సాహిత్య అభిలాషతో వందల పుస్తకాలు చదివారు.ఆ పుస్తకాలతో ఒక రూం నిండా పెద్ద లైబ్రరీ.
                    పీవీ సాహిత్య పీఠం అనే సంస్థను స్థాపించి,ప్రతి సంవత్సరం పీవీ గారి, జయంతి, వర్ధంతుల సందర్భంలో, స్థానిక కవులతో కవి సమ్మేళనాలను, ఏర్పాటు చేసి, కవులకు నగదు బహుమతి, సర్టిఫికెట్,మెమోంటో, అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
                     అంతేకాకుండా పీవీ నరసింహారావు గారి,ఆంగ్ల ప్రసంగాలను, వ్యాసాలను తెలుగులోనికి అనువదించారు.'భాగ్య విధాత పీవీ' అనే వ్యాస సంకలనం,'పీవీ చెప్పిన ముచ్చట్లు' అనే పేరుతో,పీవీ గారి ప్రసంగాలను,'ప్రజల మనిషి పీవీ'అనే శీర్షిక పేరుతో,అభిమానులు అభిప్రాయాలు-విశ్లేషణలను కూర్పు చేసారు.పీవీ ప్రసంగాలతో కూడిన మరో పుస్తకం 'అక్షర ఝరి...అక్షయ సిరి'అనే శీర్షికతో సంతోష్ బాబు గారు తెలుగు లోనికి అనువాదం చేసారు.
                    పీవీ తాతయ్య గారి బాల్యం నుంచి నిజాం పాలనలో రజాకార్ల కు వ్యతిరేకంగా ఆయన చేసిన ఉద్యమం,ఆయన నాగపూర్ వెళ్ళవలసిన పరిస్థితులు, ఇలా ఎన్నో సంగతులను సంతోష్ బాబు గారు నాకు వివరించారు.చివరిగా పీవీ గారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పడానికే ఒక రోజు సరిపోదండి అంటూ ముగించారు.
                   మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే 'లోపలి మనిషి', 'నర్సింహుడు'పుస్తకాలు కూడా చదవండి అని సలహా ఇచ్చారు.ఆయన తన లైబ్రరీ నుంచి పీవీ నరసింహారావు తాతయ్య  గారికి సంబంధించిన పది పుస్తకాలు ఇచ్చారు.
               ఆయనతో జరిపిన ఆ రెండు గంటల సంభాషణనాకు చాలా ఉపయోగపడింది.చాలా విషయాలు తెలుసుకున్నాను.ఆ పుస్తకాల నుండి పిల్లలకు ఉపయోగ పడే అంశాలను తీసుకుని రాయడానికి కొండంత దైర్యం కలిగింది.ఆయనకు ధన్యవాదాలు తెలిపి, బయటికి వచ్చాను..
త్వరలో మీకు మన  పి . వి. తాతయ్య సీరియల్ రాస్తున్నాను. నిరీక్షించండి .