ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దక్షిణాంధ్ర యుగంలో కవులు తమిళనాడులోనే కాక మైసూర్ రాజ్యం లో కూడా ఎంతోమంది కవులు తెలుగు సాహిత్యాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా విరిసేందుకు ఎనలేని సాహిత్య కృషి చేశారు. ఈ కవులు పద్య గ్రంథాలు కన్నా గద్య గ్రంథాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి అనేక గ్రంథాలు రచించారు. ఎందరో మహా కవులు తమ సాహిత్య కాంక్షతో రచనలు చేశారు. వీరిలో "కళువే" వంశపు కవులు అనేక మంది ఉన్నారు. ఈ వంశపు కవులలో కళువే వీర్రాజు ముఖ్యుడు. ఇతడు మైసూరు రాజుల కడ దండనాథుడుగా ఉండేవాడు.ఈయన మహాభారతాన్ని వచనంగా రచించాడు.ఈయన రాసిన భారతంలో సభా, భీష్మపర్వాలు మాత్రమే లభిస్తున్నాయి. ఇతనికి విష్ణు పురాణం వచన కర్తయగు తుపాకుల అనంత భూపాలుడు తోడ్పడినాడని, ఈ కవి చెప్పుకున్నాడు. ---ఈ వీర్రాజు, కుమారుడైన నంజురాజు కూడా మైసూరు రాజ్యం లో దండ నాథుడిగా ఉండేవాడు. ఇతడు పలు గ్రంథములు రాసాడు. ఇతడు రాసిన గ్రంథములలో కన్నడ వచన భారతము, తెలుగు హాలాస్య మహత్యము అను గ్రంథములు మాత్రమే లభించుచున్నవి. దక్షిణాంధ్ర యుగములో తెలంగాణమున, ఆంధ్ర దేశాన కూడా పలువురు కవులు కావ్యాలు రచించారు. వారిలో దామెర్ల వేంగళ నాయకుడు ఒకరు. ఇతడు కృష్ణ చరిత్రము, బహుళాశ్వ చరిత్రము అను గ్రంథాలు రచించాడు. ఈయన సంస్కృతాంధ్రాలలో మేటి పండితుడు.కవిత్వమున కాళిదాసాదులు తప్ప ఇతరులెవ్వరూ తనకు సాటి కారని ఇతని గ్రంధంలో చెప్పుకున్నాడు. శ్లేష శబ్దాలంకారములందు ఇతనికి ప్రీతి ఎక్కువ. ఈ కాలపు కవులలో బహు గ్రంథాలు రచించి, కవి సార్వభౌముడని ప్రఖ్యాతి గాంచిన కవి కూచిమంచి తిమ్మన (1700-1756). ఇతని రచనలలో రుక్మిణీ పరిణయము, నీలా సుందరి పరిణయము, అచ్చ తెలుగు రామాయణము, సాగర సంగమ- మహత్యము, శివలీలా విలాసము, సర్వలక్షణ సాగర సంగ్రహము, కుక్కుటేశ్వర శతకము వంటి అనేక కృతులు ఉన్నాయి.--కూచిమంచి జగ్గకవి. ఇతడు కవిసార్వభౌముడని పేరు గాంచిన తిమ్మకవికి రెండవ తమ్ముడే, ఈ జగ్గ కవి(1700-1760) జానకి పరిణయము, ద్విపద రాధాకృష్ణ చరిత్రము, సుభద్ర పరిణయము, చంద్రలేఖ విలాపము, సోమ రాజీయము వంటిఅనేక గ్రంథాలు రచించిన కవి.---తిమ్మకవికి సమకాలీనుడు లేదా ముందుతరం వాడిగా, చెప్పబడుతున్న కవి "ఏనుగు లక్ష్మణ కవి". ఇతడు తెలుగు సాహిత్యంలో కవిగా చిరపరిచితులు. ఈయన రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రము, సుభాషిత రత్నా కరము, రామ విలాసము, గంగా మహత్యము, నృసింహ దండకము, విశ్వేశ్వరోదాహరణము గాక పలు గ్రంథాలు రచించాడు. ఇతని పూర్వీకులు పెద్దాపుర సంస్థానము నాశ్రయించి, ఆ రాజుచే వివిధ సత్కారములు పొందారు.---సుభాషిత త్రిశతిని ఆంధ్రీకరించిన కొందరు కవులు ఎలకూచి బాలసరస్వతి , పుష్పగిరి తిమ్మన ముఖ్యులు(1730-1790). ఈ రచనలలో ఒక్క నీతిశాస్త్రమే లభించుచున్నది.బాలసరస్వతి తన యనువాదము నందలి పద్యములను "సురభి మల్లా నీతి వాచస్పతీ" అనే మకుటంతో రచించాడు. ఈ సురభిమల్లభూపతి జట ప్రోలు సుస్థానాధీశుడని విమర్శకులు చెప్పుచున్నారు. బాలసరస్వతి కవిత్వము ప్రౌఢమై, కొంచెము అర్థ క్లేశము కలిగించును. ఇతడు నన్నయ రచనగా ప్రసిద్ధ మయిన ఆంధ్రశబ్ద చింతామణికి టీక రచించాడు. ఇదికాక చంద్రికా పరిణయమనుప్రబంధమును కూడ ఇతడు వ్రాసెనని చెప్పుదురు. కాశీరాజు కూతురు చంద్రికను భీముడు వివాహమాడుట ఇందలి కథ. ఈ గ్రంథము సురభి మాధవ రాయలు రచించిన "చంద్రికా పరిణయం" కంటే విభిన్నంగా ఉంటుంది, ఎటువంటి పోలికలు లేవు.ఈ కాలం కవులలో ప్రసిద్ధుడు కంకంటి పాపరాజు నెల్లూరు మండలము ప్రళయకావేరి పట్టణమున అమీనుగా, లౌఖ్యాధికారిగా ఉన్నాడు.కవి పాపరాజు (1750-1800) తిక్కన సోమయాజి నిర్వచనోత్తరముగ రచించిన ఉత్తర రామాయణమును ప్రబంధ రీతి చంపు కావ్యంగా (చంపు కావ్యం అనగా పద్యము మరియు వచనము కలిపి ఉండే కావ్యం) రచించాడు. చెక్కిన మూల మనకు సాధ్యమైనంత విస్తృతంగా రాశాడు. ఈ కావ్య రచనలు తనకు పుష్పగిరి తిమ్మన కవి సాయం అందించాడని స్వయముగా తెలియ జేశాడు. ఈ కావ్య రచనకు ముందు విష్ణు మాయ విలాసమైన యక్షగానము కూడా రచించాడు. ఈయన తన గ్రంథాలను ఇష్టదైవమైన మదన గోపాల స్వామికి అంకితం చేశాడు. (సశేషం) - ఇది 80వ భాగం - బెహరా ఉమామహేశ్వరరావు- 9290061336
August 2, 2020 • T. VEDANTA SURY • Serial