ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దక్షిణాంధ్ర యుగమున తెలుగు సాహిత్యము తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సాహితీ స్రవంతి అత్యున్నత వేగముతో ప్రవహించి సాహిత్య సిరులు పంచింది. తదుపరి ఈ యుగంలోనే మరికొందరు తెలంగాణమున సాహితీ సేవలందించిన కవులను గూర్చి చెప్పుకోవలసి వున్నది. జటప్రోలు సంస్థానాధిపతి అయిన సురభి మాధవరాయలు చంద్రికా పరిణయమను ప్రబంధాన్ని రచించాడు. ఈయన సర్వజ్ఞ సింగమనేని వంశమునకు చెందిన వాడని చెప్పుకుంటారు. ఈ చంద్రికా పరిణయం పిల్ల వసుచరిత్ర అనికూడా చెప్ప దగినది. ఈ గ్రంథమునందు చంద్రిక సుచంద్రుల ప్రణయము వర్ణింపబడినది. భట్టుమూర్తి వలె ఈ కవి కూడా శ్లేష యమకాదులయందును, ఇతర శబ్దాలంకారములందును ప్రీతిని ప్రదర్శించడం జరిగింది. ఇతని శ్లేషలు వసుచరిత్రలంత భావపూరితములు మరియు అంత సుందరమైనవి కాకపోయిను, ఇతని పాండిత్యం మాత్రము చెప్పుకో దగినదని నిస్సందేహంగా చెప్పుకొనవచ్చు.పరశురామపంతుల లింగమూర్తి కవి:-ఈయన ఓరుగల్లులో జన్మించాడు. ఈయన తన యవ్వన దశలో "రతి మన్మధ విలాసము" అనెడి శృంగార ప్రబంధ మును రచించాడు. తర్వాత కాలమున క్రమముగా భక్తి వైరాగ్య భావములకు నిలయమైన సీతారామాంజనేయ సంవాదము అన్న వేదాంత గ్రంథము రచించి కీర్తి కెక్కాడు. ఈ గ్రంథంలో తాను జీవ బ్రహ్మైక్య సిద్ధాంతాన్ని పారదర్శకంగా నిరూపించాడు. ఇందులో మూడు ఆశ్వాసము లను వివరించాడు. అవి వరుసగా తారక యోగము, సాంఖ్య యోగము, అమనస్క యోగము అను మూడు యోగముల గురించి వివరించాడు. ఇది గూఢమైన వేదాంత విషయములను గూడా రసవంతమైన కావ్యంగా చెప్పగలుగుట, ఈ కవి యొక్క ప్రత్యేకత. ఇందు సందర్భోచితమైన మరియు అనుభవ సిద్ధములైన ఉపమానముల గూర్చి ఈ కవి వివరించాడు. ఈయన వేదాంత సారమైన విషయములను సర్వజన శుబోధకముగా విశ్లేషించి వ్రాసాడు. ఈ గ్రంథానికి సాటి మరొకటి లేదనిపిస్తుంది. ఇతని కుమారుడు రామమూర్తి కవి. ఈయన కూడా సాటిలేని వేదాంతి. దీనిని బట్టి ఈ వంశము వారు అనుశ్రుతంగా తత్వవేత్తలని తెలియుచున్నది.మరింగంటి వంశజులు:- దేవరకొండలో నివాసులైన మరింగంటి వంశమున పలువురు పండిత కవులు ఉదయించారు. వీరు వైష్ణవమతావలంబీకులు. విశిష్టాద్వైత మతాచార్యులుగా చిరకాలము నుండి ప్రసిద్ధి చెందారు. ఈ వంశంలోని వాడు అయిన మరింగంటి సింగరాచార్యులు అను కవి, దశరధనందన చరిత్రమనుపేర నిరోష్ఠ్య రామాయణమను శుద్ధాంధ్ర గ్రంధము, నిరోష్ఠ్యసీతా కళ్యాణమను ప్రబంధమును రచించాడు. ఈయనకు శతఘంటావధాని అని బిరుదు కలదు. ఈయన సలక్షణమైన కవితలు వ్రాసాడు. కవితలు రాయడంలో దిట్ట. ఈ కవి పలువురు పండిత విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.మరింగంటి వేంకట నరసింహాచార్యులు:- దేవరకొండలోనున్న మరో కవి ఇతడు. ఈ కవి శ్రీకృష్ణ శతానందీయము, చిలువపడిగరేని పేరణ అను రెండు కావ్యాలను రచించాడు. వీటిలో మొదటిది భాగవతము నందలి కథను గ్రహించి రాశాడు. ఈయన కళాపూర్ణోదయమును చూసి కాబోలు ఈ కావ్యంలో విచిత్రమైన కల్పన చేశాడు. కృష్ణుడు మాయ బ్రహ్మయై సరస్వతి కడ నుండ సత్య బ్రహ్మ అచ్చటకు వెళ్లి అతనితో వాదించుట ఈ కథ యందు ముఖ్యాంశం. రెండవది అచ్చ తెలుగు కావ్యము. ఇందు నాగ కేతనుడైన దుర్యోధనుని వివాహము వర్ణింపబడినది. ఈ వంశమునకు చెందిన మరొక కవి నరసింహాచార్యులు. ఇతడు తాళంక నందినీ పరిణయమును ప్రబంధముగా రచించాడు. ఈ కావ్యంలో మేనరికపు వివాహముల పరిస్థితిని గురించి చక్కగా వర్ణించి చెప్పాడు.ఈ విధంగా ఈ వంశపు కవుల కీర్తి తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచింది. ( ఇది 83వ భాగం ) - బెహరా ఉమామహేశ్వరరావు - 9290061336 ‌
August 5, 2020 • T. VEDANTA SURY • Serial