ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దర్శనీయ ఆలయాలు--మద్రాసు నగరం ఆలయాలకు పెట్టింది పేరు. అందులోనూ అమ్మవారి ఆలయాలకూ వినాయకుడి ఆలయాలకూ లెక్కేలేదు.ఓ వేపచెట్టో లేక ఓ రావిచెట్టో ఉంటే ఆ చెట్టుకింద ఓ అమ్మవారి ఆలయం ప్రత్యక్షమవడం ససర్వసాధారణం. నేను టీ. నగర్లోని గిరిఫిత్ రోడ్డులో ఉన్న శ్రీ రామకృష్ణామిషన్ ఎలిమెంటరీ స్కూల్లో ఒకటి నుంచి అయిదో క్లాస్ వరకూ చదివిన రోజులవి. మా స్కూలుని ఆనుకునే ఓ అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారి పేరు ముప్పాత్తమ్మన్. ఇది టీ.నగర్లో చాలా ప్రసిద్ధమైన ఆలయం. నేనైతే మామూలు రోజులలో కన్నా పరీక్షల ముందు ఎక్కువగా ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేయడం, అమ్మవారి సన్నిధిలో నిల్చుని మార్కులు ప్రసాదించమనో ప్యాస్ చేయించమనో కోరుకునేవాడిని. అలాగే డిగ్రీ ప్యాసయ్యే వరకూ ఆ అమ్మవారిపై తెగ విశ్వాసం ఉండేది. ఏ పరీక్షయినా సరే ఈ అమ్మవారిని ధర్శిస్తే గట్టెక్కెస్తానని ఓ నమ్మకం. చివరకు ఓ అమ్మాయితో పరిచయం పెంచుకుని అది కలకాలం ఉండిపోవాలని అనుకున్నదీ ఈ అమ్మవారి సన్నిధిలోనే. ఈ అమ్మవారి ఆలయం అటుంచితే మద్రాసు నగరంలో దర్శించాల్సిన కొన్ని ప్రధాన ఆలయాల గురించి ఒకటి రెండు మాటలు....1. కపాలీశ్వర ఆలయం - మద్రాసులో తప్పనిసరిగా చూడవలసిన ఆలయమిది. ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం మైలాపూరులో ఉంది. రామకృష్ణా మఠానికి పక్కనే ఉన్న ఈ ఆలయానికి పలుసార్లు వెళ్ళొచ్చాను. పల్లవులకాలంలో కట్టిన ఆలయమిది. ఇక్కడి ఆలయంలోని శిల్పాలలో ద్రావిడుల హస్తకళానైపుణ్యాన్ని వీక్షించవచ్చు. 2. పార్థసారథి ఆలయం - ఎనిమిదో శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం తిరువల్లిక్కేణిలో ఉంది. ఈ ఆలయంలో స్వామివొరి దశావతారాలను దర్శించవచ్చు.3. వడపళని ఆలయం - ఈ ఆలయం మద్రాసు నగరవాసులకు తప్పనిసరిగా తెలుస్తుంది. నగరంలోని వడపళని ప్రదేశంలో ఉన్న ఆలయమిది. పళనిలో ఉన్న కుమారస్వామిలాగానే ఇక్కడి ఆలయంలోనూ కుమారస్వామిని దర్శించవచ్చు. అందుకనే ఓది వడపళని అని పిలువబడుతోంది.4. అష్టలక్ష్మి ఆలయం - ఈ అష్టలక్ష్ముల ఆలయం నగరంలోని బెసెంట్ నగర్లో ఉంది. 1974లో ఇది నిర్మితమైంది.5 కాళికాంబాళ్ ఆలయం - కామాక్షి అని పిలువబడే కాళికాంబాళ్ ఆలయం ప్యారిస్ కార్నర్లో (జార్జ్ టౌన్)లోని తంబుచెట్టి వీధిలో ఉంది. ఇది రాజాజీ శాలైకి సమాంతరంగా ఉండే వీధి. 1640లలో సముద్ర తీరానికి దగ్గర్లో ఉండేది. అనంతరం 1678లో ఇప్పుడున్న తంబుచెట్టి స్ట్రీట్లో ఈ ఆలయాన్ని నిర్మించారు.మరాఠా చక్రవర్తి శివాజీ 1667 అక్టోబర్ 3 వ తేదీన ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర పుటల మాట. ఇక్కడి అమ్మవారి రూపం శాంతస్వరూపమైనది.6. అయ్యప్పన్ ఆలయం - .మహాలింగపురంలో ఉన్న ఆలయం. టీనగర్లో మేముండిన వివేకానంద స్ట్రీట్ నుంచి అయిదే అయిదు నిముషాల్లో ఇక్కడికి చేరుకునే వాళ్ళం. కోడంబాక్కం బ్రిడ్జికి ఓ రెండు నిముషాల నడకదూరంలో ఉన్న ఆలయం.నగరంలో మొట్టమొదటి అయ్యప్ప ఆలయం ఇది. 1974లో సుబ్రహ్మ ణ్యన్ అనే అయ్యప్పభక్తుడు మరికొందరితో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు.7 తిరుమల తిరుపతి దేవస్థానం - టీనగర్లో నేను చదువుకున్న శ్రీ రామకృష్ణామిషన్ మెయిన్ హైస్కూలుకి ఆనుకుని ఉన్న వేంకటనారాయణ రోడ్డులో ఉందీ దేవస్థానం. ప్రత్యేకించి శనివారంనాడు భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఆంధ్రజ్యోతిలో నేను కంట్రిబ్యూటరుగా పని చేసిన రోజుల్లో ఈ ఆలయ అధికారి ప్రభాకర్ గారిని (?) కలిసి ఈ ఆలయం గురించి కొన్ని వివరొలు తెలుసుకుని ఓ కథన రాసాను.8 షిరిడీ సాయి బాబా ఆలయం - మైలాపూరులో ఉందీ బాబా ఆలయం. మదరాసు నగరంలో సుప్రసిద్ధ బాబొవారి ఆలయమిది. తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో బాబాకు దీపం వెలిగిస్తే అనుకున్న మంచి కార్యాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం.9. మరుదీశ్వరర్ ఒలయం - తిరువాన్మ్యూరులో ఉన్న ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. ఇది శైవ క్షేత్రం. ఆదికవి వాల్మీకి ఈ ఆలయాన్ని దర్శించినట్లు స్థానికుల కథనం.10 ఆంజనేయస్వామి ఆలయం - నంగనల్లూరులో ఉన్న ఆలయమిది. ఇక్కడి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ముప్పై రెండు అడుగులు కలది. ఈ విగ్రహం ఒకే రాతితో చెక్కినది. - యామిజాల జగదీశ్
August 9, 2020 • T. VEDANTA SURY • Memories