ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దానేన బోగీభవతి --కె ఎస్ అనంతాచార్య.
September 15, 2020 • T. VEDANTA SURY • Poem

శిబిని చూడలేదు
కర్ణుణ్ణి కలవలేదు
వదాన్యుల సంతతి
ఉదారుల చిరునామా లు ఎక్కడో?

తన కళ్లతో జగతి చూపించగలడు
అమరుడైనా నేత్రాలలో అర్కుడై ఉదయించినప్పుడు


ఆగిపోయే గుండెకు
ఆత్మగల సజ్జనుల దానశీలతయే
గుండె రాగాలు వినిపిస్తాయి 
లయాత్మక శబ్దాలు ధ్వనిస్తాయి

కాలరేఖలు చేసిన గాయం మాన్పించి
అందించిన కాలేయం
రెండు జీవితాల్లో నిండు చంద్రుడై వెన్నెల ప్రసాదిస్తాడు 

డాబు, దర్పాలు
దండోరాలు లేక
గుట్టు చప్పుడు కాకుండా చేతిలో పెట్టె
పట్టేడు మెతుకులు
ఆకలి డొక్కలకు అసరా అయ్యే డొక్కా సీతమ్మలు కావాలి ప్పుడూ

చారేడిచ్చి బారెడు గుంజే ఎత్తులు వేసి
ఫోటోలకు  ముఖాలిచ్చి
పత్రికలలో వార్తలు గొప్పల డప్పులు కొట్టుకునే
టక్కు టమారుల కుమారులు
దానకళాకారులై ప్రదర్శనలు వద్దు బలిచక్రవర్తులు కావద్దు

పాపం పుణ్యం కాదు మనసు పెట్టీ
గరీబులకు
గంతలున్న బొంతలు అందించినా సరే

షికార్లకు,జల్సాలకు
తగిలేయటం కాదు
చీకటి బతుకుల్లో
చిరుదీపం వెలిగించడం కావాలి

ఒక్క వీలునామా చాలదా
 విరిగిన బతుకులు
అతకడానికి
చచ్చుబడ్డ అవయవాలు లేచి నిలబడటానికి

తవ్విన కొద్దీ బావిలో నీరూరినట్లు
దాన గుణమే ధన సిద్ధిని కలుగజేస్తుంది
దానేన భోగీభవతి!