ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దిల్లికి రాజైనా తల్లికి కొడుకే--ఈ మాట నిద్రలో విన్నా మాకు గుర్తుకువచ్చే వ్యక్తి స్వర్గీయ శ్రీ పివి నరసింహ రావు గారు.వారు నడిచిన మంథని రోడ్ల మీద మేము ఆడి-పాడి పెరిగాము అనే సత్యం మాకు గర్వంగానే ఉంటుంది,వారి శతజయంతి రోజున ఇంతకన్నా మేము పంచుకునే అద్భుతమైన జ్ఞాపకం ఏముంటుంది..?వారి వ్యక్తిత్వాన్ని తెలిపే ఒక చిన్న సంఘటన చెబుతాను... గోదావరిఖని దగ్గర చిన్న గ్రామమైన జనగామకు చెందిన పురుకంటి మారుతి(మా కజిన్) పివి గారింట్లో కుటుంబసభ్యుడిగా ఉండేవాడు. పుట్టిన ఊరును, సొంత చెల్లెను వదిలి అక్కడే ఉంటూంటే చుట్టాలందరు మారుతిని ఇంటికి రమ్మని చెబితే "పెదనాన్నను వదిలి రానని" చెప్పేది మారుతి, అన్నీ వదులుకోని ఓ అనామకునిగా వచ్చిన మారుతిని ఆ కుటుంబం ఆప్యాయంగా చూసుకునేది. పెదనాన్న తన మంచి చెడ్డా చూసుకుంటున్నారని సొంత ఊరికి రావాల్సిన అవసరం తనకు లేదని మారుతి చెప్పేవాడు.మారుతి వాళ్లింట్లో ఏ బెంచీ మీదనో నిద్రపోతే పివి గారి పనులయ్యాక ఏ అర్థరాత్రో చూసి దుప్పటికప్పి వెళ్లేవారని పివి గారింటికి వెళ్లే మంథని వాళ్లు చెప్పేవారు. పివి గారి మరణం తర్వాత 15 రోజులు భోజనం, నిద్ర మానేసిన మారుతి కూడా రామ భక్త హనుమారుతే. ఆ తర్వాత పివి రంగారావు గారితో మారుతి అనుబంధం కొనసాగింది.*"మంథనివాసులను మహదేవపూర్ వాసులను కలుపుతున్నా" అంటూ సోమన్ పల్లి బ్రిడ్జి ప్రారంభసమయంలో వారన్న మాటలను, మంథని దవాఖానాలో కుటుంబనియంత్రణ ప్రాజెక్ట్లో భాగంగా స్టెరిలైజేషన్ యూనిట్ అప్పటి ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ అన్సారీ గారితో కలిసి ప్రాంభించిన సంఘటనలను ఇప్పటికీ మా నాన గుర్తుచేస్తూంటారు.పివి నరసింహ రావు గారి శతజయంతి సందర్భంగా హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తూ. - అనిత ఎలిశెట్టి
June 28, 2020 • T. VEDANTA SURY • Memories