ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దిష్టి(బాలలకథ)రచన:మృదువిరి
November 1, 2020 • T. VEDANTA SURY • Story

బిట్టు ,చిన్నూ ఇద్దరూ అన్నాచెల్లెళ్ళు. బిట్టు మూడవ తరగతి చిన్ను ఒకటో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. చిన్ను అంటే బిట్టు కి ప్రాణం .చిన్నూకి అన్నే లోకం .. ఎవరైనా చెల్లి ఏడిపిస్తే అస్సలు ఊరుకునేవాడు.

 ఒకసారి చిన్ను కి బాగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వచ్చాయి. చిన్ను డీలా పడిపోయింది.వంట్లో శక్తి  లేక అన్న తో ఆడుకునేది కాదు ..దాంతో బిట్టు కి దుఃఖం వచ్చింది."అమ్మ ఏమైనా చెయ్యమ్మా" అంటూ  ఏడుస్తూ అమ్మని అడిగాడు. అంతలో బిట్టు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ చేసింది.. "అమ్మ చిన్ను కి ఆరోగ్యం బాలేదు .ఏం చేయమంటావ్? అని అడిగింది ‌అమ్మ 

"వాంతులు విరోచనాలు కడుపు నొప్పి కూడా ఉన్నాయా?అయితే దిష్టి తగిలి ఉంటుంది. అందుకని ఒక రూపాయి బిళ్ళను దిష్టితీసి నీళ్లలో వేసేయ్ .. కొబ్బరికాయ తలాపున పెట్టు..ఉప్పు మిరపకాయలు దిష్టి తీసి నిప్పుల్లో  వెయ్యి"అని చెప్పింది అమ్మమ్మ. 

అమ్మ అలాగే చేసింది అది చూసిన బిట్టు కి ఒక ఆలోచన వచ్చింది ..వెంటనే తన కిడ్డీ బ్యాంక్ పగలగొట్టి అందులో ఉన్న నాణాలన్నీ కుప్ప పోసాడు.

 అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన నాన్న అది చూసి "బిట్టు..ఏం చేస్తున్నావ్ రా" అని అడిగారు ..బిట్టు బుగ్గలపై కన్నీళ్ళ ధార ఆయన మనసును కలచివేసింది.

"నాన్నా.. చెల్లి కి ఆరోగ్యం బాగా లేకపోతే ఒక రూపాయి బిళ్ళ ని తన చుట్టు తిప్పి నీళ్లలో వేసేయమని అమ్మమ్మ అమ్మతో చెప్పింది ..మరి చెల్లి తొందరగా కోలుకోవాలని ఇవన్నీ తన చుట్టు తిప్పి నీళ్లలో వేసేద్దామనుకుంటున్నా నాన్నా"  అన్నాడు ఆశగా  .
బిట్టు కళ్ళల్లో ఆవేదన, ఆరాటంవ్యక్తమవుతున్నాయి.

 అప్పుడే.. ఉప్పు మిరపకాయలు నిప్పుల్లో వేసిన వాసన ఘాటు రాసాగాయి"ఇదేం పిచ్చి పని.. హాస్పిటల్ కి తీసుకు వెళ్ళకుండా ఇలా జాగు చేస్తున్నావే"..అంటూ అమ్మని కోప్పడుతూ, "చిన్ను  చేతులను శుభ్రంగా ఉంచు ఉంచుకోకపోవడం వల్ల ..అలాగే ఆ మట్టి చేతులతోనే, అపరిశుభ్రమైన చేతులతో తినడం వల్ల ఆమెకు వాంతులు విరోచనాలు అయ్యాయి.. ఇలాంటి సమయంలో ఓ ఆర్ ఎస్ తాగించడం, పరిశుభ్రంగా ఉంచడం, వైద్యుడికి చూపించడం చేయాలి .అంతే కానీ నాణాలను, మిరపకాయలను చుట్టూ తిప్పి నీళ్లలో నిప్పుల్లో వేస్తే ఏమి లాభం లేదు. ఇంకా నీళ్లలో, వాతావరణంలో కాలుష్యం పెరగడం ,మన డబ్బులు తరగడం అలాంటి నష్టం తప్ప " అన్నాడు నాన్న బిట్టు కి సర్ది చెబుతూ.
బిట్టు కి అది నిజమేనని తెలిసిపోయింది..ముందు రోజు తాను  క్రికెట్ ఆడుతున్నప్పుడు మురికి చేతులతో చెల్లికి చాక్లెట్ తినిపించిన విషయం గుర్తొచ్చింది.. తన వల్లనే చెల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని గ్రహించాడు బిట్టు.. ఆ రోజు నుండి తాను శుభ్రంగా ఉండటమే కాక చెల్లెలి పరిశుభ్రత పట్ల కూడా మరింత శ్రద్ధ గా ఉండేవాడు బిట్టు.