ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దుర్గతి: -- డాక్టర్. బి. వి. ఎన్ . స్వామి
October 13, 2020 • T. VEDANTA SURY • Story

బుంగి కనపడక నాలుగురోజులయింది. ఎటు వెళ్ళినా చెప్పి వెళ్ళేవాడు. వాళ్ళ ఇంటివరకైనా వెళ్ళి వద్దాం అనుకుంటూ బయల్దేరిన. వెళ్ళేసరికి ఇంటి ముందు వరండాలో ప్రశాంతంగా పడుకొని ఉన్నడు.
‘‘ఇన్ని రోజులు ఎటుమాయమయినవు’’
‘‘మా పెద్దబాపు చనిపోయిండు అందుకే పోయిన’’
‘‘ఏదైనా అనారోగ్యమా? సహజ మరణమా?’’
‘‘అనాథ మరణం’’
‘‘అదేం దుర్గతి. వివరంగా చెప’’
అతనికి ఐదుగురు కొడుకులు. ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నయి. అన్నింటితో పాటు అహంకారం ఉంది. డబ్బు, కీర్తి పట్ల ఉన్న మమకారం వల్ల తోటి వారికి దూరం అయిండు. హోదా అధికారాల ప్రదర్శనల వల్ల ఇతరులు అతనికి దూరం అయ్యారు. పిల్లలపై ఆ ప్రభావం పడింది.
కొడుకులు పెద్దగయ్యారు. అతడు ముసలివాడయిండు. చీటికి మాటికి కొడుకులు కొట్లాడుకుంటూ అతనికి దూరంగా ఉన్నరు. తను ఒంటరి అయిండు. గతంలో తను ఎవరితోనూ కలివిడిగా లేని రీతి యాదికొచ్చింది. చేతకానితనం వల్ల ప్రతిదానికి కొడుకులపై ఆధారపడాల్సి వచ్చింది. అందరికి దూరంగా ఉంటూ దర్పం ప్రదర్శించడం కొడుకులకు అబ్బింది. అది అతనికి అశనిపాతమయింది. సకల సౌకర్యాలతో తులతూగే కొడుకులను చూసి కడుపునిండింది. వేళకింత తిండివచ్చేదారి లేక అతని కడుపు కాలింది. పద్దతి, గుణం మార్చుకొమ్మని పోరుపెట్టిన భార్య గుర్తుకొచ్చింది. ఎవరి మాటా వినని నాటి అహంకారం జ్ఞప్తికొచ్చింది. నేటి నిస్సహాయ స్థితికి కారణం తెలిసి వచ్చింది. తెలిసేనాటికి ఆయుష్షు తీరింది.
కొడుకుల్ పుట్టరటుంచు నేడ్తు, రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్, వారిచే నేగతుల్
పడసెం? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వరా!
కాళహస్తీశ్వర శతకం
ధూర్జటి