ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దుర్గాబాయి ధైర్యం-- సత్యవాణి 8639660566
September 17, 2020 • T. VEDANTA SURY • Story

మనదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపు తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మహాసభ జరిగింది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి , గాంధీగారిని చూడాలనీ,ఆయన ఉపన్యాసం వినాలనే కోరికతో,చుట్టు ప్రక్కల ఊర్లనుండి అనేకవేలమంది ప్రజలు ఆసభకు వచ్చారు.
            అయితే ఆభలోనికి ప్రవేశించాలంటే, స్వాతంత్య్రపోరాట నిధికి సహాయకారిగా ఉండడానికై, రెండురూపాయల టికెట్ ను నిర్ణయించారు.
          నాయకులందరూ టికెట్ తీసుకొని సభలోనికి ప్రవేశించారు. ఒక్క జవహర్ లాల్ నెహ్రూ బయట వుండిపోయారు..కొంత సమయం తరువాత ఆయన కూడా సభ ప్రవేశద్వారంనుంచి లోనికి వెళ్ళబోయారు. అక్కడ టికట్ తీసుకొన్నవారిని మాత్రమే లోపలకు పంపించడానికి ఒక పదేళ్ళ పాలిక వాలంటీర్ గా నియమించబడింది. ఆమె నెహ్రూను "దయచేసి టికెట్ చూపించి ,లోపలకు వెళ్ళండి." అన్నది. నెహ్రూ దగ్గర టికెట్ లేదు.తీసుకొనడానికి ఆయన జేబులో చిల్లిగవ్వలేదు. ఆమె అతడిని లోపలకు వెళ్ళనివ్వలేదు.
ఇది గమనించిన ఒక కాంగ్రెస్ కార్యకర్త కోపంగా ఆమె వద్దకు వచ్చి," అమ్మాయీ!ఆయనెవరనుకొంటున్నావ్ ?జవహలాల్ నెహ్రూ!ఆయనను లోనికి పంపించు అన్నాడు.దానికి ఆ బాలిక "ఆయనెవరైతే నాకేమిటి? ఇక్కడ నియమం ప్రకారం,అందరివలెనే ఆయనకూడా టికెట్ కొని వెళ్ళవలసినదే!"అన్నది.జవహర్ లాల్ నెహ్రూ ఆమె కర్తవ్య దీక్షకు మురిసిపోయి ,ఆ బాలికను ఎంతగానొ మెచ్చుకొన్నాడు. ఆ ప్రక్కనున్న కాంగ్రెస్ కార్యకర్త నెహ్రూకు తన జెబునుండి డబ్బులు తీసి టికెట్ కొని నెహ్రూను సభలోనికి తీసికెళ్ళాడు.
       మహాత్ముని ఉపన్యాసం అయిన తరువాత మహాత్ముడు ఆ సభలో స్వాతంత్ర్యసమర నిధికై స్వయంగా జోలెపట్టాడు. స్త్రీలు తమవంటిమీద వున్న ఎంతో విలువైన బంగారు నగలను, చివరకు తాము ఎంతోపవిత్రంగా భావించే మంగళసూత్సాలను కూడా మహాత్ముని జొలెలో వేశారు.
 నెహ్రూజీని అడ్డుకొన్న ఆ బాలిక తన చేతులకు వున్న బంగారు గాజులను గాంధీజీ జోలెలో వేసింది. అది చూసిన గాంధీ,"పాపా! మీ అమ్మగారికి చెప్పకుండా బగారు గాజులు జొలెలో వేశావుకదా! మీ అమ్మగారు కొప్పడరా ?"అంటూ ప్రశ్నించారు. దానికి ఆ పాప "ఇలా మీకు ఇచ్చానంటే కోప్పడరు,కానీ ,స్వాతంత్య్ర పోరాట నిధికి గాంధీజీకి నీ గాజులు ఎందుకివ్వలేదు? అని కోప్పడతారు."అన్నది. ఆమె మాటలకు గాంధీ ఎంతో ఆనందించారు. ఇంతకూ ఆ పదేళ్ళ సాహస బాలిక ఎవరను కొంటున్నారు? మన తెలుగింటి ఆడపడుచు, దుర్గాబాయి .దేశముఖ్ గారిని పెండ్లిచేసుకొని దుర్జాబాయి దేశముఖ్ గా పేరు గణించింది.ఆవిధంగా దుర్గాబాయి అతిచిన్న వయసునుండీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని దేశసేవ చేసి చిరస్మరణీయురాలైయ్యింది.జైశ్రీరామ్ జై భారత్  జైజై భారత్