ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దుష్టబుద్ధి - తగిన శాస్తి:--గోమతి
September 2, 2020 • T. VEDANTA SURY • Story

అనగనగా ఓ అడవి, అందులో ఒక కుందేలు ఒక చెట్టు క్రింద బొరియలో నివసిస్తుండేది. ఆడుతూ-పాడుతూ చాలా ఆనందంగా వుండేది. దాని బొరియకు కాస్త ప్రక్కగా ఒక బండ కూడా ఉండేది. బట్టలుతకడం, స్నానం చేయడం, ఆటలాడడం....అన్నీ ఆ బండ పైనే. కుందేలుకు పెళ్ళై, ముగ్గురు సంతానం కలిగారు. వాళ్ళ ఆటలు కూడా ఈ బండ పైనే...బండ కూడా సంతోషంగా వాటిని భరించేది. రాతి హృదయం అంటారు కానీ, ఇది మనసున్న రాయి. వాటితో తన జీవితం పెనవేసుకున్నట్టు వాటిపై అనుబంధాన్ని పెంచుకుంది. వాటిని చూస్తూ సంతోషంగా వుండేది.

చాలా రోజుల నుండి, ఒక నక్క, ఈ కుందేళ్ళను చాటు నుండి గమనిస్తూ , వాటిని తినడానికి రక-రకాలుగా ఆలోచిస్తోంది. చివరకు దానికి ఒక ఉపాయం తట్టింది. చిన్నగా కుందేళ్ళతో మాట-మాట కలిపి స్నేహం చేసింది. పెద్ద కుందేళ్ళు ఆహారాన్ని తీసుకురావడానికి వెళ్తూ , పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేసేవి. అలా ఒక రోజు అవి ఆహారానికి వెళ్ళిన సమయం చూసుకుని నక్క పిల్లలతో 'వీరి వీరి గుమ్మడిపండు' ఆడదాం అని, ఆడుతున్నట్టు నటిస్తూ రెండు కుందేలు పిల్లలు దాక్కోగానే ... తన చేతిలో పిల్లను బండకు కొట్టి చంపేసింది. అక్కడికి వచ్చిన వాటి తల్లిదండ్రులకు, ఆ బండరాయే ఇలా చేసిందని దొంగ ఏడుపులు ఏడ్వసాగింది. అప్పటి నుండి బండరాయికి అవి దూరంగా మసల సాగాయి. మిగతా రెండు పిల్లలని కూడా అలాగే చేసింది. దానితో బాగా భయపడి పోయిన కుందేళ్ళని తన ఇంటికి ఆహ్వానించింది. తన ఇంటిలో సురక్షితంగా వుండచ్చని నమ్మబలికింది. పాపం అవి దాని మాటలు నిజమని నమ్మి వెంట వెళ్ళాయి.

నక్క చాటుగా తన భార్యని పిలిచి, ఇన్నాళ్ళు చిన్న కుందేళ్ళను తిన్నాం. ఇప్పుడు మన పంట పండింది. కడుపు నిండా ఈ రెంటినీ తిందాము. వంటకు అన్నీ సిద్ధం చేయి. అని అంటూ వుండగా ఆ కుందేలు జంట విషయం మొత్తం విని,తమ పొరపాటుకు చింతిస్తూ, ఒక్క ఉదుటున బయటికి దూకాయి.అది గమనించిన నక్క వాటిని పట్టుకోవడానికి వెంట పడింది. వాటిని పట్టుకునే క్రమంలో అదే బండరాయిని తన్నుకుని మరో బండరాయికి తల తగిలి నక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. బండరాయి నక్కకు తగిన శాస్తి జరిగిందని సంతోషించింది.
ఈ కథకు నా చిట్టితల్లి వేసిన బొమ్మ.