ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దూరపు కొండలు..కథ: రచన:-వి.సునంద, ఖమ్మం
September 26, 2020 • T. VEDANTA SURY • Story

కలకోట అనే గ్రామంలో కనకయ్య అనే రైతు ఉన్నాడు.అతనికి రాజు అనే కొడుకు,బుజ్జీ అనే కూతురు ఉంది.. వాళ్ళింట్లో పిల్లి ,ఓ కుక్క ఉన్నాయి.పిల్లి పేరు చింటూ,కుక్క పేరు బంటీ.
.రాజు బుజ్జీ బడి నుంచి వచ్చాక వాటితో కొద్ది సేపు ఆడుకునే వాళ్ళు..అవి రోజూ రాజూ బుజ్జీ తో పాటే లేచేవి.వాళ్ళు చదువు కుంటుంటే పక్కనే కూర్చుని చెవులు రిక్కించి మరీ వినేవి.
వాళ్ళు బడికి వెళ్ళేటపుడు చింటూ ఇంట్లోనే టాటా చెప్పేది.బంటీ మాత్రం రాజూ బుజ్జీ తో పాటే బడిదాకా వెళ్లి వచ్చేది.
ఓరోజు  పట్నంలో ఉన్న శంకరం మామయ్య రాజూ బుజ్జీ లను చూడటానికి వస్తూ వస్తూ తనతో పాటు వాళ్ళ పిల్లలు సోనీ,సాయిలతో పాటుగా
 ఓ చిన్న పంజరం లాంటి బుట్టలో తను పెంచుకున్న రాణి అనే పిల్లిని తీసుకుని వచ్చాడు..
ఆ రోజంతా పిల్లలు నలుగురు ఆడుకుంటుంటే చింటూ రాణితో ఆడుకుంది.రాణి పట్నంలో ఉన్న విశేషాలు బోలెడు చెప్పింది.. అక్కడ ఎంత హాయిగా బతకొచ్చో అని, పాలతో చేసిన స్వీట్లు, పన్నీర్, ఇంకా ఎన్నో రకాల పాలు పెరుగుల వంటకాలు తిన్నానని,అక్కడుండే తన స్నేహితులు కూడా ఇవన్నీ తింటూ వుంటారని బడాయి కబుర్లు ఎన్నో చెప్పింది. ఇక్కడ పాలు పెరుగు పట్టుకుంటే ఎలుకలు తప్ప ఏమున్నాయి... అదే మా పట్నమైతేనా అని ఊరించే సరికి.. చింటూకు ఎలాగైనా సరే పట్నం వెళ్ళాలనే కోరిక పుట్టింది.

రాణీతో నేనూ నీతో వస్తా తీసుకొని పోవా అని అడిగింది.అమ్మో నాతో వద్దు నా పంజరం బుట్టలో నువ్వు పట్టవు.. అయినా రాజూ బుజ్జీ వాళ్ళు నిన్ను రానివ్వకుండా ఆపేస్తారు.అందుకే
.పక్కనేగా  నడుచుకుంటూ వచ్చేయ్ అని చెప్పి శంకరం మామయ్య వాళ్ళతో వెళ్లి పోయింది...

చింటూకు అస్సలు నిద్ర పట్టడం లేదు.ఎలాగైనా పట్నం వెళ్ళాలనే ఆలోచనే.. 
ఓ రోజు రాజూ బుజ్జీ లను బడికి పంపడానికి నేనూ నీతో వస్తానని బంటీతో కలిసి బయలుదేరింది.. వాళ్ళు బడిలోకి పోగానే
బంటీతో నాకు ఇక్కడంతా తిరిగి చూడాలని వుంది..నువ్వెళ్ళు నేను తర్వాత వస్తానంటే బంటీ ఇంటికి వెళ్ళి పోయింది.
చింటూ నెమ్మదిగా నడుస్తూ బస్టాండ్ కి వచ్చింది..
అక్కడ రాణి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని జనాలు బస్సెక్కుతుంటే వాళ్ళ కాళ్ళలో దూరి ఎవరి కంటపడకుండా బస్సెక్కి పట్నం రాగానే దిగింది.. 
బస్సులు, ఆటోలు, కార్లు, బైకులు క్షణమైనా ఆగకుండా డుర్ డుర్రని తిరుగుతుంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అబ్బో ఎంత బాగుందో పట్నం అనుకుంటూ రోడ్డు దాటబోయింది..కొంచెమైతే కారు కింద పడేదే..
అంతలో ఓ తాత వచ్చి ఇక్కడికి ఎందుకొచ్చావు..మేమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నడుస్తున్నాం..అంటూ రోడ్డు దాటించి ఓ గోడ పక్కన వదిలి పోయాడు.
బ్రతుకు జీవుడా అనుకుంటూ నెమ్మదిగా నడుస్తూ రాణి చెప్పిన దారిలో నడవసాగింది.
దానికి పాలు పెరుగు అమ్మే షాపును చూడగానే ఆకలి గుర్తుకు వచ్చింది.ఇంట్లో అయితే ఈ పాటికి పెరుగన్నం సుష్టుగా తిని ఓ నిద్ర తీసేదాన్ని అనుకుంటూ షాపు యజమాని ఏమైనా తన ఆకలి తీరుస్తాడేమోనని ఆశగా అతడి కాళ్ల చుట్టూ తిరుగుతుంటే.ఛీ!ఛీ! పాడు పిల్లి అని అదిలించాడు. ఏడుపు మొహంతో  నడుస్తూ రాణి చెప్పిన అపార్ట్మెంట్ చేరుకుంది...
పోర్టికోలో ఉన్న శంకరం మామయ్య కారు చూసి హమ్మయ్య అని గట్టిగా గాలి పీల్చుకుంది.
స్నేహితురాలి కోసం అటూఇటూ తిరుగుతూ ఎదురు చూస్తున్న చింటూను కిటికిలోంచి చూసి రాణి గబగబా కిందికి వచ్చింది.
తనుండే పోర్షన్ లోకి తీసుకుని వెళ్ళింది.
అక్కడే ఉన్న శంకరం మామయ్య భార్య ఛీ! వెధవ సంత ఉన్న పిల్లి తోనే చస్తున్నా.. దీనికి తోడు ఇంకోటా అని విదిలించడంతో బిక్కమొహం వేసుకొని మంచం కిందికి పోయి వెక్కి వెక్కి ఏడ్చింది.
అదే తన ఊరిలో అయితే ఎవరింటికి వెళ్ళినా స్నేహితులతో పాటు కడుపు నిండా తిని ఆడుకొని ఇంటికి వచ్చేది.
రాణి కోసం పెట్టిన పెరుగన్నం‌ దాంట్లోనే కొంత తిని ప్రయాణం బడలికతో పడుకుంది.ఎవరో చీపురుతో అదిలిస్తుంటే ఉలిక్కిపడి లేచింది..పని మనిషి ఇష్షో అష్షో అని వెళ్ళగొడుతుంటే రాణి వంక ఏడుపు మొహం తో చూస్తూ బయటికి వచ్చింది.ఏ పోర్షన్ లోకి వెళ్ళినా తిడుతూ వెళ్ళగొట్టే వాళ్ళే..ఎటు పోవాలో తెలియక సెల్లార్లో ఓ మూల ముడుచుకొని పడుకుంది.బాగా ఆకలి వేస్తుంటే ఎలుకల కోసం వెతికింది.. చెత్త కుండీల్లోదైనా ఏదైనా తిని కడుపు నింపుకుందామనుకుంటే అన్నింటికీ మూతలు.ఆకలి తీరే మార్గం తెలియక అల్లాడి పోయింది.
పైన రాణినేమో బయటికి రాకుండా మెష్ డోర్ వేసేసారు..
రెండు మూడు రోజులు అలాగే ఉండేసరికి బాగా నీరసించి చనిపోయే స్థితికి వచ్చింది..
అక్కడ రాజూ బుజ్జీ చింటూ కోసం బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకున్నారని తెలిసింది శంకరం మామయ్యకు.అయితే ఆ వచ్చిన పిల్లి వాళ్ళదేమోనని అనుమానం వచ్చింది శంకరానికి.. ఇంట్లో ఉన్న రాణీ కూడా అన్నం తినకుండా దిగులుగా ఉండటం.. మాటిమాటికీ మెష్ డోర్ తెరవాలని కాళ్ళతో గీరడం గమనించి అది ఎవరి కోసమో అలా చేస్తుందని అర్థమై డోర్ తెరిచి దాని వెనుక వెళ్ళాడు..
అది అన్ని పోర్షన్ లు వెతుక్కుంటూ సెల్లార్ లోకి వెళ్ళి అక్కడ నీరసంతో పడివున్న చింటూను చూసి బాధగా దాని చుట్టూ తిరుగుతూ ఉండటం చూసాడు.దగ్గరకు వెళ్లి దానిని పరిశీలించి చూస్తే అది రాజు, బుజ్జీ వాళ్ళ పిల్లేనని అర్ధమై పోయింది.. గబగబా పక్కనే ఉన్న షాపులో పాల ప్యాకెట్ తెరిచి తాగించాడు.. కొద్ది సేపటి తరువాత దానికి శక్తి వచ్చింది..అది కృతజ్ఞతతో అతని వైపు రాణి వైపు చూసింది..
పట్నం గురించి గొప్పలు చెప్పినందుకు క్షమించమని వేడుకుంది రాణి.
శంకరం మామయ్య దానిని కారులో తీసుకుని వెళ్లి రాజు బుజ్జీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వగానే వాళ్ళు దగ్గరకు తీసుకొని దాని ఒళ్ళంతా తడుముతూ ఇన్ని రోజులు ఎటుపోయావని 
ముద్దు చేస్తుంటే.. దానికి ఏడుపు వచ్చింది దూరపు కొండలు నునుపు అన్న సామెత గుర్తుకు వచ్చి .. ఇంకెప్పుడూ అలా చేయకూడదని చెంపలేసుకుంది ...