ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దేముడా నా బిడ్డ సల్లగుండాల --డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
November 2, 2020 • T. VEDANTA SURY • Story

 'దేముడందరికీ బంగారు కడ్డీతోన రాతరాస్తే మా అమ్మకు మాత్రం గాడిద తోకతోన రాసినాడు''

మొకానికి పచ్చగా పసుపు పూసుకోని, నుదుటన పావలా కాసంత బొట్టు పెట్టుకోని, కాటుక కండ్లతో కలకలలాడుతా ఇండ్లూ, మొగుడే ప్రపంచమనుకోని తిరుగుతా వుండే మా అమ్మ... నేను పుట్టిన ఆరు నెలలకే  మొగుడు చనిపోతే ఒక్కసారిగా కలలన్నీ కాలిపోయి కర్నూల్లోకడుగు పెట్టాల్సొచ్చింది మమ్మల్నెంటేసుకోని.

''నేనెంత కష్టపన్నా పరవాలేదు గానీ పిల్లలు మాత్రం రవ్వంత గూడా కష్టపడగూడదు'' అనుకోని మాకు ఏ పనీ చెప్పేది కాదు. పొద్దున్నే నాలుగ్గంటలకల్లా లేసి వీధి కొలాయిలో నీళ్ళు పట్టుకోని రావడం మొదలు, రాత్రి మేమంతా అన్నం తిని పండుకున్నాక జాలాడిలో అంట్లగిన్నెలన్నీ శుభ్రంగా తోమి పక్కన బెట్టేంత వరకూ ప్రతి చిన్న పనీ అమ్మే చేసేది.

ఈ లోకముందే... దీనంత దుర్మార్గమైంది ఏదీ లేదు. పంచాంగాలు చూసి, జాతకాలు చూసి, లెక్కలేసి, సంభావనలు పుచ్చుకోని, ముహుర్తాలు పెట్టి పెండ్లి జేసినా నుదుటి కుంకుమ కలకాలం నిలబడక పోతే... చేసినోళ్ళనందరినీ వరసబెట్టి కొట్టకుండా బాధపడ్తున్నోళ్ళనే మొగున్ని మింగిందంటూ మరింత బాధపెడ్తాది.

ఒంటరి ఆడదంటే అందరికీ చులకనే. ఏ మాత్రం సందు దొరికినా కారుకూతలు కూయడానికి కాపలా కుక్కలెక్క కనిపెట్టుకోనుంటారు. అందుకే మా అమ్మకు ఈ లోకమంటే అసయ్యం. భయం.

మా అమ్మకు ఆత్మాభిమానం ఎక్కువ. ఛీ కుక్కా అంటున్నా ఏమక్కా అని దగ్గరకు పోయే రకం కాదు. ఎవరితోనూ ఒక్కమాట గూడా పడకుండా ముందునుండే జాగ్రత్త పడేది. అందుకే మాకు కర్నూల్లో అక్కడక్కడా బంధువులున్నా ఏ రోజూ మేము ఒకరింటికి పోయిందీలేదు. వాండ్లను మా యింటికి పిల్చిందీ లేదు. ఎదురింటోళ్ళనైనా సరే ఏనాడూ పన్నెత్తి పలకరించిందీ లేదు. ఇంటిబైట కూచోని వస్తాపోయే వాళ్ళను ఏనాడూ కన్నెత్తి చూసిందీలేదు. ఎవరైనా పలకరించినా ఏమ్మా అంటే ఏమ్మా అంతే.

మా అమ్మ ఎప్పుడూ బియ్యంలో రాళ్ళేరుకుంటానో, పొడులూ కారాలూ దంచుకుంటానో, సరుకులు శుభ్రం చేసుకుంటానో, అంట్లగిన్నెలు తోముకుంటానో, బట్టలు ఉతుక్కుంటానో, సరుకులు, కూరగాయలు తీసుకొస్తానో, మాకు తినడానికి ఏదో ఒకటి చేస్తానో... ఏ మాత్రం తీరిక లేకుండా ఒకదాని తరవాతొకటి పనులు చేస్తా వుండేది. ఎంత దూరమైనా నడుస్తాపోయేది. నడుస్తా వచ్చేది. ఒక సినిమాలా. షికారులా. ''రా... రా...'' అని ఎంటబడితే ఏ అరేడు నెలలకో ఒకసారి మా సీతక్కోళ్ళతో బాటు సినిమాకి పోయొచ్చేది.

మాకోసమని ఎవరన్నా వెదుకుతా వచ్చి ''కృష్ణవేణమ్మ ఇండ్లెక్కడ'' అనడిగితే మా వీధిలో ఎవరైనా సరే ''ఏమోబ్బా... ఆపేరుగలోల్లు మాకు తెలిసి ఈ వీధిలో ఎవరూ లేరు'' అనేటోళ్ళే గానీ, ''అదిగో అక్కడ'' అని చెప్పేటోళ్ళు కనబడరు. అంత గుట్టుగా బదికినాం.

ఆడదై పుట్టినాక మంగళసూత్రానికుండే విలువ మనిషికుండదు గదా... దాంతో మా చుట్టుపక్కలోల్లెవ్వరూ మా అమ్మను పేరంటాలకి, వ్రతాలకి శుభకార్యాలకు పిల్చరు. చుట్టాలు తప్పదనుకోని పెండ్లిండ్లకి మాత్రం పిల్చినా పొరపాటున శుభ సందర్భంలో ఎదురొస్తే ఎవరేమనుకుంటారో అని అమ్మ భయపడేది, అప్పటికప్పుడు మొగమ్మీద ఏమీ అనకపోయినా చాటుమాటున గొణుక్కుంటారు. నిజానికి పిలవకపోతే మాటొస్తాదని పిలుస్తారే గానీ, రాకపోయినా ఎవరూ చీమంతైనా బాధపడరు. అటువంటప్పుడు ఎందుకు పోవాల, ఎందుకు మాట పడాల అనుకోని మా అమ్మ పెండ్లిల్లకీ, పేరంటాలకీ పూర్తిగా దూరమైంది. కేవలం వాళ్ళ అక్క చెల్లెల్ల ఇండ్లలో పెండ్లిండ్లకి తప్ప బైటోళ్ళ దాండ్లకి పోయేది కాదు. దాండ్లలో గూడా ఏదో తప్పు చేసిన దాని మాదిరి చానా సార్లు తలొంచుకోని దూరం దూరంగా పోవడం నేనెన్నిసార్లు చూసినానో లెక్కేలేదు. వాళ్ళవరకెందుకు ఆఖరికి నేనూ, మాన్నా, మాక్కా గూడా ఏదైనా ముఖ్యమైన పనిమీద పోతావుంటే పొరపాటున గూడా ఎదురొచ్చేది కాదు.

మా అక్క పేరు శ్రీదేవి. ఇప్పుడంటే ఇద్దరాడపిల్లల తల్లయినాక అందరు తల్లుల్లెక్కనే బాగా మారిపోయింది గానీ అప్పట్లో బాపూ బొమ్మలెక్క చక్కని చుక్కలాగుండేది. మా బావ పేరు శ్రీనివాస్‌. చానా మంచోడు. మంచి కళాకారుడు గూడా. బొమ్మలేయడం, ఈల పాట పాడ్డం, సాహిత్యం చదవడం చేస్తుంటాడు. నేను రాసిన పిల్లలు చెప్పిన కతలు పుస్తకంలో సగం బొమ్మలు ఏసింది మా బావనే.

మా బావ మా అక్కకు మొగుడయి నాకు బావగాకముందు మా ఎదురింట్లోనే వుండేటోడు. మా ఇంటి బాల్కనీ లోంచి చూస్తే వాళ్ళింటి కిటికీ కనబడేది. వాళ్ళిద్దరి మధ్యా పరిచయం ఎట్లా ఏర్పడిందో గానీ అది ప్రేమగా మారి పెండ్లివరకొచ్చింది. మా అక్క ఒక మంచిరోజు చూసుకోని మా అమ్మతో ''మరియాదగా మా యిద్దరికీ పెండ్లి జేస్తావా... లేక తాడు తెచ్చుకోని స్టూలెక్కమంటావా'' అనే సరికి మా అమ్మ బిత్తరపోయింది. కాసేపటివరకూ వూపిరాల్లేదు. కానీ మాదీ వాళ్ళదీ ఒకటే కులం కావడంతో అంతగా అభ్యంతరపెట్టాల్సిన అవసరం లేక సరేననింది.

సాంప్రదాయం సాంప్రదాయమే గదా... దాంతో పద్ధతి ప్రకారం ఇంటికి రావడం, కట్నాలూ కానుకలూ మాట్లాడుకోవడం అన్నీ జరిగిపోయినాయి. ''మా కూతురి పెండ్లి మేమే జేసినాం, కాబట్టి మీ కూతురి పెండ్లి మీరే జేయాల. ఇప్పట్లో మేము ఇంకో పెండ్లి జేయలేం'' అన్నారు వాళ్ళు. పెండ్లంటే మాటలు కాదుగదా... అప్పటికి నేను పదో తరగతి చదువుతా వుంటే, మాన్న ఇంటర్‌ సెకండియర్‌. దాంతో ''ఎట్లరా భగవంతుడా'' అని కొద్ది రోజులు కిందా మీదా పన్నా అఖరికి సరే అనింది.

మేమున్నాం గదా నీకెందుకు భయమంటూ మా సీతక్కా, ఆమె మొగుడు రామానుజాచారీ... అట్లాగే మా రాజ్యలక్ష్మి టీచరూ, ఆమె మొగుడు సుబ్బరాయుడూ రెండు వైపులా రెండు స్తంభాల్లెక్క నిలబన్నారు. దాంతో పెండ్లికి షరాఫ్‌ బజార్‌ పైనున్న వెంకటాచలపతి కల్యాణ మండపం బుక్‌ చేసి, లయిట్లూ గియిట్లూ ఏపిచ్చి, దేనికీ తక్కువ కాకుండా రెండు స్వీట్లు, నాలుగు కూరలతో ఆ కాలానికి ఆహా అనేటట్లు అన్ని ఏర్పాట్లు చేసింది. మా అమ్మ తినీ తినక ఒకొక్క పైసా తేనెటీగలెక్క దాచి పెట్టినేది మాక్క పెండ్లి కోసమే గదా... దాంతో అప్పులు చెయ్యకుండా... ఎవరి దగ్గరా చేయి చాచకుండా అన్నీ అమిరిపోయినాయి.

మాకెవరూ తెలీకపోవడంతో మా అమ్మనే కర్నూల్లో, నంద్యాల్లో, పాణ్యంలో బంధువులందరికీ రమ్మని కార్డులిచ్చొచ్చింది. దూరమున్నోళ్ళందరికీ పోస్టు చేసింది. స్నేహితులందరూ వచ్చి తలా ఒక చేయేయడంతో ఏ పనీ ఎక్కడా ఆగకుండా పరుగులు పెట్టినాయి. దాంతో బాటు మా బావోళ్ళు గూడా అది కావాలిదికావాలని ఎక్కడా ఎటువంటి పేచీ పెట్టలేదు.

పెండ్లిలో మా అక్క పక్కన మండపంలో కూచోని కన్యాదానం చేయాలగదా. మాకు నాయనలేడు గాబట్టి మా అమ్మ పైకెక్కగూడదంట. దాంతో మా హైదరాబాదు శివయ్య బాబాయికి ముగ్గురూ మగపిల్లలే తప్ప ఆడపిల్లల్లేరని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంకొకరికందించినట్టు ఆయనను, మా శాంత పిన్నిని కన్యాదాన ఫలం పొందడానికి పెండ్లి మంటపం ఎక్కిచ్చింది. తాను మాత్రం చకచకా తిరుగుతా అన్నీ సమయానికి అందరికీ సరిగ్గా అందుతున్నాయో లేదో కనుక్కుంటా, వచ్చినోళ్ళందరినీ పలకరిస్తా పెండ్లి మంటపం కిందనే వుండిపోయింది.

సరిగ్గా పెండ్లి సమయం దగ్గర పడింది. మా అమ్మ నా పక్కనే వుంది. అక్షింతలు పెండ్లికొడుకు పెండ్లి కూతుర్ల తలల మీద వ్రాలడానికి అందరి చేతుల్లోనికి వచ్చేసినాయి. పెండ్లి కొడుకు పైకిలేసి తాళి బొట్టు పైకెత్తి అన్ని వేపులా చూపిస్తా వున్నాడు. భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు పెద్దగా మోగించడం కోసం సిద్ధమై అయ్యవారి సైగ కోసం ఎదురు చూస్తా వున్నాయి. అంతవరకూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న జనాలంతా మాటలాపేసి చిరునవ్వుతో వేదిక మీదకే చూస్తావున్నారు,. నేను బెరబెరా అక్షింతలు పిడికిలి నిండా తీసుకోని ''మా... అక్షింతలు'' అంటూ పక్కకి తిరిగి చూస్తే అమ్మలేదు.

''ఇదేందబ్బా... ఇంతసేపూ ఇక్కన్నే వుండెనే... సమయానికి యాడికి పోయింది'' అని చుట్టూ చూస్తే దూరంగా ఒక్కతే బెరబెరా మెట్లెక్కుతా మిద్దెపైకి పోతా కనబడింది. దాంతో ''అరెరే... ఇదేంది... తాళి కట్టే సమయంలో చూడకుండా'' అని వురుక్కుంటా పోయి అమ్మను చేరుకున్నా. అప్పటికే అమ్మ మిద్దెపైకి చేరుకోనింది.

నేను గసబెడతా ''మా... మా... తాళికడ్తా వున్నాడు. దా... తొందరగా... అక్షింతలేసి వద్దాం'' అన్నా.

''నువ్వేసి రాపోరా... నాక్కొంచం పనుందీడ'' అనిందమ్మ అటువేపు తిరిగి.

నాకు కోపమొచ్చి ''ఏందిమా... ఎప్పుడూ... పని పని అంటావ్‌. ఒక ఐదునిమిషాలాగితే కొంపలేం మునిగిపోవు గానీ... దా... పోదాం'' అన్నా.

ఆ మాటలకు అమ్మ కాసేపు మాటలు బుడుక్కోని నెమ్మదిగా ''అది కాదురా... నేనక్కడికి రాగూడదు. తాళి కట్టేటప్పుడు చూడగూడదు. అది మీ అక్కకు మంచిదిగాదంట.. అందరూ చెప్పినారు. నువ్వుపో'' అనింది.

నేనా మాటలేమీ పట్టిచ్చుకోకుండా ''ఏందిమా... ఎవడో ఏందో చెబితే నువ్వు గూడా... ఏమీ కాదులే... దా పోదాం... అవన్నీ వుత్త మాటలు... వుత్త నమ్మకాలు'' అన్నా.

అమ్మ అట్లాగే అక్కడే నిలబడి ఇంచుగూడా కదలకుండా ''నమ్మకముందా... లేదా... అనేది కాదురా ముఖ్యం. నేను చూడకపోతే నా కూతురి జీవితం చల్లగా వుంటాదంటే నాకంతకన్నా ఏం కావాల. నేను పన్న కష్టాలు నా కూతురు పడకుంటే చాలు'' అనింది కండ్లలో నీరు దాచిపెట్టుకుంటూ.

కింద ఒక్కసారిగా మంగళవాయిద్యాలు మారు మ్రోగినాయి. నేనూ మా అమ్మ అట్లాగే పైన్నే నిలబడిపోయినాం.