ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దేశభక్తి గేయాలు స్వాతంత్య్రోద్యమంలో అనేకం పుట్టుకొచ్చాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరి కొన్ని సజీవంగా ఉన్నాయి.అయినా గురజాడవారి 'దేశభక్తి 'గీతం కలకాలం నిలిచిపోయింది. గురజాడ 1862లో జన్మించారని చెప్పుకున్నాం. 1857 నాటికే దేశస్వాతంత్ర్యంకోసం బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్రయుద్ధం జరిగింది. అదే ప్రజలలో దేశాభిమానంతో, దేశ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్ష పెరిగింది. మొదటి స్వాతంత్య్రోద్యమం ( అదే సిపాయిల తిరుగుబాటు )అనంతరం భారతదేశాన్ని కంపెనీ పాలన నుండి విక్టోరియా మహారాణి పాలన క్రిందకు భారతదేశ పాలన క్రింద తీసుకు రావడం జరిగింది. అప్పటికి ఇంకా గురజాడ పుట్టనేలేదు.ప్రథమ స్వాతంత్య్ర యుద్ధం జరిగిన అయిదు సంవత్సరాలతరువాత అంటే 1862లో గురజాడ జన్మించారు. తను జన్మించేనాటికే బ్రిటీష్ పాలనలో దేశ ప్రజలు అనేక బాధలుపడుతున్నారు. తనకు తెలిసీ తెలియని వయసు నుండే పరాయి పాలనలో ప్రజలు పడే బాధలు కళ్ళారా చూసే వాడు. దేశంలో గల చిన్న రాజ్యాలను కలుపుకుని ఏకీకృతపాలన క్రింద బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వ పాలనా అవసరాల కోసం మెకాలే ప్రవేశ పెట్టిన ఆంగ్ల భాష విద్యావిధానం దాని ప్రభావం భారతీయులలో చాలామంది పై పడింది. అందులో గురజాడవారు కూడా ఉన్నారు.తను మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే (అంటే గు‌రజాడ కు ఇ‌రవై సంవత్సరాల వయసులోనే ) " కుక్కు" అన్న ఇంగ్లీషు పద్యాన్ని వ్రాయగలిగారు. తన 21వ సంవత్సరంలోనే " సారంగధర " అన్న ఇంగ్లీషు పద్యకావ్యం వ్రాయగలి గారు. " సారంగధర " రచన అనేకమంది ప్రముఖులచే ప్రశంసింపబడ్డది. ఆంగ్లభాషలో 20 సంవత్సరాలనాటికే అమితమైన పరిజ్ఞానాన్ని సంపాదించాడని అర్థమవుతుంది.1910లో ముత్యాల సరములు, ఇతర కవితా గీతాలు వ్రాయడం జరిగింది. " దేశభక్తి " శీర్షికతో 14 stanzas కలిగిన గీతాలు గురజాడవారు వ్రాసారు. ఈ శీర్షికతో పాటు " దేశమును ప్రేమించుమన్నా" అన్న శీర్షిక కూడా ఉంది. ఇందులో మొదటి గీతం " దేశమును ప్రేమించు మన్న/మంచి అన్నది పెంచుమన్నా/వొట్టిమాటలు కట్టిపెట్టోయి/గట్టి మేల్ తలపెట్ట వోయి !" " పాడిపంటలు పొంగిపొర్లే/ దారిలో నువు పాటుపడవోయి/తిండి కలిగితే కండకల దోయి/కండకల వాడేను మనిషోయి !" " యీసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయి?/జల్దుకొని కళలెల్ల నేర్చుకు/దేశి సరకులు నించవోయి! " దేశాభిమానము నాకు కద్దని/వట్టి గొప్పలు చెప్పుకోకోయి/పూని యేదైనాను నొకమేల్/కూర్చి జనులకు చూపవోయి! " పరుల కలిమికి పొర్లియేడ్చే/పాపికెక్కడ సుఖముకద్దోయి?/ఒకరి మేల్ తన మేలనెంచే/ నేర్పరికి మేల్ కొల్లలోయి ?" ఇతరుల యొక్క కలిమికి పొర్లియేడ్చే పాపికి సుఖమెక్కడ ఉంటుందని గురజాడ ప్రశ్నించాడు. ఇలా ఏడ్చే ఈర్ష్యా పరులు ఆరోజుల వరకూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి దుఃఖబాగులుంటారు. అటువంటి వారికి గురజాడ ఏమని చెబుతాడంటే ఒకరి మేలును తన మేలుగా నెంచే నేర్పరితనం గలవానికి కొల్లలు కొల్లలుగా (అనేక విధాలుగా) మేలు జరుగుతుందిఅంటాడు. ఇలా గురజాడ హితబోధ చేసినా నీచుడు, ఈర్ష్యా పరుడు తన గుణాన్ని మార్చుకోలేడు. " స్వంత లాభం కొంత మానుకు/పొరుగు వాడికి తోడుపడవోయి/దేశమంటే మట్టి కాదోయి/ దేశ మంటే మనసులోయి?" స్వంత లాభం కొంత మానుకొనితోటివాడికి అదే పొరుగు వాడికి సాయపడమంటాడు. దేశమంటే మట్టికాదు. దేశమంటే మనుషులతో కూడుకు న్నది. మానవత్వపు విలువలతో కూడుకున్నది. దయ, జాలి, కరుణ తోటి మనిషియందు చూపాలంటాడు గురజాడ. కానీ స్వార్థపరునికి ఆ జ్ఞానం ఎక్కడ ఏడ్చి ఛస్తుంది. దేశంలోని మానవులంతా ఒకరినొకరు కలిసి అన్నదమ్ముల వలే అన్ని జాతులవారు, మతాలవారు సరదాగా కలసి మెలసి మెలగాలి. మతం వేరైతే ఏం పోయింది. మనుషులంతా ఒక్క మనసుతో ఉంటే మానవ జాతి అంతా పెరిగి పెద్దదై లోకంలో కీర్తి ప్రతిష్టలతో రాణించునని గురజాడ చెబుతాడు. దేశము అనేది మహా వృక్షము లాంటిది. మానవులంతా కష్టపడి పంటలు పండించాలి. దేశమంటే అందరికీ అభిమానం హృదయంలో మొలకెత్తాలి అంటాడు గురజాడ. అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే రీతిలో " దేశ భక్తి" గేయాలను గురజాడ వ్రాసాడు. విశ్వమానవ ప్రేమను చాటి చెప్పారు. తన దేశభక్తి గేయానికి ఎల్లలు లేవు. జాతి , మత , కుల, ప్రాంతీయ విభేధాలులేవు. విశాలమైన భావము కలిగి ఉన్న గురజాడ, జాతి జాడ్యంతో పడిచ్చేవారికి కనువిప్పు కలిగించాడు. కుళ్ళుబోతుగాళ్ళకు, ఈర్ష్య, ద్వేషాలతో పడిచచ్చేవాళ్ళకు కళ్ళు పచ్చబడేటట్టు సుతిమెత్తగా చీవాట్లు బెట్టి ఈ విశాల విశ్వంలో నలుగురుతో కలసిమెలసి జీవించండని హితవుపలికాడు. ఇక సినారేగారు వ్రాసిన ఆధునికాంధ్ర కవిత్వం ( పేజీ.232)లో దేశభక్తిని గూర్చి గురజాడవారు గిడుగు సీతాపతిగారితో " చూశావా ! ఈ దేశభక్తీ , ఈ స్వదేశాభిమానం, మన హృదయాన్ని ఎంత సంకుచితమైనదిగా చేస్తుందో. నలుగురితో పాటు నేనును, మన భారతదేశం -- అందులోమన తెలుగు దేశం -- అందులో మన బ్రాహ్మణ జాతి ---అందులో మన ఆరు వేల నియోగి శాఖ అని ఎంచుకుంటూదురభిమానం పొందుతూ ఉంటాను. ఈ విధంగా మన మన అభిమానాన్ని అంతకంతకూ సంకుచితం అయ్యేటట్టు చేస్తుంది ఈ దేశాభిమానం. ఎంతో విశాల హృదయంతో చూస్తేగానీ ఈ విశ్వమంతా మనదే అనే సర్వజనీనమయిన అనురాగాన్ని పొందలేము " అని అంటారు. గురజాడ ఎంతటి విశాలమైన భావంతో " దేశ భక్తి" గేయాన్ని వ్రాసాడో తెలుస్తోంది. అందుకే ఈ గేయం తెలుగువారి మనసులనే గాక దేశ, విదేశాల ప్రజల మనసులను కూడా దోచింది. (సశేషం) శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.
August 2, 2020 • T. VEDANTA SURY • Memories