ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దేశాభివృద్ధి లో కార్మికుల పాత్ర చాలా కీలకమైనది. అది దృష్టిలో పెట్టుకొని జైజవాన్,జైకిసాన్ పక్కనజై కార్మిక్ ను చేర్చి వందనాలు - వందనాలు పాటరాశాను.1995 మే నెల ఆంధ్రబాల పిల్లల పత్రిక లో వచ్చింది. ఆ గేయం చూద్దాం.//దేశప్రజల కడుపు నింప/హలం పట్టి మట్టి లోన/పంటలెన్నొపండించెడి/రైతన్నకు వందనం//దేశమాత రక్షణకై/శత్రువెవడు రాకుండా/సరిహద్దులు కాపాడెడి/సైనికునకు వందనం//దేశ సొత్తు వృద్ధిచేయ/శ్రమశక్తితో చెమటూడ్చి/యంత్రాలను నడిపించెడి/కార్మికునకు వందనం//మువ్వన్నెల జెండా వలె/ఈ మువ్వురి జీవితాలు/వెల్లి విరిసి వెలగాలని/వేడ్క మీర కాంక్షిద్దాం//ఈ పాటలజెండా లోని మూడు రంగులతో జవాను,కిసాను, కార్మికులను పోల్చాను.మూడు రంగుల జెండారెప రెప లాడాలంటే ఈ ముగ్గురు జీవితాలు బాగుండాలి కదా.అప్పుడే జెండాకు పదిలం. అదే సంవత్సరం జూన్ నెల 10 వ తేదీ ఆంధ్రప్రభశనివారం అనుబంధం చిన్నారి లో పాలవెల్లి పాటశీర్షికన నేస్తం అనే బాలగేయం వచ్చింది. ఈ గేయంలో ఒక పాప చేష్టలు వర్ణించాను. పాపతో ఊసులు, పాపతో నవ్వులు,పాపతో నడకలు,పాపతో ఆటలు,పాపతో పాటలు ఏవైనామన మనస్సును ఆహ్లాదపరిచేవే.ఆ గేయంచూద్దాం మరి! //ఊసులాడగ నేను/ఉయ్యాల దరిచేర/ఊ కొడుతు మా పాప/ఉరికురికి ఆడింది//చిరునవ్వు తో నేను/పలుకరించ గానే/అందాల మా పాప/నను చూసి నవ్వింది//నడక నేర్పగ నేను/గడప దిగి దరి చేర/తడబడక మా పాప/చకచక నడిచింది//బంతి విసిరీ నేను/ఎదురుగాదరి చేర/బేటుతో మా పాప/బంతినే కొట్టింది//పాట పాడగ నేను/స్వరమెత్తి దరి చేర/గొంతెత్తి మా పాప/రాగాలు పలికింది//పాపలందరి లోనుమా పాప గడసరిది/మా పాప స్నేహమును కట్టగారారండి//1995 జూన్ నెల లోనే సంపదలు అనేగేయం ఆంధ్ర బాల పత్రిక లో వచ్చింది. ఈ గేయంలో ప్రకృతి లాగే బడులూ గుడులు కూడా అందవవ్వాలని కాంక్షించాను. మరి ఆ గేయమేమిటోచూద్దామా!//రాలే చినుకులు/పారే ఏరులు/వీచేగాలులు/పూచే పూవులు/అందరివీ అవి/అందరికీ అవి//ఉషోదయాలు/మబ్బుల నీడలు/తారల తళుకులు/వెన్నెల వెలుగులు/అందరివీ అవి/అందరికీ అవి//వేణు నాదములు/కోయిల పాటలు/దేవుని గుడులూ/బాలల బడులూ/అందరివీ అవి/అందరికీ అవి//మరొక గేయం పిచ్చుకలు - పాప ! ఈ గేయం ఆంధ్ర బాల పత్రికలోవచ్చింది. సంచిక1995 జూలై నెలది! వాకిట్లోవాలే పిచ్చుకలను చూసి సరదా పడని వారెవరుంటారు?అందరూ సరదా పడతారు. పిల్లలైతే మరీను! ఆ అందమైన దృశ్యం రాస్తూచివర నీతి వాక్యం కూర్చాను.ఆ గేయం చూద్దామామరి!//వాకిట్లో గింజలను/విసరగానూ//రంగు రంగుల పిచ్చుకలు/నేల వాలెను//పిచ్చుకలనుచూసి పాప/ గంతు లేయగా//అచ్చెరువున పిచ్చుకలు/తలలు ఎత్తెను//చపల బుద్ధితో పాప/కర్ర పట్టగా//రివ్వుమంటు పిచ్చుకలు/ఎగిరి పోయెను//ఆదరిస్తె ఎవ్వరైన/దరికి వత్తురు//అదిలిస్తే ఎవ్వరైన/పారి పోదురు//ఇవండీ ఈరోజుగేయాలు! ఈ గేయాలు పాడుకోడానికి వీలుగా చదువుకోడానికి హాయిగా వుండేటట్టు రాయడానికి ప్రయత్నించాను. సాధ్యమైనంత వరకు మాత్రాఛందస్సు అమలు పరిచాను.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835.
August 11, 2020 • T. VEDANTA SURY • Memories