ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
దేశ భక్తులు. (పిల్లల కథ) రచన;బి.వి.పట్నాయక్
October 27, 2020 • T. VEDANTA SURY • Story

పాఠశాల చివర పీరియడ్ అయిపోవడంతో పిల్లలందరూ వరుస క్రమంలో వచ్చి మైదానంలో నిలబడ్డారు. ఉపాద్యాయుల సమక్షంలో జనగణమన జాతీయ గీతం పాడేందుకు ఏకాగ్రతతో సిద్ధపడ్డారు.
          ఇంతలో ఆరో తరగతి అబ్బాయి నాకు ఐదు రూపాయల బిళ్ళ దొరికింది అంటూ ప్రధానోపాధ్యాయుడికి తెచ్చి ఇచ్చాడు.
            ఆ అబ్బాయి  నిజాయితీని ప్రశంసిస్తూ అభినందించారు ప్రధాననోపాధ్యాయుడు .
                మిగిలిన ఉపాధ్యాయలు విద్యార్ధులు చప్పట్లతో జేజేలు పలికారు.
       '  ఐదురూపాయల బిళ్ళ ఎవరు పోగొట్టుకున్నారు? ' అడిగారు ప్రధానోపాధ్యాయుడు.
         'నాది నాది ' అంటూ పది మంది విద్యార్థులు చేతులు ఎత్తారు.
          అందరూ ఆశ్చర్యపోయారు.
          'దొరికినది  ఒక్క ఐదురూపాయలు పోగొట్టుకున్నవారి సంఖ్య పదిమంది ఇది ఎలా సాధ్యం? అయినా డబ్బు పట్ల ఇంత నిర్లక్ష్యం ఏమిటి? పోగొట్టుకున్నావారంతా నిర్లక్ష్యానికి శిక్షగా పదేసి రూపాయలు పేద విద్యార్ధుల నిధికి అపరాధ రుసుముగా చెల్లించండి హుకుం జారీచేశారు ప్రధానోపాధ్యాయుడు.
             చేతులెత్తిన పిల్లలు కంగుతిన్నారు. సరదాకి అలా చేతులెత్తాం బిక్కమెుగాలేసుకుంటూ సంజాయిషీ చెప్పారు.
        ' ససేమిరా' అన్నారు ప్రధానోపాధ్యాయుడు.
       ఈసారి తప్పును మన్నించండి అంటూ బతిమాలడం ప్రారంభించారు ఆ పదిమంది పిల్లలు.
          'అబద్ధమాడడం తప్పు. చిన్నప్పుడే ఈ విషయం పట్ల నిబద్ధత లేకపోతే పెద్దయ్యాక మితిమీరిన అబద్ధాలతో కోరి చిక్కులు తెచ్చుకుంటారు. ఇక నుండి అబద్థానికి ఆమడ దూరంలో ఉంటామని ప్రతిజ్ఞ చేయండి' అన్నారు ప్రధానోపాధ్యాయుడు.
          తోటి పిల్లల ముందు సిగ్గుతో తలదించుకున్నారు ఆ పది మంది పిల్లలు. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్టు ప్రతిజ్ఞ చేశారు.
            ఇప్పుడు పోగొట్టుకున్నవారు ముందుకు రండి అన్నారు ప్రధానోపాధ్యాయుడు
      ' ఆ    ఐదు రూపాయలు నేనే పోగొట్టు కున్నాను' అంటూ  ఒక అమ్మాయి ముందుకు వచ్చింది.
         ' ఇంతకు ముందు నువ్వేమి చేయి ఎత్త  లేదు? 'అని దీర్ఘంగా ప్రశ్నించారు ప్రధానోపాధ్యాయుడు.
         ' ఇంత మంది చేతులెత్తేసరికి నా ఐదు రూపాయల బిళ్ళ పోయిందని చెప్పిన ఎవరు నమ్మరని చేయి ఎత్తలేదు వాళ్ళ మాటలు అబద్ధమని మీరు రుజువు చేశాక నాకు ధైర్యం వచ్చింది ' నిజాయితీతో చెప్పింది  ఆ అమ్మాయి.
       ' నిజమే సార్! పెన్సిలు కొనుక్కోడానికి తెచ్చుకున్న సంగతి మాతో చెప్పింది ఈ అమ్మాయి' సాక్ష్యం చెప్పారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు.
        ' చూశారా పిల్లలూ! అబద్థం ఎంత పని చేసింది. నిజాన్ని చంపే ప్రయత్నం చేసింది. నిజాయితితో దొరికిన ఐదు రూపాయలు అందజేసిన విద్యార్థి ఈ సంఘటన చూసి నేనెందుకు నిజాయితీగా ఉండాలనే తలంపుకు వస్తే? నిజాయితీని నమ్మిన మనుషులు కరువవుతారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మీరు నిజాయితీతో నడుచుకుంటే భవిష్యత్తులో నిజాయితీ బతుకుతుంది. ఈ రోజు ఆ అమ్మాయికి జరిగిన అనుభవం రేపు మీకు ఎదురైతే?' విద్యార్ధులను ఆలోచింప జేసే ప్రశ్న వేశారు ప్రధానోపాధ్యాయుడు.
        విద్యార్ధులంతా తెల్లమెుగాలేశారు.
          'అవినీతి, అడ్డదార్లు చాల ప్రమాదకరమైనవి. అవి నిజాయితీని చంపే గుణాన్ని కలిగి ఉంటాయి. వాటికి దూరంగా ఉంటూ నిజాయితీని బతుకించుకోనే దేశభక్తులుగా మీరు నిలవాలి. దేశం మిమ్మల్ని చూసి గర్వపడాలి ' చెప్పారు ప్రధానోపాధ్యాయుడు.
           తప్పు తెలుసుకున్న పిల్లలు ఇటువంటి తప్పుడు పనులు చేయమని ప్రధానోపాధ్యాయునికి మాట ఇచ్చారు.
       జనగణమన జాతీయ గీతం పాడుతూ దేశభక్తులుగా నిలవాలని నిర్ణయించుకున్నారు పిల్లలు.