ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నమో వెంకటేశా (మీ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపే సరదా కథ)- డా.ఎం.హరి కిషన్ - 9441032212.
September 17, 2020 • T. VEDANTA SURY • Story

గుత్తోంకాయ పేరింటానే నోట్లో నీళ్ళూరినట్లు పాణ్యం పేరినడం ఆలస్యం గుండె లోపల్నించి సంతోషం పొంగుకొచ్చి మనసు ఉయ్యాలలూగుతాది. ఎందుకంటే పాణ్యం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పుడు సెలవులు ఇట్లా రావడం ఆలస్యం మేము పెట్టే బేడా ఎత్తుకొని పాణ్యంలో అట్లా వాలిపోయేటోళ్ళం. మన ఆచారం ప్రకారం ఆడపిల్లలు కాన్పు కావలసింది పుట్టింట్లోనే గదా... అట్లా పాణ్యం నా పుట్టినూరయింది.
నాకూహ వొచ్చినాక చానాకాలం వరకు కర్నూలు తర్వాత నాకు తెలిసిన ఏకైక వూరు పాణ్యమొక్కటే. బంధువుల ఇండ్లకీ, పెండ్లిండ్లకీ, పేరంటాలకీ ఎక్కడికీ మా అమ్మ తీస్కపోకపోవడంతో మాకు మిగిలింది అమ్మమ్మోళ్ళ వూరే. అందుకే పాణ్యమంటే ఏదో ప్రేమ. గుత్తొంకాయ పేరింటానే నోట్లో నీళ్ళూరినట్లు పాణ్యం పేరినబడ్డ మాలస్యం గుండె లోపల్నుండి ఏదో పొంగుకొచ్చి మనసు వుయ్యాలలూగుతాది.
బస్టాండు నుండి మూడు మైళ్ళ దూరముండే వూరికి జట్కాబండెక్కి, గుర్రపుడెక్కల లయబద్ధమైన చప్పుళ్ళ మధ్య... రెండువైపులా పరుగులు తీసే పచ్చని పండ్లతోటలను చూసుకుంటా పోవడం, రాములోరి దేవాలయంలో ఎప్పుడెప్పుడు ప్రసాదాలు పెడతారా అని ఎదురు చూడ్డం, ఎండాకాలం ఎండిపోయిన చెరువులో సాయంకాలం పూట కబడీ ఆడ్డం, మునగ బెండు కట్టుకోని బాయిలో ఈతలు కొడ్తా ముట్టేసుకునే ఆటలు ఆడ్డం, ఇంటి ముందున్న మంగలోళ్ళ పిల్లల్తో కల్సి గోలీలాట, బొంగరాలాట, చిల్లంగోడె ఆడ్డం, కంది చేలలో ఎండిన కందికాయలు రాలేటట్టు కొట్టి ఒట్టి కట్టెను పొయ్యిలోనికని ఇంటికి తీసుకురావడం, సుంకులమ్మ గుళ్ళో మా పిన్నోళ్ళకి వడిబియ్యాలు పెట్టేటప్పుడు తెగిపడే కోళ్ళ తలలు భయం భయంగా చూస్తూ మొక్కుకోవడం, చీకటి పడగానే చెంబు పట్టుకోని సావాసగాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వూరిబైటకి కళ్ళాలు దాటి పోయిరావడం... ఒక్కటని కాదు... అన్నీ కండ్ల ముందు సినిమా రీల్లలెక్క గిర్రున తిరుగుతాయి.
సినిమా రీల్లంటే గుర్తుకొస్తా వుంది. మీకో ముచ్చట చెప్పాల. మా పాణ్యంలో వూరి బైట డొంకదారిలో ఒక సినిమా హాలుండేది. సినిమా హాలంటే ఇప్పట్లాగా చుట్టూ గోడలు, పైన కప్పు, మెత్తని కుర్చీలు ఇట్లా వూహించుకోకండి. అదెట్లా వుండేదంటే... పైన ఆకాశం కనిపిస్తా వుండేది. ప్రొజెక్టరు గదికి తెరకు మధ్య ఖాళీ జాగా వుండేది. ప్రొజెక్టరు గది నానుకోని కుర్చీలు రెండు వరుసలు, దాండ్ల తర్వాత రాతి బెంచీలు మూడు వరుసలు, ఆ తర్వాతంతా నేల. సినిమా ప్రారంభమయ్యే ముందు తెర కట్టేటోళ్ళు. బొమ్మేస్తే బైట ఎవరికీ కనబడకుండా చుట్టూ ఎత్తైన తడికలుండేవి.
నేల పావలా... బెంచీ అర్దరూపాయ... కుర్చీ ముప్పావల.
కింది తరగతి ముప్పావలాతో మొదలయ్యేది. పాణ్యానికి వచ్చే ముందు నేను కర్నూల్లో సినిమాలు అస్సలు చూసేటోన్ని గాదు. ముప్పావలా పెట్టి ముష్టి ఒక సినిమా చూసే బదులు పాణ్యంలో మూడు సినిమాలు చూడొచ్చు గదా అని డబ్బులు దాచి పెట్టుకునేటోన్ని.
నగరాల్లో పనీపాటాలేనోళ్ళు మస్తుమందుంటారు కాబట్టి, పగలూ రాత్రీ అనే తేడా లేకుండా టాకీసులు నిండిపోతా వుంటాయి. కానీ పల్లెటూర్లలో అట్లా కాదు గదా... దాంతో సినిమా ఆడేది రాత్రిపూటనే... అదీ ఒకే ఒక ఆట. పది గంటలకు. ఎంత లేచిపోయిన సినిమా ఐనా సరే మూడు రోజులు దాటి సస్తే ఆడదు.
మొదటి రెండ్రోజులూ ఫుల్లు, మూడో రోజు డల్లు, నాలుగో రోజు నిల్లు.
ఏదైనా బొమ్మ వారం రోజులు ఆడిందంటే అది పెద్ద బంపర్‌ హిట్టు కిందనే లెక్క.
సినిమా చూస్తుండగా వానొచ్చినా, కరెంటుపోయి మళ్ళా రాకపోయినా డబ్బులిచ్చి లోపలకు పోయినోళ్ళ సంగతేమోగానీ, వూరు వూరంతా సంబరం సంబరం గాదు.
\ఎందుకంటారా...
టాకీస్‌లో టికెట్లుండేవి గావు. లోపలికి పోయే కాడ ఒకడు నిలబడి డబ్బుల్తీసుకోని పంపిస్తా వుంటాడు. జనరేటర్లు గినరేటర్లు అప్పుడు లేవు గదా... దాంతో కరెంటు పోతే వస్తాది వస్తాదనుకుంటా చానా సేపు ఎదురు చూసి ఇహ లాభం లేదనుకున్నాక వుసూరుమంటూ జనాలు కాళ్ళీడ్చుకుంటా తిరిగొచ్చేటోళ్ళు.
అదే గనుక మధ్యలో వాన చంపిందంటే ఆడోళ్ళు మొగోళ్ళు పిల్లా పాపను సంకనేసుకోని, పంచలు పైకెగ్గట్టి, కుచ్చిళ్ళు ఎగదోపి, నెత్తిన తువ్వాలో, చెంగో కప్పుకోని వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీసేటోళ్ళు.
అట్లా పోయేటోళ్ళకు తిరిగి డబ్బులియ్యాల గదా... టాకీసోడు అట్లా ఇయ్యకుండా తర్వాత రోజు బొమ్మ ఫ్రీగా ఏసేటోడు. అంతే... ముందు రోజు సినిమాకి డబ్బులిచ్చి పోయినోళ్ళేగాక... వూరు వూరంతా మూలనున్న ముసలోల్లతో సహా ఎగబడి వచ్చేటోళ్ళు. అంతే... ఆ రోజుతో అదే మొదటి ఆటయినా సరే... ఆ సినిమాకి నూకలు సెల్లిపోయినట్లే. అందుకే వాన వచ్చినా, కరెంటు పోయి మళ్ళా రాకపోయినా వూరంతా అంత సంబరం.
నేను పాణ్యంలోనే వున్న మా పెద్దమామ కొడుకుల్తోగాని, అక్కడికొచ్చిన మా పిన్ని కొడుకుల్తో గానీ కల్సి మొదటిరోజు కాకుండా రెండోరోజో... మూడోరోజో... దుప్పటి మడ్చి సంకలో బెట్టుకొని పోయేటోన్ని. టాకీసులో నేల మీద దుప్పటి పర్సుకోని, హాయిగా పన్నుకోని, కొలుమీద కాలేసుకోని, ఇంటి కాన్నించి తీసుకపోయిన మురుకులో, గట్టాలో నముల్తా చూస్తా వుండేటోన్ని. ఆ మజానే వేరు. టౌన్లో నాలుగ్గోడల మధ్య వుడకకి చెమటలు కారిపోతావుంటే ఇరుక్కోనిరుక్కోని సినిమా చూసే నాకు ఇది భలేగనిపించేది. బాత్‌రూంలో స్నానం చేయడానికి, చెరువులో స్నానం చేయడానికి ఎంత తేడా వుంటాదో అంత తేడా వుండేది.
కొత్త సినిమా రిలీజవగానే సాయంకాలం గుర్రపు బండికి రెండు వైపులా వాల్‌పోష్టర్లు తగిలిచ్చి, తప్పెట కొట్టుకుంటా, మధ్య మధ్యలో ''రండి... చూడండి... నేడే విడుదల'' అంటూ సినిమా గురించి మైకులో అరుచుకుంటా తిప్పేటోళ్ళు.
ఆ తప్పెట శబ్దం వినబడ్డమాలస్యం మేం కట్టు తెంపుకున్న కోడె దూడల్లా ఎగిరి బైటకు దూకి... నోరెళ్ళ బెట్టుకోని ఆ వాల్‌పోష్టర్నే చూస్తా వెంటబడేటోళ్ళం. వాళ్ళు మధ్య మధ్యలో సినిమా గురించి రాసిన పేపర్లు గాలిలోకి ఇసిరేసేటోళ్ళు. దాండ్ల కోసం కొట్లాట కొట్లాట గాదు... కిందా మీదా పడి ఒకరినొకరు దొబ్బుకోని తన్నుకొనేటోళ్ళం. పేపరు దొరికిందా ప్రపంచాన్ని గెల్చినంత సంబరం. రయ్యిన తూనీగలెక్క గాల్లో తేలిపోతా ''మా'' అంటూ ఇంట్లో దూరి విజయగర్వంతో అందరికీ దాన్ని చూపించి భద్రంగా నెమలికన్నులా దాచిపెట్టుకొనేటోన్ని.
పల్లెటూరు గదా... జనాలంతా పొలాలకి పోయి... కిందా మీదా పడి పని చేసి... సాయంకాలానికి నీరసంగా ఇళ్ళు చేరి మంచమ్మీద అలాగే కాసేపు వాలిపోయేటోళ్ళు. రాత్రి అన్నం గిన్నం తిని సినిమాకు పోయేటోళ్ళు.
సినిమా మొదలు పెట్టడానికి సరిగ్గా ఒక అరగంట ముందు టాకీసులో మైకు పెట్టేటోళ్ళు. అంటే అది ఫస్ట్‌ బెల్లన్నమాట. సినిమాకి పోవాలనుకునేటోళ్ళంతా తయారు కావడం మొదలు పెట్టేటోళ్ళు. అలా ఒకొక్క పాటా అయిపోతా... అయిపోతా... ''నమో వెంకటేశా... నమ నమో తిరుమలేశా'' అని ఒక పాటొచ్చేది. అది గాలిలో అలా అలా అలలు అలలుగా తేలిపోతా వూరినంతా క్షణాల్లో చుట్టుముట్టుకునేది.
అంతే... భూమి బద్దలయిందా అన్నట్లు జనాలు అదిరిపడేటోళ్ళు. పుట్టల్లోంచి చీమలు బిలబిలమని బైటకొచ్చినట్లు ఎక్కడెక్కడి జనాలు చేస్తున్న పనులు చేస్తున్నట్లే వదిలేసి, పిల్లోల్లను సంకనేసుకోని బెరబెరబెర వీథుల్లోకొచ్చి డొంక దారిలో కలిసేటోళ్ళు. ఒక్కసారిగా ఆ దారంతా దుమ్ము ఆకాశానికెగిసేది.
అది నడాకా కాదు. వురుకూ కాదు... మారధానే.
ఎందుకట్లా అందరూ చించుకోని పోతా వుంటారంటే ఆ పాట సరిగ్గా సినిమా పడే ముందు వస్తాదన్న మాట. పాట అట్లా అయిపోడమాలస్యం ఆట ఇట్లా మొదలయ్యేది. పాట పూర్తయ్యేలోగా జనమంతా దాదాపు చేరిపోయేటోళ్ళు.
ఇప్పటికీ... ఎప్పుడన్నా... ఎక్కడన్నా... ఆ పాట వినబడ్డమాలస్యం నాకు వెంటనే మా వూరు... సినిమా టాకీసు... ఆకాశం... చాప... వురుకులాట... గుర్తుకొచ్చేసి మనసంతా నోట్లో పూర్ణం కర్జికాయ పెట్టుకోని నమిలినంత కమ్మగా ఐపోతాది.