ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నలుగురు వరదా!: --సేకరణ - జగదీశ్ యామిజాల
November 19, 2020 • T. VEDANTA SURY • News

నేను ఉదయం వార్తాపత్రికలో ప్రూఫ్ రీడరుగా చేరినప్పుడు ఎడిట్ పేజీలో అబ్బూరి వరద రాజేశ్వరరావుగారు 
ఓ కాలమ్ రాసేవారు. ఆ కాలమ్ పేరు "వరదకాలం"  అప్పట్లో నేను ఈ కాలమ్ ఒకటీ అరా ప్రూఫ్ రీడింగ్ చేసిన సందర్భాలున్నాయి. అబ్బూరివారు ఈ కాలమ్ కింద తన సాహితీమిత్రులను పరిచయం చేస్తుండేవారు. తర్వాతి రోజుల్లో ఇది వరదకాలం పేరిట ఓ పుస్తకంగా వెలువడింది. ఈ పుస్తకం నాకు రామడుగు రాధకృష్ణమూర్తిగారిచ్చారు. రామడుగువారికి చలంగారంటే ఎంతో ఇష్టం. ఈయన ఓ పుస్తకాలపురుగు. ఈయన కుమారుడు రఘు ఉదయంలో నా సహోద్యోగి.  ఆ పుస్తకంలో అబ్బూరివారు చలంగారితో రాసిన పరిచయంలోంచి కొన్ని మాటలు ఇక్కడ ఇస్తున్నాను....

"నేను యింతో అంతో కవిత్వం చెబుతానని ఆయనకి (అంటే చలంగారికి) తెలిసిన రోజు నుంచీ కవిత్వంలో పడమని ప్రోత్సహిస్తుండే వారు. ఆయనతో షికారు పోయినప్పుడూ కవిత్వం దారిలో చెప్పుకుంటూ పోదాం పదమనేవారు. అప్పటికి నేను కంద పద్యం మీదా, ఆటవెలదిమీదా అధికారం సంపాయించాను. వెంకటచలంగారికీ ఆ లక్షణం తెలుసు. మన కవిత్వం నలుగుర్నీ నవ్వించేట్టో యేడ్పించేట్టో ఉండాలనేవారు. 

ఒక సాయంకాలం యిద్దరం పోతున్నాం. రోడ్డు కవతలా యివతలా గుడిసెలు. దారీ మధ్యన నడుస్తున్నాం. నేనాగి యిప్పుడే వస్తానని ఓ గుడిసె మాటుకి పోయాను. ఆయన గాభరాగా ముందుకి వెళ్ళిపోయి దూరంగా నిలబడ్డాడు. నా పనయిన తరవాత పరిగెడుతూ ఆయన పక్కన నిలబడి అన్నాను....

గుడిపాటి వెంకట చలము
గడగడ వణకు నన్ను చూసి కారణమేమో

ఆయన వెంటనే

వడి వడి పోయన్ తడబడ
నడి వీధిని నవ్వుదురని నలుగురు వరదా! 
అన్నారు. 

వెంకట చలంగారి నైజం ఒకటుంది. తన వల్ల కాని యితరులవల్ల కానీ హాస్యం స్ఫురించిందంటే విరగబడి నవ్వేవారు. ఆయన నవ్వటం మొదలుపెట్టాడు. మేం నడిచినంతసేపూ నవ్వుతూనే ఉన్నారు"