ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నవరస భావాలంకృత: -ఎం బిందుమాధవి
November 22, 2020 • T. VEDANTA SURY • Story

"నవరస భావాలంకృత
కవితాగోష్ఠియును మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి సంకూదినట్లు సిద్ధము; సుమతీ! "


నవరసాలు ఒలికించే గొప్ప కవితాగానం, పండితుల గోష్ఠి, రసవత్తరంగా భావావేశంతో సాగుతున్న సంగీత సభ, ఒక అవివేకిని రంజింప చెయ్యలేవు. అందులో మాధుర్యం అతను ఆనందించలేడు. అది ఎలాంటిదంటే, చెవిటి వాడి వద్ద పెద్ద శబ్దం కలిగించే శంఖం ఊదితే వాడికెలా వినిపించదో అలాగే అని ఈ పద్య భావం.

ఈ కధ ద్వారా మరింత వివరంగా తెలుసుకుందాము....


సిటీ లో ఉన్న చిన్నా పెద్దా కళాకారులందరు పాల్గొంటున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలు రవీంద్ర భారతి లో పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. ఓ పక్కన అంతా వాద్యకారులు కూర్చుంటే, మరోపక్కన పాడేవారితో ప్రాంగణ మంతా కోలాహలంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నది.

అంతమంది పరవశంతో పంచరత్న కీర్తనలు ఆలపిస్తుంటే, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమత్ సమేతంగా వేంచేసి ఆ గానాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఉన్నది ప్రాంగణం.

మాధవి ఆఫీస్ నించి వస్తూ, కార్ ని రవీంద్ర భారతి ప్రాంగణంలోకి తిప్పి రెండు గంటల పాటు ఆ కార్యక్రమాన్ని చూసి, విని ఆనందించి వచ్చింది.

ఇలా ప్రతి సంవత్సరం ఊళ్ళో జరిగే త్యాగరాజ స్వామి, రామదాసు, అన్నమయ్య ఆరాధనోత్సవాల సందర్భంలో అనేక మంది కళాకారులని ఒకే వేదిక మీద చూసే అవకాశం వస్తుంది కాబట్టి మాధవి ఆఫీస్ కి సెలవ పెట్టి మరీ వెళ్ళి ఆ కార్యక్రమాలని ఆనందించి వస్తుంది.

మాధవి ఇంట్లో అందరు సంగీతాభిరుచి ఉన్న వారే. చిన్నప్పడు తల్లో, తండ్రో వెంటపెట్టుకుని సంగీత నృత్య కార్యక్రమాలకి తీసుకెళ్ళే వారు.

కుటుంబ సభ్యులతో సంగీత నృత్య కార్యక్రమాలకి వెళ్ళే అలవాటు ఉన్న మాధవి, పెళ్ళయ్యాక,భర్త మోహన్ రావు ని ఆ సంవత్సరం తనతో పాటు ఆ కార్యక్రమాలకి రమ్మని పిల్చింది.

ఆ రోజు మాండొలిన్ శ్రీనివాస్ కచేరీ ఉన్నదని చాలా ఉత్సాహంగా మాధవి భర్తని రమ్మన్నది. మొదటి సారి భార్యని చిన్నపుచ్చలేక తోడు వెళ్ళి, అరగంట అతి కష్టం మీద కూర్చున్నాడు. ఇక సంగీతం ఆస్వాదించలేక, ఆ మాట పైకి చెప్పలేక ఆఫీస్ నించి ఫోన్ వచ్చింది, అర్జెంట్ గావెళ్ళాలి అని భార్య కి చెప్పి బయట పడ్డాడు. పాపం మాధవికేం తెలుసు, మోహన్ రావు అప్పటి వరకు జీవితంలో శాస్త్రీయ సంగీతం అనేది వినలేదని!

మాధవి సంగీతం మీద ఉన్న ఇష్టం చొప్పున రెండు మూడు సభల్లో సభ్యత్వం తీసుకుని సంవత్సరంలో మ్యూజిక్ సీజన్ వచ్చినప్పుడు 15-20 కార్యక్రమాలకి వెళుతూ ఉంటుంది.

మాధవికి సంగీతంతో పాటు సాహిత్యాభిలాష కూడా మెండు. ఎక్కడైనా సాహిత్య సభలు, కవితా గోష్టులు, అవధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, తనకున్న వెసులుబాటుని బట్టి వెళ్ళొస్తూ ఉంటుంది.

ఈ సంగీత సాహిత్యాల పట్ల మోహన్ రావు కి పెద్దగా అభిరుచి లేదు. కానీ భార్య ని రాత్రిపూట జరిగే కార్యక్రమాలకి ఒంటరిగా పంపలేడు. అలా అని తను తోడు వెళ్ళి చివరిదాకా అభిరుచిలేని కార్యక్రమాలని ఆస్వాదించలేడు.

ఒక రోజు మోహన్ రావు స్నేహితుడు భార్యతో కలిసి వీరింటికి వచ్చాడు. మాధవి ఆవిడని చూస్తూనే తనొక పెద్ద కళాకారిణి అని, ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాల్లో ఆవిడ 2-3 గంటలు కచేరి చేస్తుందని ఉత్సాహంగా భర్త కి చెప్పి, వారికి మర్యాద చేసే పనిలో పడింది.

మాటల్లో ఆ మరునాడు తన భార్య కచేరి గవర్నర్ గారి సమక్షంలో ఉన్నదని, తప్పక రమ్మని మోహన్ రావుని ఆహ్వానించాడు, మిత్రుడు. తనకి సంగీతాన్ని ఆస్వాదించే అభిరుచి లేదు కాబట్టి రాలేనని చెప్పలేడు, అలా అని వచ్చి అసహనంగా అంత సేపు అక్కడ కూర్చోలేడు. "కక్కలేని మింగలేని పరిస్థితి".

ఇది చూసి భర్తని కాపాడే పనిలో పడింది మాధవి.

"నవరస భావాలంకృత
కవితాగోష్ఠియును మధుర గానంబును దా
......................................."

అని సుమతీ శతక కారుడు ఏనాడో చెప్పాడు. అందరూ సంగీతాన్ని ఇష్టపడరు అన్నయ్యగారు. అతని కాలక్షేపాలు వేరు. అందుకే మంచి సంగీత - సాహిత్య కార్యక్రమాలు ఉన్నప్పుడు నన్ను అక్కడ దింపి, తను సినిమాకెళ్ళి తిరిగి ఇంటికెళుతూ నన్ను పిక్ అప్ చేసుకుంటారు అని చెప్పి మోహన్ రావుని రక్షించింది.