ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నాటి ఉత్తరం : జగదీశ్ యామిజాల
November 19, 2020 • T. VEDANTA SURY • Memories

ఇది అరవై అయిదేళ్ళ క్రితంనాటి మాట.
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిగారు చలంగారికి మద్రాసు నుంచి 1955 మార్చి ఆరో తేదీన రాత్రి తొమ్మిదింపావుకి రాసిన ఉత్తరంలో నుంచి కొన్ని మాటలు....

శ్రీ చలంగారికి, నమస్కరించి వ్రాసుకొనేది.
తాము దయతో వ్రాసిన వుత్తరం అందినది. నవ్వాను. ఆశ్చర్యపడ్డాను. ఆలోచించాను. మురళి అడిగితే అప్పచెప్పాను కూడా. అవును, ఆంధ్రదేశంలో ఎన్నికలు అయినై. ఫలితాలు దాదాపు ఒక ప్రావిన్సుకు చెందిన ఎన్నికలే కానీ, యావత్ ప్రపంచాన్నీ ఆకర్షించినవి ఈ ఎన్నికలు. ఢిల్లీలో ఉన్న విదేశాలకు చెందిన పత్రికా రిపోర్టరులు ఆంధ్రదేశం పర్యటించారు. వ్రాశారు. కొన్ని కోట్ల రూపాయలు - ధ్వంసం అయినై. మీరు అన్నట్లు కురుక్షేత్రం లాగానే ఆంధ్రదేశం అయింది. దైవబలం లేని కమ్యూనిష్టులు ఓడీపోయారు. ఘోరపరాజయాన్ని మూట కట్టుకున్నారు. కారణం - 1. దైవబలం లేకపోవడం, 2. తమ అహంకారాన్ని అదుపులో పెట్టుకోకపోవడం. 3. నేర్పు అనే దాన్ని మరచి నోటికి వచ్చినట్లు మాట్లాడి గగ్గోలు చెయ్యడమూ. 4. సరియైన నాయకత్వం లేకపోవడం ఇత్యాది కారణాలు ఏ వొక్కటైనా చాలు. అన్నీ కలిసినవి. దేశంలో జరిగిన దురంతాలు, అక్రమాలు, మొదలయినవి ఎన్నో. నాకు తెలిసినవి బహుకొద్ది. వస్తున్నాగా. మీకు చెబుతాను. 

అవును, ఈశ్వరుణ్ణి వదులుకొన్నవారు మిమ్మల్ని మరవడం నిజం. అది అంతే. నేడు మీరు లేరు. చాలా భాగం మిమ్మల్ని ఈశ్వరుడు తినేశారు. ఈశ్వరుడితో లంకెపడ్డారు. ఎవరిదాకానో ఎందుకు? నాకు గూడా మీకు ఉత్తరం రాద్దాం అనిపించదు. ఈశ్వరుడికి వ్రాయడం, మీకు రాయడం. చలం, మనిషి, ఆయన హృదయం. ఆయన నియమనిష్ఠలు, రసజ్ఞత, విజ్ఞానం అన్నీ హూష్ కాకీ అయినై. ఇందుకు వగచి లాభం లేదు. ఈశ్వరుడు ఉన్నారూ. చలమూ వున్నాడు.....

శ్రీశ్రీ కవి కన్న తత్వవేత్త అన్నారా ఈశ్వరుడు. చలమూ అంతే కద. చలాన్నీ శ్రీశ్రీనీ చీల్చుకొనే వచ్చింది కళ.  కృష్ణశాస్త్రిగారికి అయితే బురదలోంచి పద్మం మొలిచినట్లు, విశ్వనాథ సత్యనారాయణగారు కవిత్వాన్ని లాగినట్లూ, నండూరి సుబ్బారావుగారికి తుఫానుగాలి తలుపుల్ని తోసుకొని వచ్చినట్లూ, ఆ కవి కంఠం లోంచి పాటలు పైకి ఉరికినట్లూ అనుకుంటాను. మీకూ, శ్రీశ్రీకి చీల్చుకుని రచనలు వచ్చినట్లుగా భావిస్తాను.....

శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారు మళ్ళీ భాగవతం అన్న మాట ఎత్తడం లేదు. పైగా వారో చిక్కులో పడ్డారు. వారి బడిలో ఒక నవోఢ ఒక ప్యూనును తీసుకొని లేచిపోయిందట. అది అల్లరి అయింది. దీంతో తనకు ఏమి ప్రమాదం వస్తుందో అన్న క్షోభలో వున్నట్లు వున్నారు స్వామిగారు....

నాగయ్య గారు కనిపించనే లేదు. రేపు సెలవ గీకుతున్నా. సెలవుకీ డబ్బు వేట, 15 రాత్రి కదలడం. వో వారం రోజులు మహాస్థాన్ లో ఉండడమూ. 

ఇదీ ఇప్పటి కల.
మీ 
జ. రుక్మిణీనాథ శాస్త్రి

--------------------   
గమనిక.
జలసూత్రంగారి వల్లే మా నాన్నగారైన పద్మనాభస్వామిగారికి చలంగారు పరిచయమయ్యారు. మా నాన్నగారు మమ్మల్ని తిరువణ్ణామలైలో చలంగారి రమణస్థాన్ కి తీసుకెళ్ళడం వంటివన్నీ జరిగిపోయాయి. జలంసూత్రంగారికి కృతజ్ఞతలు. ఈయన తరచూ మా ఇంటికి వచ్చేవారు. టీ. నగర్లో మేము తిలక్ స్ట్రీట్లో ఉన్నప్పుడు జలసూత్రంగారు ఉస్మాన్ రోడ్లో నివాసం ఉండేవారు. మా ఇంటికి నడకదూరమే వారిల్లు. 
-------------------