ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నా బొంత---సత్యవాణి కుంటముక్కుల86 39 66 05 66కాకినాడ- ఆంధ్రప్రదేశ్
September 24, 2020 • T. VEDANTA SURY • Memories

బొందిలో ఎన్నెన్ని జ్ఞాపకాలో
బొంతలోనూ అన్నన్ని జ్ఞాపకాలే
బొంతంటే పాతచీరల మడతలు కాదు
బొంత అమరికలో చీరలు పాతవైనా
ఆ చీరలు నావద్దకు చేరిన సందర్భం 
నిత్యనూతనం
బొంతలొ చీరల లాగానే
మనసులో జ్ఞాపకాల దొంతరలు
అనేకం అమోఘం
పరికిణీ ఓణీలనుంచి
పట్టుపట్టి అమ్మతో కొనిపించుకొన్న
మొట్ట మొదటిచీర
పువ్వుల పువ్వుల వాయిలుచీర
అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు
మా మావయ్యకొన్న
ఔరంగాబాద్ అరటిపువ్వురంగు చీర
నన్ను పెళ్ళికూతుర్ని చేసినప్పుడు
అత్తయ్య పెట్టిన ఆవపువ్వురంగు ఆరణిపట్టు  చీర
పెద్దమ్మలు పిన్నమ్మలు చిన్నాన్నలు ప్రేమతో పెట్టిన
రంగు రంగుల రకరకాల చీరలు
మొదటిరాత్రిచీర
పెద్దాడు కడుపున పడినప్పుడు
సీమంతం చీర
బాలసారె చీర
వాడి వడుగుకు
అమ్మానాన్నలు పెట్టిన చీరలు
అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళూ 
ఆదరంతో పెట్టిన
అందమైన ఆకర్షణీయమైన చీరలు
పిల్లల పెళ్ళిళ్ళకు వియ్యాలవారు పెట్టిన ,వింతవింతల చీరలు
అన్నీ ఈ బొంత పొరల అమరికలోనే
అచ్చంగా మస్థిష్కపొరలకిమల్లే
ఇమిడి పోయాయి
 ఆ బొంత వాసన పీలిస్తేచాలు
ఇతరులకు ముక్కవాసన వేసే నాబొంత
నాకుమాత్రం సుఘంధాలు అందిస్తుంది
ఘుమ్మని మల్లెల సౌరభంమల్లే
జ్ఞాపకాల అరలు పొరలు పొరలుగా విచ్చుకుంటాయి
కంటిపాపల తెరలపై ఆ ఆ ఘట్టాలు
కదలి ఆడుతాయి చిత్రాలుగా
విచిత్రాలుగా
అవి నాకు
ఈత్సాహం ఉత్తేజం కలిగిస్తాయి
 ఉరుకుడిగిన నా రక్తాన్ని 
ఉత్సాహంతో
 ఉరకలు వేయిస్తుంటాయి
అందుకనే నాబొంత నాకు అపురూపం
మరిన్ని మంచి జ్ఞాపకాలను
మరికొన్ని చీరమడతలను
పైన పరచి పదిలపరచుకొంటాను నా బొంతలో