ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
నిజాయితీ (పిల్లల కథ) రచన ~బి. వి. పట్నాయక్. 9441349275
October 29, 2020 • T. VEDANTA SURY • Story

 రాము, సోము ఇద్దరూ ఉన్నత పాఠశాలలో చదువుచున్న విద్యార్ధులు. ఒకరోజు యధావిధిగా పాఠశాలకు నడుచుకుంటూ బయలుదేరారు. ఇంతలో ఒక బైక్ వాళ్ళని దాటుకుంటూ విపరీతమైన వేగంతో పోతుంది. అనుకోని ఆ సంఘటనకు ఇద్దరూ తుళ్ళి పడ్డారు.
            'అతి వేగం ఎంత ప్రమాదకరమైనది' అన్నాడు రాము.
          'పోగాలం దాపురిస్తే ఇటువంటి బుద్ధే పుడుతుందని మా నాయనమ్మ చెబుతుండేది' విసురుగా అన్నాడు సోము.
            వేగంగా పోతున్న బైక్ నుండి ఏదో వస్తువు జారి పడినట్టు కనిపించింది ఇద్దరికి.
              'పాపం! ఏదో వస్తువు జారవిడిచుకున్నారు' జాలి పడుతూ అన్నాడు రాము.
          ' తిక్క కుదిరింది! ' మూతి విరిస్తూ అన్నాడు సోము.
            రాము మాత్రం బైక్ పై పోతున్న ఇద్దరిని 'అంకుల్, అంకుల్' అంటూ కేకేసి పిలిచాడు.
         బైకు శబ్ధపు హోరులో రాము అరుపులు బైకుపై వెళ్తున్న వారికి వినిపించేటట్టులేదు.
      ' సోముా!  బైకు నెంబరైనా చూశావా?' అడిగాడు రాము.
         ' చూశాను! అయితే ఏమిటట? 'వ్యంగ్యం గా సమాధానమిచ్చాడు సోము.
         'పడిన వస్తువును వాళ్ళకి అందజేద్దామని' చెప్పాడు రాము.
           ' నీ పరోపకారి బుద్ధి గొప్పగుంది. పాఠశాలకు ఆలస్యమైతే  అక్కడ బెత్తంతో సత్కారాలు చేయగలరు' తొందర పెట్టసాగాడు సోము.
           '  నిర్మానుష్యంగా ఉంది. ఆ వస్తువుని తీసి జాగ్రత్త చేసి తీరిక ఉన్నప్పుడు పోలీస్టేషన్ కి అందజేస్తాను. నాతో పాటు రా! ' బతిమలాడు రాము.
          సరేనన్న సోముతో పాటు రాము గబగబ అడుగులు వేసుకుంటూ వస్తువు పడిన చోటుకు చేరుకున్నాడు.
           అదొక సంచి. రాము గబుక్కున తీసి సంచి విప్పి చూశాడు. నాలుగు ఐదువందల నోట్ల కట్టలు కనిపించాయి. ఇద్దరూ నమ్మలేకపోయారు.
          సోము మాత్రం 'పక్కకు పద ఈ సంచిలో ఇంకా ఏమున్నాయో? చూద్దాం ! 'అంటూ రాముని పక్కకు తీసుకుపోయాడు.' నీకు రెండు, నాకు రెండు ' అంటూ వాటాలు వేసేశాడు.
            రాము నిర్ఘాంతపోయాడు. పరుల సొమ్ము పామువంటిదని మన ఉపాధ్యాయులు చెప్పారుగా గుర్తు చేశాడు.
        ' ఎదుటివారికి చెప్పేందుకే నీతులు పుట్టాయి. అవి మనం ఆచరిస్తే సుఖపడలేం. నా వాటా నాకు, నీ వాటా నీకు పంచుకొని కథ సుఖాంతం చేసుకుందాం! ' సలహాగా చెప్పాడు.
          'నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టంలేదు. నీ వాటా నువ్వు తీసుకో నా వాటా మాత్రం పోలీసులకు అందజేస్తాను ' పిడుగులాంటి తన నిర్ణయాన్ని చెప్పాడు రాము.
          నా ఊహలను చిత్తు చేశావు.నా సంతోషానికి చరమగీతం పాడావు' నిష్ఠూరమాడాడు సోము.
           'నీ వాటాతో నువ్వు ఏమి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నిష్ఠూరమాపి నిజాయితీగా ఆలోచించు ' విడమరచి చెప్పాడు రాము.
           'నువ్వు నీ నిజాయితీ నిరూపించడానికి పోలీసులను ఆశ్రయిస్తే, నా వాటా డబ్బు గురించి వాళ్ళు తప్పని సరిగా ఆరా తీస్తారు. అప్పుడు దొరికితే ఇంకేమైనా ఉందా? గడ్డి వాము దగ్గర కుక్క, అది తినదు మిగిలిన వాటికి తిన నివ్వదు.అలా ఉంది నీ వ్యవహారం ' ఒకింత అసహనంతో అనేశాడు సోము
            'నువ్వు దేనితో పోల్చినా నేను బాధపడను. నిజాయితీని మనం నమ్ముకుంటే ఆ నిజాయితే మనల్ని రక్షిస్తుందని పెద్దలు చెబుతుంటారు 'ముక్తసరిగా అన్నాడు రాము.
           'క్రికెట్ కిట్టు, మంచి సైకిలు , ఖరీదైన బట్టలు ఎన్నో ఊహించుకున్నాను. కోరి కొరివితో తల గోక్కునేకన్నా నీతో పాటు పోలీస్టేషన్ కి వచ్చి డబ్బులందజేయడమే మంచిదనిపిస్తుంది. ఒకపక్క స్కూలుకి టైమైపోతుంది. అక్కడ పనిష్మెంట్ తప్పేటట్టు లేదు ' అంటూ తన అసంతృప్తిని వెల్లగక్కాడు సోము.
           ' నీకు ఎటువంటి పనిష్మెంట్ లేకుండా చూసుకొనే బాధ్యత నాది ' హామీ ఇచ్చాడు రాము.
            ఇద్దరూ ఆ నగదుతో పోలీస్టేషన్ కి వెళ్ళారు. జరిగిన విషయమంతా చెప్పి దొరికిన నగదు అందజేశారు.
          పోలీసులు ఆ నగదుని పరిశీలించి చూశారు. వాళ్ళకి ఏదో అనుమానం వచ్చినట్టుంది. బ్యాంకు ఆఫీసర్లకు రమ్మనమని ఫోను చేశారు.
            పోలీసులు చేస్తున్న హడావుడి ఈ ఇద్దరికి గందరగోళంగా కనిపించింది.
             'మేము స్కూలుకి పోవాలి' భయం భయంగా అడిగాడు సోము.
            ' బ్యాంకు ఆఫీసర్లు కొద్దిసేపట్లో వస్తారు. వారు వచ్చాక మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి' అన్నాడు పోలీసాఫీసరు.
             సోముకి వణుకు ప్రారంభమైంది. 'ఎరక్కపోయి నీతో వచ్చి ఇరుక్కుపోయాను' గొనుక్కుంటూ రాము చెవిలో అన్నాడు.
         ' భయపడనవసరం లేదు ' సోముకి ధైర్యం చెప్పాడు రాము.
            ఇంతలో బ్యాంకు ఆఫీసరు వచ్చాడు. పోలీసులు అందజేసిన నోట్లను పరిశీలించి చూశాడు. ఇవి దొంగనోట్లు తేల్చి చెప్పాడు.
          సోము గుండె గతుక్కుమంది. తన వాటా తీసుకొని ఖర్చు పెడితే  పోలీసులకు ఎప్పటికైనా దొరికిపోయి ఉండేవాడిననే సత్యం బోధపడింది.  అలా తలచుకోడానికే భయమనిపించింది.
           'మీకు ఈ నోట్లు ఏ ప్రాంతంలో దొరికాయి? ఆ బైకు ఎటు నుండి వచ్చింది? ఎటు వైపు వెళ్ళింది? ఆ బైకు మీద ఎంత మంది ఉన్నారు? వాళ్ళ వయస్సులు ఎంత ఉంటాయి? బైకు నెంబరు ఎంత? ' ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు.
          సోము బెక్కుతున్నా రాము అన్నింటికీ సమాధానాలు చెప్పాడు. సోము మాత్రం తనకు గుర్తున్న బైకు నెంబరు చెప్పాడు.
            పోలీసులు సంతృప్తి చెందారు. 'దొంగనోట్లు చెలామణి చేసే ముఠా పట్నంలో ఉందని ఈ మధ్య సమాచారం మాకు వచ్చింది. అది ఇప్పుడు మీ ద్వారా రుజువైంది .సమాజానికి మీ వలన ఇప్పుడు మంచి జరుగబోతుంది. అమాయకులు మోసపోకుండా మీరు ఇచ్చిన సమాచారంతో ఆ ముఠాను పట్టుకొనే ప్రయత్నం చేస్తాం. రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మీ నిజాయితీకి మంచి బహుమతి ప్రదానం చేస్తాం ' పోలీసాఫీసరు వాగ్ధానం చేశాడు.
               సోము సంతోషానికి అవధుల్లేకపోయాయి.మెుదటసారిగా  నిజాయితీ గొప్పతనం తెలుసుకున్నాడు.
           ' పోలీసు జీపుపై ఇద్దరిని పాఠశాలకు దిగబెట్టి, ప్రధానోపాధ్యాయుడికి వీళ్ళ నిజాయితీ నడవడిక గురించి తెలియజేయండి' అంటూ పోలీసులకు ఆదేశించాడు పోలీసాఫీసరు.
             'ఒక మంచి మిత్రుడి సావాసం నన్ను ఈ రోజు అన్ని విధాలా కాపాడింది. నిజాయితీని నమ్ముకుంటే ఆ నిజాయితే మనల్ని రక్షిస్తుందని పెద్దలు చెప్పిన మాటలు అక్షరాలా నిజం. పొరపాటున పైసలకు కక్కుర్తి పడితే కటకటాలు లెక్కపెట్టవలసి వచ్చేది. నీ నిజాయితీని చులకనగా చూసినందుకు నన్ను మన్నించు' అంటూ సోము, రాము చేయిని గట్టిగా పట్టుకున్నాడు.
           పోలీసు జీపు ఇప్పుడు పాఠశాల ఆవరణలో ఆగింది. విద్యార్ధులు, ఉపాద్యాయుల ముందు రాము, సోముల గురించి గొప్పగా చెప్పారు పోలీసులు.